నవశకం దిశగా నారీశక్తి
డిజిటల్ అక్షరాస్యతలో టి.సిరసపల్లి ఘనత
రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
టి.సిరసపల్లి (మునగపాక), న్యూస్టుడే

మునగపాక మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో టి.సిరసపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామంలో 2,845 మంది జనాభా ఉన్నారు. వీరిలో 30 శాతం మంది నిరక్షరాస్యులే ఉన్నారు. గ్రామీణ ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపొందించాలని తద్వారా స్వయం ఉపాధిని పెంపొందించుకొంటారనే ఉద్దేశంతో అంతర్జాలం, స్మార్టుఫోన్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెండు గ్రామాలకు ఒక ఇంటర్నెట్ సాథీని నియమించారు. ఇదేవిధంగా టి.సిరసపల్లి గ్రామానికి పొలమరశెట్టి శ్యామలను సాథీగా నియమించారు. ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిరక్షరాస్యులకు సైతం స్మార్టుఫోను వినియోగంపై అవగాహన కల్పించారు. నాలుగు మాసాలుగా డ్వాక్రా సంఘాలు, వృద్ధులు, విద్యార్థులతో మమేకమై డిజిటల్ అక్షరాస్యత సాధించేలా చేశారు.
తెలుసుకొంటున్నారు.. ఉపాధి పొందుతున్నారు
డిజిటల్ అక్షరాస్యతలో భాగంగా శ్యామల గ్రామంలోని మహిళలకు స్మార్టుఫోన్ ఏ విధంగా ఆన్ చేయాలి, ఆపరేటింగ్ ఏవిధంగా చేయాలి అంతర్జాలం ద్వారా తెలుసుకోవాలనే విషయాలు ఎలా డౌన్లోడు చేసుకోవాలని వంటి అంశాలను వివరించారు. అక్షరం ముక్కకూడా రానివారు, వృద్ధులు సైతం స్మార్టుఫోన్ వినియోగంపై అవగాహన పొందారు. అంకెలను గుర్తులుగా చేసుకొని సెల్ వాడకం తెలుసుకొన్నారు. వంటలు, అల్లికలు, గాజులు, చెవి రింగుల తయారీ కోసం యాప్ ఎలా డౌన్లోడు చేసుకోవాలో వివరించారు. 55 డ్వాక్రా సంఘాలతోపాటు 1153 మందికి డిజిటల్ అక్షరాస్యతపై శిక్షణ ఇచ్చారు. శ్యామల కల్పించిన అవగాహన మేరకు గ్రామంలోని అనేకమంది మహిళలు డిజిటల్ అక్షరాస్యత చెంది స్వయం ఉపాధి పొందుతున్నారు. కొత్తరకం అల్లికలు, అలంకరణ సామగ్రి తయారు చేయడం వంటివి యాప్ల ద్వారా తెలుసుకొని వారే స్వయంగా తయారుచేస్తున్నారు. దీంతో నూరుశాతం మహిళలు డిజిటల్ అక్షరాస్యతను అందిపుచ్చుకున్న గ్రామాల్లో టి.సిరసపల్లి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది.
కార్పొరేట్ స్థాయిలో గుర్తింపు
టి.సిరసపల్లి ఘనత గురించి తెలుసుకున్న కార్పొరేట్ సంస్థలు ఈ గ్రామంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఇటీవల గూగుల్, టాటా సంస్థల ప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించి స్థానిక మహిళలతో మాట్లాడారు. వారితో సమావేశమై అంతర్జాలాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నదీ, అది వారి నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ ప్రత్యక్షంగా పరిశీలించారు. వారు మరింత అభివృద్ధి సాధించడానికి ఏ సహాయం ఆశిస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. మిగిలిన గ్రామాల్లో మహిళలు సైతం ఆధునిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఏం చర్యలు తీసుకోవాలో చర్చించారు.
పాఠ్యాంశాలు డౌన్లోడు చేసుకున్నా..
