నేడు మన్యంలో ముఖ్యమంత్రి పర్యటన
యువతకు ఇన్నోవాలు..
జీసీసీలో నియామక పత్రాలు
ట్రైకార్ రుణాలు.. ఉన్నతి యూనిట్లు పంపిణీ
విలువ ఆధారిత అటవీ ఉత్పత్తుల పరిచయం
నేడు మన్యంలో ముఖ్యమంత్రి పర్యటన
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, న్యూస్‌టుడే, పాడేరు

60 మంది యువతకు రూ. 18 వేల వేతనం
ఎంబీఏ పూర్తిచేసిన 60 మంది గిరిజన యువకులను గిరిజన సహకార సంస్థ (జీసీసీ)లో పొరుగు సేవల ద్వారా నియమించనున్నారు. ఇప్పటికే వారికి జీసీసీ ఉత్పత్తులు, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించారు. వీరందరికీ ముఖ్యమంత్రి చేతుల మీదుగానే నియామకపత్రాలు అందించేలా జీసీసీ ఎండీ బాబూరావునాయుడు రంగం సిద్ధం చేశారు. ఒక్కొక్కరికి నెలకు రూ.18 వేలు చొప్పున జీతంగా.. నిర్ణయించారు. దీంతో ఆ 60 కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఆటోలు, జీపులకు డ్రైవర్లగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న మరికొందరు యువతకు వాహనాలను ఇచ్చి యజమానులుగా మార్చుతున్నారు. దీనికోసం ముందుగా 50 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారికి 27 ఇన్నోవా కార్లు, 23 స్కార్పియో వాహనాలు సమకూర్చారు. ఇన్నోవా, బొలెరో వాహనాలకు ఒక్కొక్క దానికి రూ.16 లక్షలు కేటాయించారు. దీన్లో లబ్ధిదారుల వాటా కేవలం రూ.58 వేలు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తం ఐటీడీఏ, ఎన్ఎస్టీఎఫ్డీసీ భరించనున్నాయి. ఈ వాహనాలను ముఖ్యమంత్రి లబ్ధిదారులకు అందిస్తారు.
సంక్షేమం అందరికీ..
మన్యంలో యువశక్తి, స్వయం శక్తి సంఘాలు, ఇతరులకు సీసీడీపీ, ట్రైకార్ ద్వారా రూ.5 కోట్లతో ఆర్థిక ప్రోత్సాహకాలు, వెలుగు ఆధ్వర్యంలో మరో రూ.6 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కిరాణా, కంప్యూటర్ దుకాణం, కోళ్ల పెంపకం వంటి వ్యాపారాలు నిర్వహించేందుకు అనువుగా రుణాలు మంజూరు చేయనున్నారు. ఏజెన్సీ మొత్తంగా రైతులకు 100 చంద్రన్న రైతు రథాలు పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. ఇదీ కాకుండా ఉన్నతి పథకం ద్వారా రూ.17 కోట్లతో నిరుపేదలకు యూనిట్ల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. కాఫీ రైతులకు ప్రోత్సాహక చెల్లింపులు చెక్కును సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.