News

Realestate News

పంజర సాగు.. ఫలితాలు బాగు

news of vizag development of tourism

సముద్రం, నదులు, జలాశయాల్లోని సహజసిద్ధమైన ప్రవాహాల్లో చేపల పెంపకం కోసం విశాఖపట్నంలోని కేంద్ర సముద్ర, మత్స్య పరిశోధన సంస్థ (సి.ఎం.ఎఫ్‌.ఆర్‌.ఐ.) చేపట్టిన ‘పంజర సాగు’ (కేజ్‌ కల్చర్‌) విజయవంతమైంది. దేశంలోనే మొదటిసారిగా విశాఖ తీరంలోని బంగాళాఖాతంలో ప్రయోగాత్మకంగా తయారు చేసిన వలలతో శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టును అమలు చేశారు. వివిధ బ్యాచ్‌ల్లో చేప పిల్లలను వేసి, వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తూ ఆహారాన్ని అందజేసేవారు. వాటి ఎదుగుదల తీరును ఎప్పటికపుడు పరిశీలించారు. చేపలు సాధారణ చెరువుల్లో కంటే చాలా ఆరోగ్యంగా పెరిగినట్టు గుర్తించారు.
సాధారణ చెరువుల్లో చేపల పెంపకంలో కొన్ని పరిమితులున్నాయి. ఇందులో నీరు ఎటూ కదలక కొద్దివారాలకు పాడైపోతుంది. దీనివల్ల చేపల దిగుబడిని దెబ్బతీసే వైరస్‌ సమస్యలు తలెత్తుతాయి. అదే సముద్రం, నదుల్లో పంజర సాగులో ఈ సమస్య ఉండదు. చేపల పెంపకం కోసం పంజరాలను నిర్ణీత ప్రదేశంలోనే ఏర్పాటు చేసినా.. నీరు మాత్రం ఎప్పటికపుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఫలితంగా చేపలు మంచి ఆరోగ్యకర వాతావరణంలో పెరుగుతుంటాయి. వైరస్‌ల సమస్య చాలా వరకు తగ్గి మంచి ఫలితాలు వచ్చాయి. ఈ విధానం పూర్తిస్థాయిలో విజయవంతమవటంతో గుజరాత్‌, పశ్చిమబంగ, ఒడిశా, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర తదితర అన్ని తీర రాష్ట్రాల్లోనూ వివిధ రకాల చేపలతో ఈ ప్రాజెక్టు చేపట్టారు.

వలే కీలకం….
పంజరసాగులో అత్యంత కీలకమైంది వల. సముద్రంలో ప్రవాహాలను తట్టుకునేందుకు ‘హైడెన్సిటీ పాలీ ఎథిలీన్‌’ పదార్థంతో వలను తయారు చేశారు. ఇది పదేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. పంజర నిర్మాణానికి ఉపయోగించే ఇనుప చువ్వలు తుప్పుపట్టకుండా నాణ్యమైన గాల్వనైజ్డ్‌ ఇనుముతో తయారు చేశారు. పంజర వల నీళ్లలో తేలియాడడానికి వీలుగా కొన్ని ట్యూబ్‌లు, ప్లాస్టిక్‌ టబ్‌లను పైభాగంలో అమరుస్తారు. పంజరం కొట్టుకుపోకుండా యాంకర్‌ను వేసేస్తారు. ఈ తరహా పంజరవలను సుమారు పదేళ్ల వరకు వినియోగించుకోవచ్చు. చెరువుల్లో చేపల పెంపకం వ్యయభరితమే. సముద్రాలు, నదుల్లో పంజర సాగు కోసం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు దేశంలో వెయ్యికిపైగా పంజర వలలతో చేపల పెంపకం జరుగుతోంది.

మంచి స్పందన వస్తోంది
– డాక్టర్‌ సుదీప్తో ఘోష్‌, ఇన్‌ఛార్జి శాస్త్రవేత్త, సి.ఎం.ఎఫ్‌.ఆర్‌.ఐ.
పంజరసాగుపై మా సంస్థ ప్రయోగం విజయవంతమైంది. తొలుత విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా అమలు చేసి ఆ తరువాత అన్ని తీర రాష్ట్రాలకూ విస్తరించాం. మంచి ఫలితాలొచ్చాయి. పంజర వలలను ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించాం. ఆదరణ బాగున్నందున ప్రైవేటు సంస్థలు కూడా పంజరవలలను తయారు చేస్తున్నాయి. పశ్చిమ బంగలో రైతులు వెదురుకర్రలతోనే పంజరవలలను తయారు చేసుకుంటున్నారు. సముద్రం/నదుల్లో పంజర వల ఏర్పాటు చేసేముందు అక్కడి నీటి స్వచ్ఛత తెలుసుకోవాలి. కాలుష్యం ఉండదని నిర్థరించుకున్నాకే సాగు ప్రారంభించాలి. పండుగొప్ప, పాంపనో, కోబియా రకాలు అత్యంత అనుకూలమైనవి. రానున్న రోజుల్లో ఈ తరహా చేపల పెంపకం భారీగా జరుగుతుందని అంచనా వేస్తున్నాం.