నగర ఐ.టి.కి మరో మణిహారం
సిద్ధమవుతున్న మిలీనియం టవర్
మరో టవర్ నిర్మాణానికి ఆదేశాలు
ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఐటీ రంగ ప్రగతిని పరుగులు పెట్టించేందుకు రాష్ట్రప్రభుత్వం ఎనిమిది అంతస్తుల్లో భారీ మిలీనియం టవర్‌ను సిద్ధం చేసింది. ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందర్శించనున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ భవనం మొత్తాన్ని కాండ్యుయంట్ టెక్నాలజీస్ సంస్థ తీసుకుంటోంది. ఈ సంస్థ రాష్ట్రంలో తొలిసారిగా తన కార్యకలాపాల్ని ప్రారంభించబోతోంది. ఇప్పటికే బెంగళూర్, నోయిడా, కొచ్చిన్ తదితర నగరాల్లో సుమారు 20 వేల మందితో కార్యకలాపాలు సాగిస్తోంది. అమెరికాకు చెందిన జెరాక్స్ సంస్థకు ఇది అనుబంధంగా ఉంది. ఐటీ సేవలు, బిజినెస్ ప్రాసెస్ రంగాల సేవలందిస్తోంది. విశాఖలో గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్, బి.పి.ఒ. సేవల్ని అందించనుంది. స్థానిక అవసరాల కోసం ఇప్పటికి 120 మందిని ఎంపిక చేసింది. మొత్తం 200 మందిని ఉద్యోగాలకు సిద్ధం చేసింది. మిలీనియం టవర్‌లో మొత్తం మూడువేల మందికి ఉద్యోగాలొచ్చేలా చర్యలు చేపట్టింది. మొత్తం ఐదువేల మందికి దశల వారీగా ఉద్యోగాలివ్వనుంది.
మూడున్నర లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి….: మిలీనియం టవర్ ద్వారా 3.50 లక్షల చదరపు అడుగుల ప్రాంగణం అందుబాటులోకొస్తోంది. నాలుగెకరాల్లో రూ. 145 కోట్ల వ్యయంతో నిర్మిస్తుండగా.. ఇప్పటిదాకా రూ. 80 కోట్ల వరకు ఖర్చయ్యాయి. ఫ్లోరింగ్, ఇతర పనులను చేయాల్సి ఉంది. ఎనిమిది అంతస్తుల్లో (జి+7) మొత్తం రెండు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని విధి నిర్వహణకు అనుకూలంగా తీర్చిదిద్దుతారు. వాహనాల పార్కింగ్ కోసం 1.50 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. ఇందుకోసం రెండు బేస్మెంట్లు నిర్మించారు. మొత్తం పది ఫ్లోర్లు ఉంటాయి. ఎ.పి.ఐ.ఐ.సి. అధికారుల ఆధ్వర్యంలో నిర్మాణం సాగింది. లిఫ్టులు, ఏసీలు, అగ్నిమాపక పరికరాలు, జనరేటర్లు తదితరాలన్నీ ప్రభుత్వం సమకూరుస్తుంది. అంతస్తుల లోపలి భాగాలను కాండ్యుయంట్ సంస్థ తన అవసరాలకు వీలుగా అభివృద్ధి చేసుకుంటుంది. ఇది రెండు నెలల వ్యవధిలో తన కార్యాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది.
టవర్- బి నిర్మాణానికి ఉత్తర్వుల జారీ…
మిలీనియం టవర్‌కు అనుబంధంగా ‘మిలీనియం టవర్-బి’ నిర్మించాలని ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. దీన్ని రూ. 55 కోట్లతో నిర్మించనున్నారు. పార్కింగ్‌కు ఇప్పటికే స్థలం కేటాయించినందున ఎనిమిది అంతస్తుల (జి+7) భవనం నిర్మిస్తే సరిపోతోంది. ఇది పూర్తయితే మరో లక్ష చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వస్తుంది.
అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించాం….
ఐ.టి. సంస్థలకు అనుగుణంగా అధునాతనంగా పది అంతస్తులతో అత్యుత్తమ ప్రమాణాలతో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నాం. తుది మెరుగులు దిద్దుతున్నాం.
యతిరాజు, జోనల్ మేనేజర్, ఎ.పి.ఐ.ఐ.సి.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399