News

Realestate News

నగరంలో వుడా ఫుడ్‌ పార్కు!

నగరంలో వుడా ఫుడ్‌ పార్కు!
రాష్ట్రపతి పర్యటనలోగా యుద్ధవిమాన ప్రదర్శనశాల పూర్తి
ఆ గడువులోపే గురజాడ కళాక్షేత్రం, హెలీటూరిజం అందుబాటులోకి..
వుడా ఉపాధ్యక్షుడు బసంత్‌కుమార్‌
ఈనాడు, విశాఖపట్నం: నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వుడా ఆధ్వర్యంలో ఫుడ్‌ పార్కు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు వుడా వీసీ పట్నాల బసంత్‌కుమార్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లోని నక్లెస్‌రోడ్డు తరహాలో అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో ఉన్నట్లు చెప్పారు. సోమవారం తన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే…

రాష్ట్రపతి పర్యటనలోగా..
డిసెంబరు 7న రాష్ట్రపతి చేతుల మీదుగా టీయూ-142 యుద్ధవిమాన ప్రదర్శనశాల ప్రారంభం కానుంది. ఆడియో విజువల్‌ షో, ఎస్కలేటర్‌, సావనీర్‌ షాపు, ఫసాడ్‌ తదితర నిర్మాణాలను డిసెంబరు మొదటివారంలోపుగానే పూర్తి చేస్తాం. బరంపురంలో వైమానికదళ ప్రదర్శనశాల నిర్మాణంలో భాగస్వాములైన ఆర్కిటెక్‌ రీటాకు ఇక్కడి బాధ్యతలు అప్పగిస్తున్నాం. యుద్ధవిమాన విడిభాగాలపై పర్యాటకుల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విమాన వెనక భాగంలో భవనాలు కనిపించకుండా గ్రీన్‌ వాల్‌ ఏర్పాటు చేయాలా? వాటర్‌ ఫాల్‌ తరహాలో నిర్మించాలా? అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంచనా వ్యయం రూ. 10 కోట్లు అనుకున్నా.. రూ. 30 కోట్ల వరకు చేరేలా ఉంది.

జెండా వూపించాలా..? రైడ్‌ చేయించాలా..?
ఏడురోజుల హెలి పర్యాటక ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 23, 27 తేదీల్లో విశాఖలో ముఖ్యమంత్రి పర్యటన ఉన్నా.. హెలీటూరిజం ప్రారంభానికి సమయం ఉంటుందా..? లేదా..? అన్నది పరిశీలిస్తున్నాం. ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు తొలి విహారం చేయాలంటే.. నిబంధనల మేరకు రెండు ఇంజిన్లున్న హెలికాప్టర్‌ అందుబాటులో ఉండాలి. లేక జెండా వూపించి ప్రారంభించాలా..? అన్నదానిపై కూడా ఆలోచిస్తున్నాం.

చురుగ్గా గురజాడ కళాక్షేత్రం పనులు
వుడా భవన్‌ ఎదురుగా గురజాడ కళాక్షేత్రం పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి డిసెంబరు మొదటివారానికి అందుబాటులోకి తెస్తాం. కైలాసగిరి నవీకరణకు అహ్మదాబాద్‌కు చెందిన సాయి శాస్త్ర కన్సెల్టెన్సీకి మొబలైజేషన్‌ అడ్వాన్సు ఇచ్చాం. భవిష్యత్తులో స్కైటవర్‌, భారీ కేబుల్‌ కార్‌ (రోప్‌ వే) ఏర్పాట్లకూ చర్యలు తీసుకుంటాం. ఎన్‌ఏడీ పైవంతెన పనులు రెండు వైపుల నుంచి సమాంతరంగా చేపట్టి నిర్ణీత గడువుకు ముందే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.

హరితపై అప్పీల్‌కు వెళ్తాం..
వుడా కార్యదర్శి శ్రీనివాస్‌ మాట్లాడుతూ హరిత గృహాలకు సంబంధించి జాతీయ వినియోగదారుల రెడ్రసల్‌ ఫోరం ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళ్తామని స్పష్టం చేశారు. దాకమర్రి లేఅవుట్‌ లాటరీ ప్రకటనపై త్వరలో స్పష్టతకు వస్తామన్నారు. వుడా ఎస్టేట్‌ అధికారి వసంతరాయుడు మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన సర్వేలో వుడాకు చెందిన 1200 ఎకరాలు ఆక్రమణల్లో ఉన్నాయని, ఇందులో 658 ఎకరాలు న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నట్లు వివరించారు. మిగిలిన భూముల్లో ఆక్రమణల తొలగింపునకు బృందాలను పంపుతామన్నారు. చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ భవానీశంకర్‌ మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో ఇప్పటివరకు 357 మందికి అనుమతిపత్రాలు అందించగా.. 284 దరఖాస్తులను తిరస్కరించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల ఎస్‌ఈ సూరయ్య మాట్లాడుతూ రూ. 6 కోట్లతో పాయకరావుపేటలో ఆర్‌అండ్‌బీ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా మార్చనున్నట్లు చెప్పారు. గ్రేహౌండ్స్‌ మార్గంలో రూ. 74 లక్షలతో రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. రూ. 3 కోట్లతో విశాఖ వ్యాలీ రోడ్డు నిర్మిస్తామన్నారు. చినముషిడివాడలో రూ. 5 కోట్లతో కల్యాణ మండపం, రూ. 3.50 కోట్లతో గోపాలపురంలో ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించనున్నట్లు తెలిపారు. గాజువాక- పెదగంట్యాడ రోడ్డులో ఓపెన్‌ ఆడిటోరియం నిర్మాణానికి అంచనాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.