News

Realestate News

పంచాయతీ ‘పోరు’కు తొలి అడుగు…

పంచాయతీ ‘పోరు’కు తొలి అడుగు…
ఈ నెల 20నాటికి ఓటర్ల జాబితాలు సిద్ధం
మే 15 నాటికి తుది ప్రచురణ
కసరత్తు ప్రారంభించిన పంచాయతీశాఖ
విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే
పంచాయతీ ఎన్నికల సమరానికి తొలి అడుగు పడింది. ఎన్నికల కమిషను ఆదేశాల నేపథ్యంలో ఓటర్ల జాబితాల రూపకల్పనకు పంచాయతీశాఖ ఉపక్రమించింది. పంచాయతీ అధికారులు ఈ విషయమై క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. బుధవారం జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ తన కార్యాలయంలో ఈవోపీఆర్డీలతో (పంచాయతీ విస్తరణాధికారులు) సమావేశమయ్యారు. ఓటర్ల జాబితాల తయారీపై వారికి సూచనలు చేశారు.

క్షేత్రస్థాయిలో కసరత్తు: ఓటర్ల జాబితాలపై క్షేత్రస్థాయిలో కసరత్తుకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 11 నుంచి జాబితాలను రూపొందించేందుకు చర్యలు తీసుకున్నారు. 20వ తేదీ నాటికి జాబితాలను సిద్ధం చేసేవిధంగా క్షేత్రస్థాయి అధికారులకు గడువును నిర్ధేశించారు. అనంతరం మే 15న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.

అసెంబ్లీ ఓటర్ల జాబితా : అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీ ఓటర్లను గుర్తిస్తారు. పంచాయతీ, వార్డులు వారీగా ఓటరు జాబితాలను తయారుచేస్తారు. నియోజకవర్గంలో మండల తహసీల్దార్లు నుంచి అసెంబ్లీ ఓటర్ల జాబితాలను పొందేవిధంగా ఈవోపీఆర్డీలకు ఆదేశించారు. జిల్లాలో 920 పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో ఎనిమిదివేల పైగా వార్డులున్నాయి. వీటి సంఖ్యమేరకు ఓటర్ల జాబితాలు రూపుదిద్దుకోనున్నాయి.
ఏబీ సాఫ్ట్‌వేర్‌లో నమోదు: ఎన్నికల కమిషను డేటాబేస్‌  ఆధారంగా ఎక్స్‌ఎల్‌ షీట్‌లో (ఏబీ సాఫ్ట్‌వేర్‌)ఓటర్ల వివరాలను నమోదుచేసి చెక్‌లిస్ట్‌లు తయారుచేస్తారు. ముందుగా మాన్యువల్‌ విధానంలో చేసిన తర్వాత ఆన్‌లైన్‌ చేయడం జరుగుతుంది. సాఫ్ట్‌వేర్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఎ, బి రెండు నమూనాల్లో ఉన్న సాఫ్ట్‌వేర్‌లో నమూనా ‘ఎ’ లో ఓటరు కులం, ‘బి’ నమూనాలో సీరియల్‌ నెంబర్లను నమోదుచేస్తారు. గతంలో ముఖపత్రం ఆధారంగా నమోదు చేయాలని అధికారులు ఇప్పటికే సూచించారు. తుదిగా ఈవోపీఆర్డీలు పరిశీలించి జిల్లా పంచాయతీశాఖకు జాబితాలను అందజేయాలి. అనంతరం ఎన్‌ఐసీ(జాతీయ సమాచార వ్యవస్థ) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంతో ఓటర్ల జాబితాలు జనరేట్‌ కానున్నాయని జిల్లా పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ న్యూస్‌టుడేకు తెలిపారు. ఈ నెల 20వ తేదీ నాటికి ప్రక్రియంతా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo