నీటి పథకాల నిర్వహణ మహిళలకే

సీఎం చంద్రబాబు అంగీకారం
మంత్రి అయ్యన్నపాత్రుడు వెల్లడి
నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని తాగునీటి పథకాలు, తాగునీటి బోర్లు నిర్వహణ బాధ్యత డ్వాక్రా సంఘాల మహిళలకు అప్పగిస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. బుధవారం ఆయన విశాఖ జిల్లా నర్సీపట్నంలో విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇందుకు అంగీకరించారని తెలిపారు. రెండు మూడు నెలల్లో అప్పగింత కార్యక్రమం మొదలవుతుందన్నారు. గ్రామంలోని డ్వాక్రా సంఘాల్లో బాగా పనిచేసే వాటికి వీటి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఒక్కో బోరు మరమ్మతు, నిర్వహణ కోసం ఏటా వెయ్యి రూపాయల చొప్పున సర్పంచులకు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ నిధులు తీసుకుంటున్నారు తప్ప మరమ్మతుకు గురైన బోరును రోజుల తరబడి బాగు చేయించడం లేదన్నారు. తాగునీటి ట్యాంకులను పదిహేను రోజులకోసారి శ్రుభం చేయించాల్సి ఉన్నా కొంతమంది నిర్లక్షం చూపుతున్నారన్నారు. నిర్వహణ నిధులను మహిళలకు ఇస్తే సమర్దంగా బాధ్యత నిర్వహిస్తారన్నది ముఖ్యమంత్రి నమ్మకమన్నారు. ఎంపికైన సంఘాల్లోని మహిళలకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పదమూడు వేల గ్రామ పంచాయతీలు ఉండగా 2400 గ్రామాల్లో నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ పంచాయతీలను బహిరంగ మలవిసర్జనరహిత గ్రామాలుగా ప్రకటించామన్నారు. ఈ గ్రామాల్లో అభివృద్ధి పనులకు తొలుత రూ.5 లక్షలు ప్రోత్సాహంగా ఇవ్వాలని భావించామని తెలిపారు. ఇప్పుడు పరిమితి లేకుండా ఎంత అడిగినా ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో మూడు వేల పంచాయతీలను బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం జరుగుతోందని మంత్రి వెల్లడించారు.