News

Realestate News

నర్సీపట్నంలో డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటుకు సన్నాహాలు

vizag realestate news 2016

కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఇక మంచి రోజులు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: డివిజన్‌ కేంద్రం నర్సీపట్నంలోని పాంతీయ వైద్యాలయానికి మహర్దశ పడుతోంది. ఇన్నాళ్లు జిల్లాలో ఒక విశాఖలోని కేజీహెచ్‌కే పరిమితమైన మూత్ర పిండాల డయాలసిస్‌ యూనిట్‌ ఇప్పుడు ఈ వైద్యాలయంలో కూడా ఏర్పాటు కానుంది. దీంతో గ్రామీణ ప్రాంతంలోని కిడ్నీల వ్యాధిగ్రస్తులందరికీ ఈ యూనిట్‌ ఓ వరంగా మారునున్నది. త్వరలోనే దీని ఏర్పాటుకు వీలుగా అన్నింటిని పరిశీలించేందుకు ప్రతినిధుల బృందం కూడా ఇక్కడికి రానుంది. మూత్రపిండాలు చికిత్సకు ప్రస్తుతం లక్షలాది రూపాయలు చెల్లించాల్సి వస్తున్న పరిస్థితుల్లో పేద రోగులకు ఈ యూనిట్‌ ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది.
ఇక్కడ ప్రాంతీయ ఆసుపత్రి క్రమేపీ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఇప్పుడు ఇది 150 పడకల స్థాయి వైద్యాలయంగా రూపుదిద్దుకోడానికి అనువుగా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అత్యధిక కాన్పుల కేసులతో ఇది రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటీవల ఇందులో గర్భిణులకు ప్రత్యేక సేవల నిమిత్తం ప్రధాన మంత్రి సురక్షిత్‌ మాతృత్వ అభయాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులు అనకాపల్లి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇందులో ఏంటీ రిట్రోవైరల్‌ థెరిఫీ (ఏఆర్‌టీ) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ సేవలకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు అరుదైన నెఫ్త్రాలాజీ డయాలిసిస్‌ యూనిట్‌ను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ అత్యాధునిక వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి.

ఏజెన్సీ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని…
ఏజెన్సీ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి ఆసుపత్రికి ఈ యూనిట్‌ మంజూరు చేశారు. రాష్ట్రానికి మంజూరైన పది యూనిట్లలో నర్సీపట్నం ఒకటిని పేర్కొంటున్నారు. జిల్లాలో విశాఖ కేజీహెచ్‌లో ఉన్న ఈ యూనిట్‌ సేవలను దగ్గర్లోనే ఉన్న అనకాపల్లి ప్రాంతం రోగులు ఉపయోగించుకుంటున్నారు. నర్సీపట్నంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల వారికి కేజీహెచ్‌ బాగా దూరమైన మేరకు అక్కడి రోగుల సౌకర్యార్థం దీనిని నర్సీపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ఇక్కడ బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటుకు కూడా ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులు కూడా పూర్తై 150 పడకల ఆసుపత్రిగా ఇది రూపుదిద్దుకున్నట్లయితే అత్యాధునికి కార్పొరేట్‌ స్థాయి వైద్యాలయంగా ఇది ప్రత్యేకతను సంతరించుకోనుంది.

నెఫ్రా ప్లస్‌ సంస్థ ఆధ్వర్యంలో యూనిట్‌ ఏర్పాటు
పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం కింద నెఫ్రా ప్లస్‌ సంస్థ ఈ యూనిట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నది. దీనికి స్థానిక ఆసుపత్రిలోని ఒక వార్డును కేటాయించనున్నారు. ఇందులో పది వరకూ అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేస్తారంటున్నారు. ఇప్పటివరకూ ఇక్కడి ప్రాంతీయ ఆసుపత్రిలో కిడ్నీ రోగులకు పరీక్షలు చేసి విశాఖ కేజీహెచ్‌కు పంపిస్తున్నారు. ఈ యూనిట్‌ ఇక్కడ ఏర్పాటైతే మూత్ర పిండాల వ్యవస్థ విఫలమైన రోగులకు వాటికి ప్రత్యామ్నయంగా డయాలిసిస్‌ చికిత్స వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా నిరుపేద రోగులకు రూ.లక్షల్లో సొమ్ము ఆదా అవ్వడమే కాకుండా వారి ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఏర్పడుతుంది.

నెల రోజుల్లోనే యూనిట్‌ ఏర్పాటు
ఈ యూనిట్‌ నెల రోజుల్లోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇటీవల విజయవాడలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య విధాన పరిషత్తు ఉన్నతాధికారుల సమావేశంలో వీటిపై చర్చించారు. ఇందులో వైద్య విధాన్‌ పరిషత్తు కమిషనరు డాక్టరు నాయక్‌ నర్సీపట్నంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని వల్ల ఏజెన్సీ ప్రాంతం రోగులందరికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ప్రాంతీయ ఆసుపత్రిలో అనుకూలమైన ఏదో ఒక వార్డును ఈ యూనిట్‌ ఏర్పాటుకు వీలుగా మార్పుచేయనున్నాం. దీనికి 1500 చదరపు అడుగుల స్థలం ఉండాలని నెఫ్రా సంస్థ కోరింది. ఈ సంస్థ ప్రతినిధులు రెండుమూడు రోజుల్లో ఇక్కడికి వచ్చి స్థలాన్ని పరిశీలించనున్నారు.