News

Realestate News

ధన్యోస్మి

ధన్యోస్మి
అప్పన్న నిజరూప దర్శనంతో తరించిన భక్తజనం
ఏర్పాట్లలో యంత్రాంగం చర్యలు భేష్‌
సామాన్యులకే పెద్దపీట
న్యూస్‌టుడే సింహాచలం, అడవివరం
సహస్ర కోటి భాను తేజంతో సాక్షాత్కరించే శ్వేత వరాహ స్వామిని దర్శించుకోవాలని దూరప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజన ఝరిలో సింహగిరి తడిచిముద్దయ్యింది. మువ్వన్నెల మువ్వంక స్వామి శ్రీగంధం పూత నుంచి నిజరూపంలోకి రాగానే ఆ దృశ్యాన్ని తనివితీరా అనుభవించిన అప్పన్న ఆలయం ఆనందంతో చెమర్చింది. శ్రీచందనం పరిమళాలు స్వాగతం పలికాయి. భక్తుల ఆధ్యాత్మిక పరవశం మిన్నంటింది. 364 రోజుల పాటు స్వామిని చూడాలన్న తపనతో పొడబారిపోయిననయనాలు ఆనందాశృవులతో పన్నీటిని చిలకరించాయి. సింహగిరిపై సోమవారం చందనయాత్రను పురస్కరించుకుని అప్పన్న స్వామి నిజరూప దర్శనం చందనోత్సవం… భక్తుల్లో ఆనందోత్సవాలను నింపింది.

ముందుగానే సర్వ దర్శనం
దేవస్థానం అధికారులు ముందుగా ప్రకటించిన సమయంకన్నా సుమారు గంటా నలభై నిముషాలు ముందుగానే అంటే వేకువజామున 2.20 గంటల నుంచే భక్తులకు స్వామి సర్వ దర్శనం కల్పించారు. అధికారులకు ఆలయ వైదిక వర్గాలు పూర్తిస్థాయిలో సహకరించడంతో భక్తుల దర్శనాలు వేగంగా జరిగాయి. గంటకు 8 నుంచి 9 వేలమంది చొప్పున భక్తులు స్వామిని దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. సుమారు 2 లక్షలమందికిపైగానే భక్తులు వచ్చినట్టు అంచనా.

ఫలించిన వ్యూహం… దర్శనం సుఖవంతం
గత వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని అత్యధిక భక్తులకు వేగంగా దర్శనం కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు అనుసరించిన వ్యూహం ఫలించింది. ప్రోటోకాల్‌ ప్రముఖులు మినహా మిగిలిన అన్ని టిక్కెట్లవారికి నీలాద్రి గుమ్మం నుంచే దర్శనభాగ్యం కల్పించారు. గతేడాదికన్నా క్యూలైన్ల సంఖ్యను 40 శాతానికి పైగా పెంచడంతో దర్శనాల్లో వేగం పుంజుకుంది.

వైద్య శిబిరాల వద్ద రద్దీ
సింహగిరిపై ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో రద్దీ నెలకొంది. సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ ఎంపీ జగదీశ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మధుమేహ పరీక్షలను భక్తులు వినయోగించుకున్నారు. అపోలో, గీతం, తదితర సంస్థలు భక్తులకు వైద్య సదుపాయం అందించాయి.

సాఫీగా రూ. 200 క్యూలైను… భారీగా రూ. 500
చాలామంది భక్తులు రూ. 500 టిక్కెట్లను కొనుగోలు చేశారు. దీంతో ఉదయం 7.30 గంటల సమయంలో రూ. 200 క్యూలైను ఖాళీ అయిపోయింది. రూ. 500 క్యూలైను మాత్రం సింహగిరి బస్టాండు నుంచి రాజగోపురం మార్గం వరకు పెరిగిపోయింది. ప్రముఖులకు కేటాయించిన రూ. వెయ్యి క్యూలైనులో దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది. ఉచిత దర్శనానికి సమయాన్ని బట్టి 4 నుంచి 6 గంటల సమయం పట్టింది.

సింహగిరిపైకి వాహనాలను పంపరాదన్న ట్రాఫిక్‌ పోలీసుల ఆంక్షలు ఫలితమిచ్చాయి. బస్టాండులోనే క్యూలైన్లు కూడా ఉండడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.

ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు
ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు అన్నట్టు కొందరు ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీస్‌, అధికారులు, సిబ్బంది నిబంధనలకు నీళ్లొదిలేశారు. ప్రవేశం లేని మార్గాల్లో సైతం తమ మనుషులను పంపేందుకు ప్రయత్నించారు. ఆలయ దక్షిణ మార్గం గుండా కొందరు ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఈవో అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు నిబంధనలను పక్కకు పెట్టి పదుల సంఖ్యలో బంధువులు, అనుచరులతో ఆలయంలోకి ప్రవేశించారు. ఒకానొక సమయంలో ఆలయ రాజగోపురం నుంచి బయట వరకు ప్రముఖులు బారులుతీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కొంతసేపు సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బంది ఏర్పడింది. తమ మనుషులను దర్శనాలకు పంపే విషయంలో ఒక ఆర్‌ఐకి పోలీసు అధికారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దివ్యాంగులకు దివ్య దర్శనం
దేవస్థానం ముందుగా ప్రకటించిన ప్రకారం దివ్యాంగులకు లిఫ్టు ద్వారా దర్శన భాగ్యం కల్పించింది. వీరికి దర్శనం కల్పించడంలో పోలీసులు సేవా దృక్పథంతో సహాయం చేశారు. ప్రకటించిన సమయాల్లో వచ్చిన దివ్యాంగులకు దర్శనం కల్పించారు. దీంతో ఈసారి అధికంగా వీరు దర్శనం చేసుకోగలిగారు.

ఉత్కంఠ రేపిన క్యూలైన్లు…
ఉదయం 7 గంటల తర్వాత రూ. 500, ఉచిత దర్శనం క్యూలైన్లలో భక్తులు అధికంగా పెరిగిపోవడంతో ఒకదశలో ఉత్కంఠ నెలకొంది. టెంట్లు, షామియానాలను బస్టాండులో ఒకవైపు మాత్రమే వేయడంతో భక్తులంతా ఎండలో నిలబడాల్సి వచ్చింది. ఈ సమయంలో వాతావరణం కాస్త మబ్బుగా ఉండడంతో అప్పటికప్పుడు స్పందించిన అధికారులు టెంట్లు, షామియానాలు రప్పించి సింహగిరి బస్టాండులో వేయించారు. మధ్యాహ్నం సమయంలో ఉచిత క్యూలైను పెరిగిపోయి రూ. 200 క్యూలైను ఖాళీగా మారడంతో ఈవో రామచంద్రమోహన్‌ స్పందించి ఉచిత క్యూలైన్‌లో భక్తులను రూ. 200 వరుసలోకి మళ్లించి రద్దీని నియంత్రించారు.

దూరం నుంచైనా… స్పష్టంగా నిజరూపం
నీలాద్రి గుమ్మం వద్ద నుంచి భక్తులకు స్వామి దర్శనం కల్పించడంపై తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. స్వామి రూపం కనిపించక భక్తులు ఇబ్బంది పడతారని భావించారు. అయితే.. నీలాద్రి గుమ్మం వద్ద నుంచి నిండైన స్వామి నిజరూపం భక్తులకు స్పష్టంగా సాక్షాత్కరించింది. అంతరాలయంలో స్వామి వేంచేసిన మండపం చుట్టూ వెలుతురును తగ్గించి స్వామిపై వెలుగులను ప్రసరింపచేయడంతో అన్ని వయసులవారికి స్వామి దర్శనం కలిగింది.

సమన్వయం… సహకారం
కలెక్టర్‌ ఎన్‌.యువరాజ్‌, దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌, డీసీపీ రాంగోపాల్‌నాయక్‌ సమన్వయంతో వ్యవహరించి ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రముఖుల దర్శనాల సమయంలో కలెక్టర్‌ యువరాజ్‌ ఆలయంలోనే ఉండి అధికారులు, సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు.

Source : http://www.eenadu.net/