నేను తోటాడ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను. నాకు ఇంతకుముందు స్మార్టుఫోను వినియోగం గురించి తెలీదు. ఇంటర్నెట్ సాథీ శ్యామల ద్వారా ఫోన్ వినియోగం తెలుసుకొన్నాను. విద్యకు సంబంధించిన పలు అంశాలు అంతర్జాలంలో ఉన్నాయి. పాఠశాలలో అర్థంకాని పాఠ్యాంశాలను యాప్ద్వారా డౌన్లోడు చేసుకున్నా. ఇప్పుడు పూర్తిస్థాయిలో పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయి. ఇది చదువుకి ఎంతో ఉపయోగపడుతోంది. అధిక మార్కులు సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది
ఎంబ్రాయిడింగ్ ద్వారా స్వయం ఉపాధి
నేను గృహిణిని. ఒకప్పుడు వంటింటికే పరిమితమై ఉండేదానిని. డిజిటల్ అక్షరాస్యత ద్వారా స్వయం ఉపాధి ఏవిధంగా పొందవచ్చునో ఇంటర్నెట్ సాథీ ద్వారా తెలుసుకొన్నాను. స్మార్టు పోన్లో యాప్ ద్వారా ఎంబ్రాయిడింగ్ చేయడం ఎలా? తెలుసుకొన్నాను. ఇంటివద్దనే ఉంటూ జాకెట్లు, చీరలపై ఎంబ్రాయిడింగ్ చేయడం చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నాం. కొత్తకొత్త నమూనాల్లో ఎంబ్రాయిడరీ చేసే విధానాన్ని తెలుసుకొని స్వయం ఉపాధిని మరింత మెరుగుపరుచుకుంటా.
గృహోపకరణ వస్తువుల తయారీ
గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నా ప్రపంచాన్ని తెలుసుకొనే స్థాయికి డిజిటల్ అక్షరాస్యత ఎంతో దోహదపడుతుంది. సెల్ఫోనులో మాట్లాడటం వరకే తెలిసిన నేను స్మాంü్టఫోన్ ఏ విధంగా వినియోగించాలో తెలుసుకొన్నాను. గృహోపకరణ వస్తువుల తయారీని తెలుసుకొని తద్వారా స్వయం ఉపాధి పొందుతున్నాను. వీటితో పాటు సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకొంటున్నాను.
అందరికీ నేర్పించగలుగుతున్నా
నాకూ ఒకప్పుడు స్మార్టుఫోనుపై అంతంతమాత్రమే అవగాహన ఉండేది. టైలరింగ్ చేసుకొంటూ ఇంటివద్దే ఉండేదాన్ని. డ్వాక్రా సంఘాల్లో చురుకైన పాత్ర పోషించడం గమనించిన సర్పంచి మద్దాల ధనలక్ష్మి ప్రభుత్వం డిజిటల్ అక్షరాస్యతపై నూతనంగా నియమించిన ఇంటర్నెట్ సాథీగా నన్ను నియమించారు. నా భర్త అప్పలనాయుడు, కుమారుల సహకారంతో స్మార్టుఫోను వినియోగాన్ని తెలుసుకొన్నా. గ్రామంలో ఎక్కడ పదిమంది కూర్చుంటే వారివద్దకు వెళ్లి స్మార్టుఫోన్ వినియోగం, తద్వారా తెలుసుకోవలసిన విషయాల గూర్చి వివరించాను. ప్రజలు ఎంతో శ్రద్ధగా నేర్చుకొన్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన పొంది తద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు.
ఎంతో ఆనందం
ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిజిటల్ అక్షరాస్యతవైపు ప్రజలు పరుగులు తీయాలని పదేపదే చెబుతున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా టి.సిరసపల్లి గ్రామస్థులు డిజిటల్ అక్షరాస్యతలో ముందడుగు వేస్తూ రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలవడం ఎంతో ఆనందంగా ఉంది. మా గ్రామానికి రాష్ట్రంలోనే గుర్తింపు తీసికొచ్చారు. నూరుశాతంలో డిజిటల్ అక్షరాస్యులమై తద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పొందుతాం. మహిళలు రూపొందిస్తున్న వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసికోవాలి.