News

Realestate News

నాగుల చవితి

Vizag Real Estate news

నాగుల చవితి

 

భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా- సంహితల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ, ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి.

కద్రువ నాగ మాత. మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే- ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.

నాగదేవతను పూజించే సత్సంప్రదాయం జపాన్‌, చైనా, గ్రీకు దేశాలకు సైతం వ్యాపించింది. పుట్టకు పూజ చేసే పండుగ- నాగుల చవితి. ఇందులో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటారు. తెల్లవారుజామునే తలంటి స్నానం, శుభ్ర వస్త్రధారణ, పూజ సామగ్రితో సమీపంలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి పూజించడం ఈ పర్వదిన కార్యక్రమం. దీపావళినాడు కాల్చగా మిగిలిన టపాసుల్ని నాగుల చవితినాడు వెలిగించి పిల్లలు సంబరపడతారు.

దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన, ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి. సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయ ప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.

వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి, రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో ‘కార్తిక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తున్నాం.

పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు!

పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.

‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.

పంట పొలాలకు శత్రువులు ఎలుకలు. వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ!

– డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo