నేడే నరసింహన్ రాక

ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్ర గవర్నర్ ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్ సోమవారం జిల్లాకు రానున్నారు. ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పర్యటనకు చాన్సలర్ హోదా లో ఆయన వస్తున్నారు. విశ్వ విద్యాలయం ఏర్పాటయ్యాక ఆయన పర్యటించడం ఇదే మొదటిసారి.
గవర్నర్ పర్యటన నేపథ్యంలో వర్సిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను పక్కాగా రూపొందించారు. వర్సిటీలో జాతీయ రహదారి నుంచి పరిపాలన కార్యాలయం వరకు తారు రోడ్డు నిర్మాణం, భవనాలు మరమ్మతులు, రంగులు వేయటం, మొక్కలు ఆకర్షణీయంగా నాటటం వంటివి పూర్తి చేశారు.
సోమవారం ఉదయం 11 గంటల నుంచి 1.30 వరకు గవర్నర్ వర్సిటీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ.1.70 కోట్లతో నిర్మించిన మహిళా వసతి గృభ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ భవనంలోనే ఆయనకు భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. 11 గంటలకు వర్సిటీకి గవర్నర్ చేరుకుంటారు.
అనంతరం వరుసగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయటం, పాలక మండలి సభ్యులతో సమావేశం, అధికారులతో సమీక్ష సమావేశం, వీసీ నివేదిక ప్రకటన, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు.
విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కొంత సేపు మాట్లాడనున్నారు. జాతీయ సేవాపథకం, సామాజిక అనుసంధాన కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక స్టాళ్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.