News

Realestate News

పడవల్లో.. హాయ్‌ హాయ్‌!

పడవల్లో.. హాయ్‌ హాయ్‌!
దేశంలోనే తొలిసారిగా విశాఖ తీరంలో నిర్వహిస్తున్న పడవల పండగ ఆసక్తి రేపుతోంది.. ఈ వేడుక కోసం తీరంలోని నిర్దేశిత ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.  ఏర్పాట్లను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, పర్యాటశాఖ ప్రాంతీయ సంచాలకుడు శ్రీనివాసన్‌, జిల్లా పర్యాటక అధికారి పూర్ణిమాదేవి పర్యవేక్షిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, అతిథులు ఆశీనులయ్యే ప్రాంతాలు, భోజనశాలలు, స్వాగత ప్రాంగణం ఇతరత్రా వేదికల నిర్మాణాలు ఈ- ఫ్యాక్టర్స్‌ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ప్రముఖులకు గాలా డిన్నర్‌.. మిగిలిన ఆహుతులకు ప్రత్యేకంగా భోజన వసతులకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనాడు – విశాఖపట్నం
లాహిరి.. లాహిరి.. లాహిరిలో..
నీలి నురగల సాగర అలల నడుమ పడవ ప్రయాణం అంటే ఆ అనుభూతే వేరు.. ఈ ఆనందాన్ని కొందరు పర్యాటకులతోపాటు స్థానికులూ అందుకోబోతున్నారు. ‘పెద్దోళ్లకే పడవల పండగ’ శీర్షికన సోమవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంతో వేడుక నిబంధన, ప్రణాళికల్లో పర్యాటకశాఖ మార్పులు చేసింది. స్థానికులను, మత్యకారులను భాగస్వామ్యులను చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రత్యేక పోటీలకు, నగదు బహుమతులకూ సన్నాహాలు చేస్తున్నారు.
* తొమ్మిది పడవలను డ్రైడాక్‌ జట్టీ వద్ద లంగరు వేస్తారు. అక్కడ్నుంచి రోజువారీ రెండు నుంచి మూడు గంటల పాటు సముద్రయానం సాగుతుంది.. ఆ తర్వాత విందు, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు.. రాత్రికి గాలా డిన్నర్‌తో వేడుక ముగుస్తుంది.
* వేడుక నిర్వహించే నాలుగు రోజుల్లో ఐదుగురు పాఠశాల విద్యార్థులను, మరో ఐదుగురు స్వయం సహాయక సంఘాల మహళలను అధికారులు ఎంపిక చేసి యాటింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
* యాటింగ్‌లో పాల్గొన్నవారికి ఆయా తీరాల్లో భోజన ఏర్పాట్లు చేయాలని తొలుత భావించినా కెరటాల ఉద్ధృతి నడుమ బోట్లు నిలపడం వాళ్లు దిగి, ఎక్కడం.. ప్రమాదంతో కూడుకున్న వ్యవహారం కనుక బోటులోనే భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
* నిత్యం రద్దీగా ఉండే ఆర్కే బీచ్‌లో పడవల విన్యాసాలను ప్రదర్శించాల్సి ఉన్నా.. అక్కడ కెరటాల ఉద్థృతి ఎక్కువగా ఉండడం వల్ల సాధ్యపడడంలేదని అధికారులు చెబుతున్నారు.
* తీరంలో నావెల్‌ క్వార్టర్స్‌ ఎదురుగా సాగరం నిలకడగా ఉన్న కొద్ది ప్రాంతంలో సందర్శకుల కోసం ఫ్లై బోటింగ్‌ విన్యాసాన్ని అందుబాటులో ఉంచనున్నారు.

వేడుక ఉద్దేశం..
సాగరంలో విహరిస్తూ.. కట్టిపడేసే విశాఖ సాగర తీర అందాలను అంతర్జాతీయ పర్యాటకులకు చూపించాలన్నదే ఈ కార్యక్రమ ఉద్దేశం. అన్ని వసతులున్న పడవల్లో ఈ విహార యాత్ర సాగుతుంది. థాయ్‌లాండ్‌, చెన్నై, గోవాల నుంచి వీటిని రప్పిస్తున్నారు. వరుసగా తొమ్మిది పడవలు.. వాటికి ముందుగా రెండు భారీ పడవలు.. వెనక 10 చిన్న పడవలు ఎస్కార్ట్‌గా వెళ్తాయి. రంగురంగుల జెండాల రెపరెపలతో ప్రతిరోజూ పడవలన్నీ వృత్తాకారంలో ఓ చోటుకు చేరడం.. ఆ మధ్యలో జల క్రీడలు.. నిపుణుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. నిర్దేశిత ప్రాంతాల్లో ఒకవైపు ప్రయాణం గంటన్నర వరకు ఉంటుంది.
* తొలిరోజు రుషికొండ.. రెండో రోజు యారాడ.. మూడో రోజు తొట్లకొండ, నాలుగో రోజు భీమిలి వరకు షికారు సాగుతుంది.

