నైపుణ్యం ఉంటే చాలు.. అవకాశాలు బోలెడు
నైపుణ్యం ఉంటే చాలు.. అవకాశాలు బోలెడు
విద్యార్థులతో ఐటీ అసోసియేషన్ ప్రముఖులు
ఈనాడు – విశాఖపట్నం
నైపుణ్యం ఉంటే చాలు.. అవకాశాలు బోలెడు
విదేశీ అవకాశాలు పిలుస్తున్నా, సరైన నైపుణ్యాలు లేకపోవడంవల్లనే ఇంజినీరింగ్ విద్యార్థులు విఫలమవుతున్నారని ఏపీ
ఐటీ అసోసియేషన్ ఛైర్మన్ ఓ.నరేష్ అన్నారు.
గురువారం అదానీ డేటా కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఇంజినీరింగ్ విద్యార్థులకు పలువురు ప్రముఖులు సలహాలు సూచనలు అందించారు.
ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ చాలామందికి పాస్‌పోర్టులు లేవని, కనీసం టైపింగ్ లేకపోవడం బాధాకరమని అన్నారు.
కమ్యూనికేషన్లో పరిణతి సాధించడంలేదని అన్నారు. వీటిలోగనుక నిష్ణాతులుగా మారితే కంపెనీలు పిలిచి ఉద్యోగాలిస్తాయని చెప్పారు.
ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఆరిలోవలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో 45 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు భోజనవసతులూ అందిస్తున్నారని తెలిపారు.
అదనపు అర్హత జావా లాంటివాటి కోసం తీసుకునే శిక్షణల్లో అంతర్జాతీయ సంస్థల గుర్తింపు ఉండేలా ధ్రువీకరణ పొందితే మంచి అవకాశాలుంటాయని అన్నారు.
ఏపీ ఐటీ అసోసియేషన్‌కి విద్యార్థులొచ్చినా సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు.
* రాష్ట్ర ఐటీ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ బీపీవో అంటే కేవలం కాల్‌సెంటర్ మాత్రమే కాదని, ఇందులో అన్ని రంగాలవారికీ అవకాశలొస్తున్నాయని తెలిపారు.
నాస్కామ్ నివేదిక ప్రకారం ఐటీలో 1.75 లక్షల ఉద్యోగాలుంటే అందులో బీపీవో నుంచే లక్ష ఉద్యోగాలున్నట్లు తెలిపారని వివరించారు.
తాను రాష్ట్రానికి వచ్చే ప్రతీ కంపెనీతో మాట్లాడుతున్నానని, అన్ని కంపెనీల్లోనూ ఖాళీలున్నాయని వెల్లడించారు.
ప్రతీ కంపెనీ కూడా తమకు నైపుణ్యం ఉన్నవారు మాత్రమే కావాలని కోరుతున్నాయని, విద్యార్థులు ఇప్పటినుంచే అప్రమత్తమవ్వాలని సూచించారు.
* ఐటీ అసోసియేషన్ విశాఖ చాప్టర్ అధ్యక్షులు ఎం.లక్ష్మి మాట్లాడుతూ..
విశాఖలో చాలా సంస్థలు ఏర్పాటవుతున్నాయని, భవిష్యత్తులో ఊహించనిరీతిలో ఉద్యోగావకాశాలు ఉంటాయని తెలిపారు.
ఈ అవకాశాన్ని విద్యార్థులు గ్రహించి దానికి తగ్గట్లు తమను తాము మార్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని వివరించారు.
ట్వెంటీఫస్ట్ సెంచురీ సీఈవో ధరణి మాట్లాడుతూ.. తమ సంస్థలో 60 శాతం మంది మహిళలే ఉన్నారని వెల్లడించారు.
రాబోయే వేసవిలో ఉచిత శిక్షణలు కూడా ఇస్తున్నామని, విద్యార్థులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.