నిర్మాణ రంగంలో నూతన పద్ధతులు అందిపుచ్చుకోవాలి

బీచ్‌రోడ్, (ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: భవన నిర్మాణ రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని, ఈ రంగంలో అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులోని నోవాటెల్ హోటల్లో ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ ఎక్స్పో-2016ను శుక్రవారం ప్రారంభించారు. ఇది ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. ఎక్స్‌పోలో భవన నిర్మాణ రంగంలో ఆధునిక పరిజ్ఞానం, నూతనంగా అందుబాటులోకి వచ్చిన సామగ్రి, ఆధునిక అలంకరణ సామగ్రి, సరికొత్త అలారం విధానం, వంట, స్నానాల గదులు, టైల్స్, ఫ్లోరింగ్, వెనీర్స్, లామినేట్స్, ఏసీపీ, ఇంటీరియర్ డెకరేషన్ సామగ్రిని అందుబాటులో ఉంచారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఛైర్మన్ ఎస్.ఎల్.ఎన్.శాస్త్రి మాట్లాడుతూ.. ఈ ఎక్స్పో ద్వారా ఆధునిక సామగ్రిని ప్రదర్శించామని, భవన నిర్మాణ రంగంలోని అన్ని విభాగాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫొటో పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్, వుడా వీసీ బాబూరావునాయుడు, ఐఐఏ ప్రతినిధులు సుబ్బారావు, సునిల్ కుమార్, శ్రీరామమూర్తి, సుదాస్, రమణారావు పాల్గొన్నారు.