News

Realestate News

నగరం… నెంబర్‌1

31-05-2016 vizagrealestate news

నగరం… నెంబర్‌1
మున్సిపల్‌ సేవల్లో రాష్ట్రంలోనే అగ్రస్థానం
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

‘‘విశాఖ నగరం ఎంతో అద్భుతంగా ఉంది. ఇది నా మది దోచింది. ఇక్కడున్న పచ్చదనం.. సుందర సముద్రతీరం మనసును ఆకట్టుకునేవిగా ఉన్నాయి…’’

-ఇటీవల ఓ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడేందుకు వచ్చిన భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌శర్మ అభిప్రాయమిది..

‘‘నేను స్థిరపడదగ్గ నగరాల్లో విశాఖ ఒకటి.ఈ నగరంతో నాకెంతో అనుబంధం ఉంది.నా క్రీడాజీవితానికి ఓ కీలక మలుపుగా నిలిచింది.’’

– భారత క్రికెటü జట్టు కెప్టెన్‌మహేంద్రసింగ్‌ ధోనీ స్పందన ఇది..

లా ప్రతి హృదయాన్నీ ఆకట్టుకుంటూ.. తన ప్రత్యేకతను దశదిశలా చాటుతూ విశాఖ నగరం తన ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ‘స్మార్ట్‌’ రేసులో 98 నగరాలతో పోటీపడి 8వ స్థానాన్ని దక్కించుకుంది. స్వచ్ఛభారత్‌ పరుగులో దేశంలోని దిగ్గజ నగరాలతో పోటీపడి 5వ స్థానాన్ని దక్కించుకుంది. తాజాగా 11 అంశాల ఆధారంగా మున్సిపల్‌ సేవల్లో రాష్ట్రంలోనే అగ్రాసనాన్ని అలంకరించింది. ఇదంతా అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన, సిబ్బంది అప్రమత్తత, సేవల పట్ల నిబద్ధత వల్లనే సాధ్యమైంది. ఇవన్నీ వెరసి విశాఖ నగర స్థాయి ఏమిటో నిరూపిస్తున్నాయి. ఈ ఘనతలు సాధించడానికి బలమైన పునాదులు నగరంలో ఉన్నాయి. ఆయా అంశాలను ఒక్కసారి విహంగవీక్షణంగా పరిశీలిస్తే…

నగరంలో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ నౌక సమీక్ష (ఐఎఫ్‌ఆర్‌) విజయవంతం కావడం, కార్యక్రమం నిర్వహణకు ముందు రూ. 120 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రహదారుల అభివృద్ధి, నడక మార్గాల సుందరీకరణ, జాతీయ రహదారి, ముఖ్య కూడళ్లలో హరిత హారాలు, పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక వంటివి నగరానికి ఖ్యాతిని తెచ్చాయి.

పారిశుద్ధ్యం మెరుగు…
విశాఖలో ఉత్పత్తయ్యే చెత్తనంతా జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తుంటారు. జీవీఎంసీలో 4130 మంది పొరుగు సేవల కింద, మరో 900 మంది శాశ్వత ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించడం, దానిని వీధుల్లో వేయకుండా నేరుగా చెత్తను తరలించే వాహనంలోకి వేస్తున్నారు. మరో పక్క డంపర్‌ బిన్నులను తొలగించక ముందు, తరువాత సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి మున్సిపల్‌ పరిపాలన సంచాలకుని డ్యాష్‌బోర్డుకు పంపించాల్సి ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్‌ హాజరు, పారిశుద్ధ్య వాహనాలకు జీపీఎస్‌ వ్యవస్థ అమర్చడం వంటి అన్ని రకాల కార్యక్రమాల్లో జీవీఎంసీ ముందుంది.

అనాగరిక విధానాన్ని విడనాడేందుకు…
బహిరంగ మల విసర్జన వంటి అనాగరిక విధానాలను అరికట్టడానికి కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆగస్టుకల్లా నగరాన్ని బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం పెట్టుకున్నారు. కొండవాలు ప్రాంతాల్లో సామాజిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. నగరంలో ఇప్పటి వరకు 7 వేల మరుగుదొడ్లు నిర్మాణంపూర్తి చేయగా, మరో 10 వేలు వివిధ దశల్లో ఉన్నాయి.

చెత్తను శక్తిగా మార్చేలా…
నగరంలో ఉత్పత్తయ్యే 1000 మెట్రిక్‌ టన్నుల్లో 950 మెట్రిక్‌ టన్నులను కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి అవసరమైన ప్రాజెక్టు కోసం జీవీఎంసీ ఇటీవలే దిల్లీకి చెందిన సంస్థతో ఒప్పందం చేసుకుంది. అందుకు అనువైన స్థలాన్ని ఆనందపురం మండలం తంగుడుబిల్లిలో కేటాయించింది.

