News

Realestate News

నేటి నుంచి ప్రజాసాధికారిక సర్వే

Real Estate Vizag

ఆధార్‌ అంకె కీలకం
20 కొలమానాలను సిద్ధంగా ఉంచుకోవాలి
న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికారిక సర్వే శుక్రవారం నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా మొదలుకానుంది. వాస్తవానికి ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ రంజాన్‌ కారణంగా రెండు రోజులు ఆలస్యంగా మొదలవుతోంది. దాదాపు 6 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సర్వేలో పాల్గొంటుండగా.. మరో 70 మంది జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించనున్నారు. సర్వే బృందాలు ఇళ్లకు వచ్చే సమయంలో ప్రభుత్వం పేర్కొన్న 20 కొలమానాల్లో ఎన్ని ఉంటే అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. జిల్లా వ్యాప్తంగా 2,630 మంది ఎన్యూమరేటర్లను సిద్ధం చేయగా, నగరంలో 1077 మందిని నియమించారు. జిల్లాలో ఉన్న తహసిల్దార్లు, ఎంపీడీవోలు సర్వేను పర్యవేక్షించనున్నారు. ట్యాబ్‌లు, వేలిముద్రల యంత్రాలు, ఐరిస్‌ పరికరాలను సర్వే బృందాలకు అప్పగించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ను ట్యాబ్‌ల్లో ఎన్యూమరేటర్లు అమర్చుకొని సర్వేకు సిద్ధమయ్యారు. సెలవు రోజుల్లో కూడా కార్యక్రమం కొనసాగనుంది. ఒక్కో బృందం రోజుకు 14 ఇళ్ల వివరాలను సేకరించాల్సి ఉంటుంది.

ఆధార్‌ సంఖ్యే కీలకం
సర్వేలో ఆధార్‌ సంఖ్యే కీలకంగా మారనుంది. అయిదేళ్ల లోపు పిల్లలకు ఆధార్‌ కార్డు లేకుంటే వెనువెంటనే మీ సేవా కేంద్రాలకు వెళ్లి ఆధార్‌ నమోదు చేసుకోవాలి. అక్కడ ఇచ్చే ఈఐడీ అంకెను సర్వే బృందానికి ఇస్తే సరిపోతుంది. ఆధార్‌ అంకెలను తెలియచేస్తే ట్యాబ్‌ తెరుచుకుంటుంది. లేకుంటే సర్వే ముందుకు సాగదు. ఆధార్‌ కార్డు ఉన్న ప్రతీ వ్యక్తి వివరాలనూ సిబ్బంది సేకరిస్తారు.

* బదిలీలపై ఇతర జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగులు నగరంలో ఏదో ఒకచోట చిన్న గది అద్దెకు తీసుకొని తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబ సభ్యులంతా వేరే జిల్లాలో ఉంటారు. అక్కడకు తను వెళ్లి వివరాలను నమోదు చేసుకోవాలి. లేకుంటే కుటుంబ సభ్యులను ఇక్కడకు రప్పించాలి.

* పారిశ్రామిక ప్రాంతమైన విశాఖలో అన్ని రాష్ట్రాలకు చెందిన వారు నివాసం ఉంటారు. ఇలాంటి వారు సైతం తమ వివరాలను సర్వే బృందాలకు ఇవ్వాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వంటగ్యాస్‌ కనెక్షన్‌ పొందాలన్నా ఈ సర్వేలో లభ్యమైన సమాచారమే కీలకం కానుంది. దీంతో ఏ రాష్ట్రం వారైనా సర్వే బృందాలు వచ్చిన సమయంలో అడిగిన మేరకు సమాచారం అందించాలి.

* సర్వే బృందంలో ఇద్దరు సభ్యులుంటారు. ఒకరు ఎన్యూమరేటరు కాగా, ఇంకొకరు సహాయకునిగా ఉంటారు. వీరితో డ్వాక్రా మహిళలు వెళ్లనున్నారు. వీరంతా తమకు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను వెంట పెట్టుకొని వెళ్లనున్నారు. ప్రజలకు ఏమైనా అనుమాలు, అపోహలు ఉన్నా వాటికి సమాధానాలిస్తారు.

* కుటుంబ సభ్యుల ఆధార్‌ వివరాలతో పాటు వేలిముద్రలను నమోదు చేసిన తర్వాతే సర్వే ముందుకు సాగుతుంది. కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా ఇవ్వకుంటే సర్వే పూర్తికాదు.

* అధిక శాతం ఉద్యోగులు శుక్రవారం నుంచి సర్వేకు వెళ్లనున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పర్యవేక్షక అధికారులు మాత్రమే మిగలనున్నారు.

కొలమానాలు ఇవీ…
ఆధార్‌కార్డు, రేషనుకార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆస్తిపన్ను ఐడీ, విద్యుత్తు బిల్లు, డ్రైవింగ్‌ లైసెన్సు, వాహన నమోదు కార్డు, పట్టాదార్‌ పాసు పుస్తకం, ల్యాండ్‌ ఖాతా అంకె, ఎల్‌పీజీ వినియోగదారుని పుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం, సదరం శిబిరం ద్వారా పొందిన వైకల్య గుర్తింపు పత్రం, వాటరు బిల్లు, కులధ్రువపత్రం, ఆదాయ ధ్రువ పత్రం, కిసాన్‌కార్డు, పెన్షన్‌ సర్టిఫికేట్‌, ఉపాధి హామీ కార్డు, డ్వాక్రా గుర్తింపు పత్రం, అయిదేళ్ల లోపు చిన్నారులకు అయితే జనన ధ్రువపత్రం, ఉపకారవేతనాల ఐడీలలో ఏవి ఉంటే వాటిని సర్వే బృందాలకు చూపించాలి.

లోపాలకు తావులేకుండా..
-ఎన్‌.యువరాజ్‌, కలెక్టర్‌
సర్వేను పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. లోపాలకు తావులేకుండా సర్వే చేయనున్నాం. ఇదే విషయాన్ని సర్వే బృందాలకు తెలియచేశాం. ప్రజలు సహకరించి తమకు సంబంధించిన వివరాలను సర్వే బృందాలకు అందచేయాలి. 35 రోజుల పాటు ఇది సాగనుంది. సర్వే బృందాల పర్యటనల సమాచారాన్ని ముందుగా ప్రజలకు తెలియచేస్తాం.

ఆధార్‌ కార్డు తప్పని సరి
-డి.వి.రెడ్డి, జేసీ-2
సర్వే బృందాలు ఇళ్లకు వచ్చే సమయంలో ఆధార్‌ కార్డు తప్పని సరిగా చూపించాలి. ఆధార్‌ వివరాలు అందజేసిన తర్వాతే ఇతర వివరాల నమోదు ప్రక్రియ మొదలుకానుంది. ఒకవేళ ఆధార్‌ కార్డులు లేనివాళ్లు వెంటనే మీ సేవా కేంద్రాలకు వెళ్లి ఆధార్‌ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆధార్‌ కార్డు ఉండి, శాశ్వత నివాసం ఉన్న ప్రతీ ఒక్కరి నుంచి వివరాలను సేకరించనున్నాం.