పాల్గొనేది ఎవరు..?
* ప్రజాప్రతినిధులు, కీలక ఉన్నతాధికారులు, ట్రేడర్లు, హోటళ్ల నిర్వాహకులు, జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులు. తాజాగా విద్యార్థులు, డ్వాక్రా మహిళలకు అవకాశం కల్పించారు.
* ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో పోటీలు నిర్వహించి 20 మంది విజేతలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. వీరికి వేడుకల్లో పాల్గొని సముద్రయానం చేసే అవకాశం కల్పిస్తారు.
* జాతీయ, స్థానిక మీడియాకు ప్రతిరోజూ పోటీలు నిర్వహించి.. ఆకర్షణీయమైన చిత్రాలు తీసినవారిని ఎంపిక చేసి యాటింగ్‌కు అవకాశం కల్పిస్తారు.
* ఈ నెల 29న యాటింగ్‌ ఫెస్టివల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారని అధికారులు చెబుతున్నా.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ప్రారంభ, ముగింపు వేడుకల్లో ఎవరెవరు పాల్గొంటారన్న దానిపై స్పష్టత లేదు.

ఆసక్తి కొందరికే..
ఏర్పాట్లు ఘనంగా ఉన్నా.. పర్యాటకుల నుంచి అంతంత మాత్రమే స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో ప్రచారం లేకపోవడం.. టిక్కెట్టు ధరలు భారీగా ఉండడమే దీనికి కారణం. రోజుకు 110 నుంచి 120 మంది వరకు పడవల్లో ప్రయాణం చేసి ప్రత్యేక అనుభూతి పొందే వీలున్నా.. ఇప్పటి వరకు కేవలం 15 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మరో రెండు రోజులే గడువు ఉండడంతో స్పందన ఏమేరకు ఉంటుందో వేచిచూడాల్సిందే.

హైలెస్సో.. హైలెస్సో..
పడవల పండగను భీమిలి తీరంలో నిర్వహించాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మొదట్నుంచి పట్టుబట్టారు. అక్కడ జట్టీ లేకపోవడంతో సాధ్యం కాదని నిర్వాహకులు తేల్చి చెప్పారు. కనీసం మత్స్యకారులకు పడవల పండగైనా నిర్వహిస్తే స్థానికులను భాగస్వామ్యులను చేసినట్లు ఉంటుందన్న సూచన మేరకు రంగం సిద్ధం చేస్తున్నారు. 29న వేడుక నిర్వహించే డ్రైడాక్‌ జట్టీ వద్ద.. 31న భీమిలి తీరంలో ఈ పోటీలుంటాయి. 200 మీటర్ల నిడివిలో నిర్ణీత సమయంలో ముందుగా పడవలను నడిపిన మత్స్యకారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుంటాయి. ఒక్కో వేదిక వద్ద విజేతలకు రూ. 50 వేల చొప్పున బహుమతుల రూపంలో ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. కెరటాల తాకిడిలోనూ పడవలను సమర్ధంగా నడపగలిగిన మత్స్యకారులు ఇక్కడ ఉన్నారు. ఒక్కో వేదిక వద్ద 20కు పైగా పడవలు పోటీల్లో పాల్గొనున్నట్లు సమాచారం.

అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసమే..
విశాఖ పర్యాటకానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవడానికే ప్రభుత్వం ‘వైజాగ్‌ యాటింగ్‌ ఫెస్టివల్‌’ నిర్వహిస్తోంది. దీని తర్వాత అనుబంధంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన ఉంది. ఈ తరహా కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతానికి ప్రాచుర్యంతోపాటు.. పెట్టుబడులూ వచ్చే అవకాశం ఉంటుంది. విశాఖకు దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి ఇక్కడ మరింత పెంచేందుకు అనువైన ఏర్పాట్లకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆన్‌లైన్‌, పడవల పోటీల ద్వారా యాటింగ్‌ ఫెస్టివల్‌లో సాధారణ ప్రజలకు, మత్స్యకారులనూ భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

– శ్రీనివాసన్‌, ప్రాంతీయ సంచాలకులు, పర్యాటకశాఖ