నిరుపేదలకు కొత్త వెలుగు
నిరుపేదలకు కొత్త వెలుగు
ఇకనుంచి కేజీహెచ్‌లో అవయవ మార్పిడి చికిత్సలు
తొలివిడతలో కెడావర్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు జీవన్‌దాన్ అనుమతి
న్యూస్‌టుడే, వన్‌టౌన్
నిరుపేదల మోములో కొత్త వెలుగు పూయనుంది. ఏళ్ల తరబడి మూత్రపిండాల వ్యాధులతో సతమతమవుతూ.. నిత్యం డయాలసిస్ చేయించుకునేందుకు నరకయాతన అనుభవించేవారికి ఉచితంగా కిడ్నీ మార్పిడిచేసేందుకు ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కింగ్‌జార్జి ఆసుపత్రికి అనుమతులు లభించాయి. కెడావర్ విధానంలో ఈ ప్రక్రియ సాగించేందుకు అనుమతులిస్తూ జీవన్‌దాన్ సంస్థ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. తొలిదశలో కేవలం మూత్రపిండాల మార్పిడి చికిత్సలను మాత్రమే చేయనున్నారు. రెండు నెలల క్రితం జీవన్‌దాన్ సంస్థ ప్రతినిధులు కేజీహెచ్‌లోని నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను సందర్శించారు. ఆయా విభాగాల ప్రొఫెసర్లు, ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ జి.అర్జున, తదితరులతో చర్చించారు.
కెడావర్ విధానంలో ముందుకు…
కింగ్ జార్జి ఆసుపత్రిలో రెండు దశాబ్ధాల నుంచే మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దాతలు, రక్తసంబంధీకుల నుంచి సేకరించిన మూత్రపిండాలను మాత్రమే మార్పిడి చేస్తున్నారు. ఇకమీదట కెడావర్ కిడ్నీ మార్పిడి చికిత్సలను చేయనున్నారు.
కిడ్నీ మార్పిడి విధానం ఇలా..
* కిడ్నీ రోగులు తమకు మూత్రపిండం కావాలని జీవన్‌దాన్ ట్రస్ట్‌లో పేరు నమోదుచేసుకోవాలి.
* రాష్ట్రంలో ఎక్కడైనా ‘బ్రెయిన్ డెడ్’ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన మూత్రపిండాలను జీవన్‌దాన్ ట్రస్ట్‌లో పేరు నమోదుచేసుకున్న వారికి కేటాయిస్తారు. జాబితాలో పేరు నమోదుచేసుకున్న వారిలో సీనియారిటీని బట్టి అవయవాన్ని కేటాయిస్తారు.
* అలా కేటాయించిన మూత్రపిండాలను బాధిత రోగులకు ఇకపై కేజీహెచ్‌లోనే అమర్చనున్నారు. దీనికి సంబంధించిన అనుమతులను జీవన్‌దాన్ మంజూరుచేసింది.
* కేజీహెచ్‌లో కిడ్నీల మార్పిడికి అవసరమైన ఆపరేషన్ థియేటర్, మార్పిడి చికిత్సలు చేసే నిపుణులు, చికిత్స తర్వాత కిడ్నీ పనితీరును గమనించే వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. దీంతో జీవన్‌దాన్ సంస్థ అనుమతలను మంజూరు చేసింది.
చికిత్సలు చేయాలంటే…
జీవన్‌దాన్ నుంచి అధికారిక అనుమతులు లభించడంతో చికిత్సలు చేసేందుకు అవసరమైన పూర్వ రంగం సిద్ధమవుతోంది. ‘బ్రెయిన్ డెడ్’ అయిన వ్యక్తుల నుంచి సేకరించే మూత్రపిండాలను 24 గంటల్లోపు శస్త్రచికిత్స చేసి బాధిత రోగులకు అమర్చాల్సి ఉంది. కిడ్నీలను సేకరించడం, భద్రపర్చడం, వెనువెంటనే రోగుల ఎంపిక, అత్యవసర ప్రాతిపదికన చికిత్సలను చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వైద్యులు, ఆపరేషన్ థియేటర్ వంటివి అందుబాటులో ఉన్నాయి. చికిత్సలను చేయడానికి అవసరమైన పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక దాతల నుంచి సేకరించే కిడ్నీలను నిల్వ చేయడానికి అవసరమైన పరికరాలు, ద్రావకాలను సమకూర్చుకోవాల్సి ఉంది. అదే విధంగా జీవన్‌దాన్ కింద దాతలకు అవగాహన పరిచేందుకు కౌన్సెలర్లను నియమించాల్సి ఉంది.
సాధ్యమైనంత త్వరగా కెడావర్ చికిత్సలు
-డాక్టర్ జి.అర్జున, పర్యవేక్షక వైద్యాధికారి, కేజీహెచ్
జీవన్‌దాన్ కింద అనుమతులు రావడం వల్ల కేజీహెచ్‌కు వైద్యం కోసం పేద రోగులకు కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయవచ్చు. అధికారిక అనుమతులు లభించినందున తదుపరిచర్యలపై దృష్టి సారించాం. ఇద్దరు కౌన్సెలర్ల నియామకానికి చర్యలను తీసుకుంటున్నాం. సేకరించిన కిడ్నీలను భద్రపర్చడం తదితరాల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. తొలిదశలో కేవలం కిడ్నీమార్పిడికి మాత్రమే అనుమతులు వచ్చాయి. తదుపరి దశలో కాలేయం, పిరితిత్తులు, గుండె వంటి అవయవాల మార్పిడి చికిత్సలు చేసేందుకు చర్యలను తీసుకోనున్నాం.