News

Realestate News

నగర రోడ్లపై కొత్త బస్సులు

Vizag real estate News

నగర రోడ్లపై కొత్త బస్సులు
3 వేల బస్సులు కొనేందుకు నిర్ణయం
వీటిలో విశాఖకు అత్యధిక ప్రాధాన్యం
కొత్తవి రాగానే గ్యారేజీలకు పాత బస్సులు
బస్సుల స్థితిని తెలిపేల జీపీఎస్‌ విధానం
‘ఈనాడు’తో ఆర్టీసీ ఈడీ రామకృష్ణ
ఈనాడు- విశాఖపట్నం
కాలం చెల్లిన బస్సులను నగరంలో ఆర్టీసీ నడుపుతోందనే అపోహ చాలామందిలో ఉంది. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. 12 లక్షలనుంచి 14 లక్షల కిలో మీటర్లు తిరిగిన బస్సులను గ్యారేజీకి పరిమితం చేయాలనడం సరికాదు. బస్సుల ఛాసీ దెబ్బతిన్నపుడు మాత్రమే వీటిలో ప్రయాణించే ప్రజలకు ఇబ్బంది కలగొచ్చు. అలాంటి బస్సులను సాధ్యమైనంత వరకు పక్కన పెడుతున్నాం. ఇంజిన్‌, గేరు బాక్సు పరంగా సమస్యలు తలెత్తితే విజయనగరంలోని వర్క్‌షాపునకు తరలించి మరమ్మతులు చేయించి మళ్లీ రోడ్లపై తిప్పుతున్నాం. అంత మాత్రాన ఇలాంటి బస్సులు తిప్పేందుకు వీల్లేదనుకోవడం పొరపాటు. ప్రయాణికులకు అనువుగా, సౌకర్యంగా ఉన్న బస్సులు మాత్రమే ప్రస్తుతం రోడ్లపై ఉన్నాయి.

నగర రోడ్లపైకి త్వరలో కొత్త బస్సులు రానున్నాయి. కాలం చెల్లిన బస్సుల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక బస్సులు మార్గమధ్యంలో నిలిచిపోతున్న సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కొత్తగా 3 వేల బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిలో ప్రధాన నగరాల్లో ఒకటైన విశాఖపట్నానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని ఆర్టీసీ కార్యనిర్వాహక సంచాలకులు (ఈడీ) ఎ.రామకృష్ణ ధ్రువీకరించారు. నగరంలో ఆర్టీసీ కార్యకలాపాల పరిశీలన కోసం వచ్చిన ఆయన ఆదివారం ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

నగరంలో శీతలబస్సులకు మంచి డిమాండు ఉన్నందున, అదనపు కేటాయింపుల కోసం సంస్థకు నివేదించామన్నారు. ఇప్పటికే తిరుగుతున్న శీతల బస్సులకు ప్రయాణికుల నుంచి వూహించిన దానికంటే ఎక్కువ ఆదరణ లభిస్తోందన్నారు. నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచేందుకు సంస్థ పరంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం అనేక సదుపాయాలు అందించడంతోపాటు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు, సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఈ సందర్భంగా ఈడీ చెప్పిన పలు విషయాలు ఆయన మాటల్లోనే…

ఛాసీ పరంగా ఇబ్బంది లేకపోయినా, ఎక్కువ కాలంగా తిరుగుతున్న బస్సులు కొన్ని జిల్లాల్లో ఉన్నాయనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 3 వేల కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఇవి డిపోలకు రాగానే చాలాకాలంగా తిరుగుతున్న బస్సులను గ్యారేజీలకు పరిమితం చేసి వాటి స్థానంలో కొత్తవి నడుపుతాం. శీతల బస్సులకు బాగా డిమాండు ఉన్నందున, వీటికి ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు తిరుగుతున్న శీతల బస్సులకు ప్రయాణికుల నుంచి చక్కని ఆదరణ లభిస్తోంది. దీంతో వీటిని విశాఖ నుంచి దూర ప్రాంతాలకు నడుపుతున్నాం. నగర పరిధిలో వీటిని ఏర్పాటు చేయాలనే డిమాండు ప్రజల్లో ఉంది, ఇదే విషయాన్ని సంస్థ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లాం.

బస్సుల రాకపోకలను ప్రయాణికులు తెలుసుకునేలా త్వరలో భౌగోళిక స్థితి వ్యవస్థ(జీపీఎస్‌)ను ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్టీసీ విడుదల చేస్తున్న యాప్‌ను మొబైల్‌లోకి ప్రజలు డౌన్‌లోడు చేసుకొని అందులో నుంచి అన్ని బస్సుల రాకపోకల వివరాలు తెలుసుకోవచ్చు. ఏ బస్సు ఎప్పుడు, ఎన్ని గంటలకు వస్తుంది, ప్రస్తుతం బస్సు ఎక్కడ ఉంది … వంటి వివరాలన్నీ తెలుసుకొని ఆ మేరకు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఆర్టీసీ బస్సులకు జీపీఎస్‌ వ్యవస్థను తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి అవుతుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నాం. దీనివల్ల ఆక్యుపెన్సీ తప్పక పెరుగుతుంది.

ఆర్టీసీ ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన లగేజీ వ్యవస్థకు మంచిస్పందన లభిస్తోంది. వివిధ వస్తువులను, పార్శిళ్లను ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేసేందుకు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయిస్తున్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇప్పటికే ఈ వ్యవస్థ అమలులోకి వచ్చింది. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్సులో ఇందుకోసం ప్రత్యేకంగా గది కేటాయించాం. ప్రయివేట్‌ సంస్థలతో సంబంధం లేకుండా ఆర్టీసీయే వస్తు రవాణా బాధ్యత కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని రెండో తరగతి పట్టణాలకు కూడా విస్తరించే యోచనతో ఉన్నాం.

ఆర్టీసీ స్థలాలు చాలాచోట్ల ఖాళీగా ఉన్నందున అక్కడ వాణిజ్య పరంగా ఉన్న డిమాండుని దృష్టిలో పెట్టుకొని వీటిని నిర్మాణ-నిర్వాహణ-బదిలీ (బీఓటీ) పద్ధతిలో ప్రయివేట్‌ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించాం. నర్సీపట్నంలో ఆర్టీసీ స్థలంపై ఇప్పటికే ఎంఓయూ పూర్తయ్యింది. ఎంవీపీలోని ఆర్టీసీ స్థలాన్ని కూడా ఇదే పద్ధతిలో కేటాయించేలా ఆలోచనలు చేస్తున్నాం. మద్దిలపాలెంపై సాంకేతికంగా సమస్యలు ఉన్నందున, ప్రస్తుతానికి పక్కన పెట్టాం. మరికొన్ని జిల్లాల్లోనూ ఖాళీ స్థలాల వినియోగంపై దృష్టి పెడుతున్నాం.