News

Realestate News

నగదు కొరతను తీరుస్తాం!

ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు అధికారులతో కలెక్టర్‌ భేటీ
ఏటీఎంలు, బ్యాంకు శాఖల సందర్శన
ఖాతాదారులతో మాటామంతీ
నేడు సమన్వయ కమిటీ సమావేశం

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: రూ. 100 నోట్ల సరఫరాను పెంచి నగరంలో నగదు కొరతను తీర్చనున్నట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. సెలవుపై వెళ్లిన కలెక్టర్‌ శనివారం విధుల్లో చేరారు. కరెన్సీ కొరతను తీర్చడం, నగదు కోసం నగర ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కలెక్టర్‌ ఆదివారం ఉదయమే రంగంలోకి దిగారు. నగరంలో పలు బ్యాంకు శాఖలు, ఏటీఎం కేంద్రాలను సందర్శించారు. బ్యాంకు ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని తెలుసుకున్నారు. ఖాతాదారులతో మాట్లాడి వారిలో నెలకొన్న భయాందోళనలను తొలగించే ప్రయత్నం చేశారు.
బ్యాంకు అధికారులతో చర్చ…
తొలుత సిరిపురం కూడలిలో ఉన్న ఎస్‌బీఐ డీజీఎం అజోయ్‌కుమార్‌ పండిత్‌తో భేటీ అయ్యారు. ఎస్‌బీఐ పరంగా జరుగుతున్న లావాదేవీలను కలెక్టర్‌ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. శనివారం సాయంత్రం వరకూ రూ. 217 కోట్లు పంపిణీ చేశామని, రూ. 220 కోట్లు డిపాజిట్లగా సేకరించామని తెలిపారు. నగరంలో ఎస్‌బీఐ ఏటీఎంలు 220 ఉన్నాయని, వీటిలో 167 పనిచేస్తున్నట్లు డీజీఎం వివరించారు. ఏటీఎంలలో నగదు నింపిన తర్వాత అయిపోతోందని, మళ్లీ నింపేందుకు సమయం పడుతోందన్నారు. అనంతరం సీతమ్మధారలోని ఆంధ్రాబ్యాంకు జోనల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ డీజీఎం విజయలక్ష్మితో కలెక్టర్‌ భేటీ అయ్యారు. తాము ఇంతవరకూ రూ. 33 కోట్లు నగదు పంపిణీ చేశామని, 60 ఏటీఎంలు పనిచేస్తున్నాయని ఆమె కలెక్టర్‌దృష్టికి తీసుకెళ్లారు. రూ. 221 కోట్లు డిపాజిట్లగా సేకరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ పరిస్థితుల్లో నగరంలో రోజుకు రూ.600 నుంచి రూ. 700 కోట్ల నగదు అవసరమని తెలిపారు. నగదు పంపిణీపై పరిమితులున్న దృష్ట్యా ప్రస్తుతం రోజుకు రూ. 500 కోట్లు సరిపోతుందని తెలిపారు. ఎస్‌బీఐ వద్ద ఉన్న నగదు నాలుగురోజుల వరకూ సరిపోతుందని, ఆంధ్రాబ్యాంకుతో రెండురోజుల్లో మరింత నగదు వచ్చే అవకాశం ఉందన్నారు. రూ. 100 నోట్లను పెంచి నగదు కొరత తీర్చే చర్యలను చేపట్టామన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అందరి అవసరాలకు సరిపడ నగదును సరఫరాచేస్తామని చెప్పారు. అన్ని బ్యాంకుల వద్ద షామియానాలు వేయాలని ఆదేశించామని, తాగునీరు వంటివి ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకుల మధ్య సమన్వయం పెంచి, కరెన్సీ కష్టాలను తీర్చేందుకు సోమవారం బ్యాంకర్లతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

ఉప్పు సరఫరా నిలిపేస్తే కఠిన చర్యలు
నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉప్పు కొరత లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఎవరైనా ఎక్కడైనా ఉప్పు సరఫరాను నిరోధించి, ధరలు పెంచితే క్రిమినల్‌ కేసులుపెడతామని హెచ్చరించారు. దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఉప్పు నిల్వలు సరిపడేంతగా ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు.