News

Realestate News

నూకాలమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు

నూకాలమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు
గవరపాలెం(అనకాపల్లి), న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రలో పేరుపొందిన అనకాపల్లి గవరపాలెం నూకాలమ్మ కోవెలకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గవరపాలెం ప్రాంతంలో ఏవీధి చూసినా భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజాము నుంచి భక్తులు కోవెలకు తరలిరావడం ప్రారంభించారు. ఉచిత దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది. రూ.200 ప్రత్యేక దర్శనానికి సైతం రెండు గంటలు నిరీక్షించాల్సి వచ్చింది. ఎండవేడి అధికంగా ఉండటంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. అవసరమైన మేరకు టెంట్‌లు ఏర్పాటు చెయ్యకపోవడంతో దర్శనం కోసం క్యూలో నిలుచున్న భక్తులు అసహనం వ్యక్తం చేశారు. సత్యసాయి సభ్యులు భక్తులకు మంచినీరు సరఫరా చేశారు. గౌరీ సిండికేట్‌, బెస్ట్‌ఫ్రెండ్స్‌ క్లబ్‌ సభ్యులు మజ్జిగ అందించారు. విశాఖ ఫైనాన్సియర్స్‌ భోజనాలు ఏర్పాటు చేశారు.

తెరచుకోని వెనుక ద్వారం
కోవెలలోని వెనుకద్వారాన్ని ఆదివారం మూసే ఉంచారు. ఉచిత పాస్‌లు లేకపోయినా గతవారం అనేక వందల మందిని వెనుకద్వారం నుంచి దర్శనానికి పంపడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై ‘ఈనాడు’లో ‘ఉచిత పాస్‌లు ఉత్తుత్తే’. శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనిపై ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ స్పందించారు. ముఖ్యులు వస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుక ద్వారం తెరవవద్దని అక్కడ ఉన్న అధికారులకు ఆదేశించారు. దీంతో అతి ముఖ్యులు వస్తేనే దగ్గరుండి దేవస్థానం అధికారులు వెనుకద్వారం నుంచి దర్శనానికి పంపారు.

నగర సంకీర్తన
స్థానిక నూకాంబిక అమ్మవారి భక్తబృందం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో నగర సంకీర్తన నిర్వహించారు. కార్యక్రమాన్ని దేవస్థానం పూర్వపు ఛైర్మన్‌ కొణతాల వెంకటరావు ప్రారంభించారు. దేవస్థానం నుంచి ప్రారంభమైన సంకీర్తనలు సంతబయలు, విజ్ఞానసమితి, కర్రివారి వీధి, పల్లపువీధి, దిబ్బవీధి, కోటవీధి మీదుగా తిరిగి కోవెలకు చేరుకుంది. కార్యక్రమంలో కొణతాల తారకేష్‌, ఆళ్ల రాము, పెదగాడ కృపాసాగర్‌ పాల్గొన్నారు.