News

Realestate News

నారీ.. నీకు సాటేరి?

నారీ.. నీకు సాటేరి?
అవకాశాలు అందిపుచ్చుకుంటూ అగ్రపథంలోకి..
రాజకీయ, ఉద్యోగ, వ్యాపారాల్లోనూ తమదైన ముద్ర
చీకటి నుంచి వెలుగుల వైపు.. శాపం నుంచి శాసించే వరకు.. అతివల ప్రస్థానం సాగుతోంది.. అవకాశాలు అందిపుచ్చుకుంటూ అవధులు లేని ప్రగతి వైపు నేటి మహిళ ప్రయాణం సాగుతోంది.. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ఆడది.. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రాణిస్తోంది.. ఇందుగలందులేదని చాటుతోంది.. అమ్మగా లాలించడమే కాదు.. భార్యగా ప్రేమ పంచుతోంది. అక్కగా, చెల్లిగా అనురాగం చూపడమే కాదు.. అణచివేతకు గురైతే ఉప్పెన ఉవ్వెత్తున ఎగసిపడతానని చాటుతోంది.. జిల్లాలో రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, పొదుపులో, వ్యాపారాల్లో రాణిస్తూ పలువురు మహిళలు సత్తా చాటుతున్నారు.

విశాఖపట్నం, ఈనాడు: జిల్లాలో మహానగరం.. మన్యం.. మైదానం.. ఇలా భిన్న భౌగోళిక పరిస్థితుల నడుమ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. గిరి మహిళలు కాయకష్టాన్ని నమ్ముకుని కుటుంబాలను నడుపుతుంటే.. మైదానంలో వ్యవసాయ పనులు, పొదుపు సంఘాల్లో చేరి వ్యాపారాలతో రాణిస్తున్నారు. పలువురు మగువలు ఉద్యోగాల్లో రాణిస్తూ అందరి ప్రసంశలు అందుకుంటున్నారు.

ఇదీ మగువల పాత్ర జనాభాలో మహిళ..
జిల్లా జనాభా: 42,90,589 (పురుషులు: 21,38,910.. స్త్రీలు: 21,51,679)
నగరంలో మహిళలు: 10,10,246 (42.89 శాతం)
గ్రామీణంలో మహిళలు: 11,41,433 (53.05 శాతం)

అక్షరం నేర్చిన మగువ..
జిల్లా అక్షరాస్యత: 25,68,249 (పురుషులు: 14,22,878.. స్త్రీలు: 11,45,371)
నగరంలో మహిళా అక్షరాస్యులు: 6,91,601 (60.38 శాతం)
గ్రామీణంలో మహిళా అక్షరాస్యులు: 4,53,770 (39.62 శాతం)

శ్రమైక సౌందర్యం..
జిల్లాలో శ్రామికులు: 18,89,879 (పురుషులు: 12,39,064.. స్త్రీలు: 6,50,815)
నగరంలో మహిళా శ్రామికులు: 1,52,928 (23.50 శాతం)
గ్రామీణంలో మహిళా శ్రామికులు: 4,97,887 (76.50)

అధికార పీఠంపై నారీ..
జిల్లాలో పంచాయతీలు: 925 (జనరల్‌: 461, మహిళ: 464)
(2013 ఎన్నికల్లో సర్పంచులుగా పురుషులు 432 స్థానాల్లో గెలిస్తే.. మహిళలు 493 స్థానాల్లో గెలిచి సర్పంచులయ్యారు.)
39 మండల పరిషత్తులలో 25 మంది మహిళలు ఎంపీపీలుగా ఉన్నారు.
39 జడ్పీటీసీ ప్రాదేశిక స్థానాల్లో 22 మంది మహిళలు జడ్పీటీసీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

పొదుపు మహిళ..
జిల్లాలో స్వయం సహాయ సంఘాలు: 47,742
స్వయం సహాయక సంఘాల్లో మొత్తం సభ్యులు: 5,13,281
మొత్తం గ్రామైక్య సంఘాలు: 2,041
దివ్యాంగ మహిళతో ఏర్పాటైన పొదుపు సంఘాలు: 1,641
జిల్లా మహిళల జీవనోపాదుల టర్నోవర్‌: రూ. 250 కోట్లు

రాజకీయాల్లో.. నారీ భేరి
జిల్లాలో స్థానిక సంస్థల నుంచి మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. 2006లో 33 శాతం ఉన్న రిజర్వేషన్‌ 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 50 శాతానికి పెంచడంతో వీరి ప్రాతినిథ్యం అమాంతం పెరిగింది. అప్పటివరకు 314 మంది మహిళా సర్పంచులుంటే ఇప్పుడు ఆ సంఖ్య 493కు పెరిగింది. మహిళలు అధికారపీఠం ఎక్కిన చోట పురుషుల పెత్తనం తగ్గి.. పాలనలో పూర్తి స్వేచ్ఛ ఇస్తే మరింతగా రాణించే వీలుంది. జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌గా లాలం భవానీ రాణిస్తున్నారు. గతంలో ఈమెది ప్రేక్షకపాత్రే అయినా ఇప్పుడు ప్రసంగాలు.. పాలనా వ్యవహారాల్లో జోక్యం.. జడ్పీ సమీక్షల నిర్వహణతో ఆకట్టుకుంటున్నారు. జిల్లాలో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలుగా ఉన్న మహిళలు స్థాయి సంఘాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు.
* పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు. ప్రతిపక్షాలకు ధీటైన సమాధానంగా నిలిచారు. మంత్రివర్గంలో ఈమెకు చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారానికి ఈమె పనితీరు అద్దం పడుతోంది. ఉపాధ్యాయురాలైన ఈమె రాజకీయాల్లోకి వచ్చి అందులోనూ రాణించడం గమనార్హం.
* పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉపాధ్యాయ వృత్తి నుంచే రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. ప్రతిపక్షంలో ఈమెదీ కీలకపాత్ర కావడం గమనార్హం.

అక్షరంపై పోరు..
అక్షరాస్యతలో మహిళల్లో వెనుబాటు ఉన్నా.. సాక్షర భారత్‌ కార్యక్రమంలో పలువురు మహిళా ప్రజాప్రతినిధులు అక్షరాలు నేర్చుకోవడానికి ముందుకు రావడం స్వాగతించాల్సిన అంశం. ఆదాయ మార్గాలపై మహిళలు ఎక్కువగా దృష్టిపెడుతూ శ్రామికులుగా మారడంతో చదువుపై అంతగా దృష్టిపెట్టలేకపోతున్నారు. కేంద్రాల ద్వారా మండల సమన్వయకర్తలు రాత్రివేళల్లో చదువుకు వీరిని ప్రోత్సహించాల్సి ఉంది.

పాలనలో అతివల ముద్ర..
జిల్లా సంయుక్త కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన బాధ్యతలు స్వీకరించి తక్కువ కాలమే అయినా పాలనలో తనదైన ముద్ర వేశారు. ప్రధానంగా అవినీతి అధికారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్టవేసి సమర్థ పౌర సేవలు ప్రజలకు అందేలా చూడాలన్న తపన ఈమెలో కనిపిస్తోంది. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ సరోజిని విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి మన్యంలో, మైదానంలో పరిస్థితిని గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నారు. గతంతో పోలిస్తే పాలనా వ్యవహారాల్లో కచ్చితంగా ఉంటున్నారన్న భావన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీగా జి.చిన్మయీదేవి, జిల్లా పంచాయతీ అధికారిగా కృష్ణకుమారి తదితరులు సమర్థ సేవలు అందిస్తున్నారు.