‘పది’లో శతశాతం సాధనకు ప్రణాళికలు

సిద్దమైన స్టడీ మెటీరియల్, నమూనా ప్రశ్నపత్రాలు
ఆర్ఎంఎస్ఏ నుంచి రూ. 2.44 కోట్ల విడుదల
జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారెడ్డి
కొత్తూరు (అనకాపల్లి), న్యూస్టుడే: పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఫలితాలను సాధించే దిశగా ఇప్పటి నుంచే ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి ఆదేశించారు. అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల ఆడిటోరియంలో సోమవారం ఎలమంచిలి డివిజన్ స్థాయిలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇకపై పదో తరగతి విద్యార్థుల వివరాలన్నీ ఆన్లైన్లోనే నమోదు చేయాలన్నారు. పక్కా సమాచారాన్ని పొందు పరచని పక్షంలో విద్యార్థి పరీక్షకు హాజరు కావడానికి అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు. విద్యార్థి ఒక్క సబ్జెక్టులో పరీక్ష తప్పినా ఉపాధ్యాయులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఒకటో సమ్మెటివ్ పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థిపై అంచనాలు, ప్రణాళికలు, కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పరీక్షలకు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 125 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ ఇప్పటి నుంచే కార్యాచరణ అమలు చేస్తోందన్నారు. స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్లు సిద్ధం చేశామని తెలిపారు. జిల్లా ఉప విద్యాశాఖాధికారి రేణుక, సహాయ కమిషనర్ రాంబాబు, పర్యవేక్షకుడు వినయ్మోహన్, ఏసీఓ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు గంగుపాం నాగేశ్వరరావు, కాగిత అప్పారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఎంఎస్ఏ నుంచి నిధులు
జిల్లాలోని 470 ఉన్నత పాఠశాలలకు రూ. 2.44 కోట్ల పాఠశాల గ్రాంటును విడుదల చేశామని డీఈఓ కృష్ణారెడ్డి తెలిపారు. అనకాపల్లి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 100 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ. 35 వేలు, 101 నుంచి 200 లోపు విద్యార్థులుంటే రూ. 55 వేలు, 201 నుంచి 300 లోపు విద్యార్థులుంటే రూ. 75 వేలు, 301 నుంచి 400 లోపు విద్యార్థులుంటే రూ. లక్ష, 400 పై బడిన ఉన్నత పాఠశాలలకు రూ. 1.15 లక్షలు విడుదల చేశామన్నారు. జిల్లాలో 816 వంటషెడ్లకు గాను 398 పూర్తి కావచ్చాయని తెలిపారు. జిల్లాలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ (ఆర్ఎంఎస్ఏ) నిధుల నుంచి 1407 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులకు రూ. 200 చొప్పున విజ్ఞాన యాత్రలకు మంజూరు చేశామన్నారు.
విజయనగరంలో ఇన్స్స్పైర్ ప్రదర్శన
విశాఖ, విజయనగరం జిల్లాల స్థాయి ఇన్స్స్ఫైర్ వైజ్ఞానిక ప్రదర్శన విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలోని సెయింట్ ఆన్స్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నామని కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో ఎంపికైన పాఠశాలల విద్యార్థులతో సంబంధిత ఉపాధ్యాయులు తప్పనిసరిగా ప్రదర్శనలతో హాజరు కావలసి ఉంటుందని ఆయన చెప్పారు.
పురాతన నాణేలు.. పాత నోట్లు