పక్కాగా మంచినీటి సరఫరా…
జీవీఎంసీ పరిధిలో పరిశ్రమలకు, తాగునీటికి ఇబ్బంది లేకుండా జీవీఎంసీ అధికారులు చేస్తున్న కృషి ప్రశంసనీయమే. సొంత వనరులు లేకపోయినప్పటికీ, వివిధ ప్రాంతాల నుంచి నగరానికి నీటిని తరలించి, దానిని శుభ్రపరిచి, సరఫరా చేస్తున్నారు. ఏటా రూ. 150 కోట్లతో జరిగే ఈ ప్రక్రియను అధికారులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వనరుల లోపం వల్ల ప్రతి మనిషికి ఇవ్వాల్సిన 120 లీటర్లకు బదులుగా 85 లీటర్లు సరఫరా చేస్తున్నారు. నగరంలో 1.20 లక్షల సాధారణ గృహ కనెక్షన్లు, 2 వేల సెమీ బల్క్‌, 77 బల్క్‌ కనెక్షన్ల ద్వారా నీటిని సరఫరాచేసి, రూ.180 కోట్ల మేర ఆదాయాన్ని సమకూరుతుంది.

ఆస్తిపన్ను వసూళ్లలో రికార్డు…
2015-16 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 204 కోట్లకు చేరింది. నాలుగు లక్షల అసెస్‌మెంట్లు, పరిశ్రమలు, ఇతర సంస్థల నుంచి పన్ను రాబట్టడానికి రెవెన్యూ సిబ్బంది రాత్రీపగలు కష్టపడాల్సి వచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 70 కోట్లు పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఆర్థిక పరిస్థితి భేష్‌…
ఆస్తి పన్ను ద్వారా రూ.200 కోట్లు, నీటి సరఫరా ద్వారా రూ.180 కోట్లు, పట్టణ ప్రణాళిక ద్వారా రూ.100 కోట్లు ఆదాయం సమకూర్చుకోగలిన సామర్థ్యం జీవీఎంసీకి సొంతం. గత పదేళ్లలో రూ.2 వేల కోట్ల జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ప్రాజెక్టులకు 20 శాతం జీవీఎంసీ నిధులు సమకూర్చడంతో పాటు, సాధారణ అభివృద్ధి పనులకు ఏటా రూ.150 కోట్లు వెచ్చిస్తోంది.

పాఠశాలల్లో ఐఐటీ శిక్షణ…
జీవీఎంసీ పాఠశాలల్లో విద్యార్థులకు ఐఐటీ శిక్షణ గత రెండేళ్లుగా జరుగుతోంది. మున్సిపల్‌ మంత్రి నారాయణ గత రెండేళ్ల నుంచి ఐఐటీకి సంబంధించిన పుస్తకాలను పంపిస్తుండగా, నగరంలోని 17 ఉన్నత పాఠశాలల్లో ఏటా 100 మంది పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు.

పచ్చదనానికి చిరునామాగా…
హుద్‌హుద్‌ అనంతరం నగరంలో పచ్చదనాన్ని ప్రాధాన్యమిచ్చిన జీవీఎంసీ 2 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించి, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల సహకారం తీసుకుంది. మొక్కలు పాడవకుండా, ప్రత్యేకంగా మోటార్లు తవ్వించి, వాటి ద్వారా నీటిని ప్రతి రోజూ సరఫరా చేస్తూ మండు వేసవిలోనూ పచ్చగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఆన్‌లైన్‌లో ప్రణాళిక కార్యకలాపాలు…
నగరంలో పట్టణ ప్రణాళిక కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఎలాంటి నిర్మాణమైనా తప్పకుండా ప్లాన్‌ తీసుకోవాల్సిందే. నిబంధనలకు అనుగుణంగా ఉన్న నిర్మాణాలకే నివాసయోగ్య ధ్రువపత్రం(ఓసీ) మంజూరు చేస్తుంటారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానాన్ని జీవీఎంసీలో విజయవంతంగా అమలు చేస్తున్నారు.

రూ.231 కోట్ల రుణాలు…
జీవీఎంసీ ఆధ్వర్యంలో 20 వేల మహిళా సంఘాల్లో లక్ష మందికిపైగా సభ్యులున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.245 కోట్ల రుణాలను మంజూరు చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.270 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్థేశించింది. ఇప్పటి వరకూ రూ.30 కోట్ల మేర రుణాలను మంజూరు చేసింది.

సిటిజన్‌ ఛార్టర్‌ అమలుకు పటిష్ట వ్యవస్థ…
ప్రజల సమస్యల పరిష్కారం, వివిధ సేవల కోసం ఏర్పాటు చేసిన సిటిజన్‌ ఛార్టర్‌ అమలు తీరు ఎలా ఉన్నా, జీవీఎంసీలోని అన్ని జోన్లలోనూ ప్రత్యేక కౌంటర్లు, సిబ్బందిని జీవీఎంసీ నియమించింది. వచ్చే ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారి వద్దకెళ్లేలా చర్యలు తీసుకుంది.