కొయ్యూరు, కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రలో అటవీ నర్సరీలను అభివృద్ధి చేసేందుకు రానున్న పదేళ్లకు సంబంధించి రూ.5 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ (సీసీఎఫ్) పీఎస్ రాహుల్‌పాండే చెప్పారు. కొయ్యూరు మండలం గుజ్జుమానుపాకలులోని నర్సరీని, నల్లగొండ, గొలుగొండ మండలం కృష్ణదేవిపేట టేకు ప్లాంటేషన్లను మంగళవారం పరిశీలించారు. టేకు ప్లాంటేషన్ నరికివేత పనులను నిలిపి వేయడంపై ఆరా తీశారు. గంగాలమ్మ పండగ నేపథ్యంలో పనులను ఆపేసినట్లు రేంజర్ షఫీ చెప్పారు. నర్సరీల్లో మొక్కలు పెంచి వాటిని అడవుల్లో పెంచడంతోపాటు రైతులకూ అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు రాహుల్‌పాండే పేర్కొన్నారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో అటవీ ఫలసాయం నిధులు అడవుల అభివృద్ధికే ఖర్చు చేసేందుకు నిర్ణయించామన్నారు. మొక్కల పెంపకం సామాజిక బాధ్యతగా అందరూ గుర్తించాలన్నారు. కలప అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అటవీ సిబ్బంది పోస్టుల భర్తీ కోరుతూ ప్రభుత్వానికి నివేదించామన్నారు. నర్సరీల అభివృద్ధి, టేకు ప్లాంటేషన్‌పై చింతపల్లి సబ్ డీఎఫ్‌వో వినోద్‌కుమార్, కేడీపేట రేంజర్ సఫీలకు పలు సూచనలు చేశారు. అనంతరం కృష్ణదేవిపేటలోని అటవీ శాఖ కార్యాలయాన్ని, గొలుగొండ కలప డిపోను సందర్శించారు.