News

Realestate News

నేడు రాష్ట్ర బంద్‌కు సర్వం సిద్ధం

నేడు రాష్ట్ర బంద్‌కు సర్వం సిద్ధం
విజయవంతం చేయడానికి ప్రతిపక్షాల ప్రణాళికలు
భారీగా పోలీసు బందోబస్తు
ఈనాడు, విశాఖపట్నం: నగరంలో సోమవారం రాష్ట్ర బంద్‌ను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేలా ప్రతిపక్ష పార్టీలు భారీఎత్తున సన్నాహాలు చేసుకుంటున్నాయి. సీపీఐ, సీపీఎం, వైకాపా, జనసేన, లోక్‌సత్తా పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇప్పటికే బంద్‌కు సంఘీభావం తెలిపాయి. బంద్‌ను విజయవంతం చేయడానికి ఆయా సంఘాల ప్రతినిధులు తమతమ సంఘాల్లోని సభ్యులందరూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం ఐదు గంటల నుంచే ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటుండడం మరో విశేషం. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వడానికి నిరాకరిస్తుండడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ అంశాన్ని అన్ని పార్టీలు అందిపుచ్చుకున్నాయి. అధికార తేదేపా ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా సాధించడానికి వీలుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయ స్థాయి నాయకుల సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. అయితే అధికార పార్టీ అయినందున సోమవారం జరిగే నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఆందోళనలు జరుగుతున్నప్పటికీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతుండడంతో పలు రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. సోమవారం నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలోనూ పెద్దఎత్తున ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.పోలీసులు అప్రమత్తం: అఖిలపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం రాత్రి నుంచే వివిధ కూడళ్ల వద్దకు బందోబస్తును పంపడం మొదలుపెట్టారు. సోమవారం తెల్లవారుజాము నుంచే నిరసనలు ప్రారంభిస్తామని అఖిలపక్షాలు పేర్కొంటుండడంతో పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్‌, ప్రముఖ కూడళ్ల వద్ద పోలీసు పికెట్‌లు కూడా ఏర్పాటుచేసి నిరసనలు అదుపు తప్పకుండా చర్యలు చేపట్టారు. మొత్తం 1500 మంది పోలీసులతో వివిధ ప్రాంతాల్లో పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo