News

Realestate News

దేశానికే ‘తూర్పు’ కిరణం

Real Estate News

సాంకేతిక విప్లవంలో ముందున్న ఈపీడీసీఎల్‌
వినూత్న ఆలోచనలతో విజయతీరాలకు
ఇవన్నీ దేశం నలువైపులా విస్తరించేందుకు ప్రయత్నాలు

పది మందీ మనవైపు చూసేలా ఉండాలంటే.. మార్పును అందుకునేంత వేగం ఉండాలి, ఫలితాల్లో ఆదర్శంగా నిలిచేంత చొరవ చూపాలి. ఈ రెండింటినీ మన విశాఖ కేంద్రంగా నడుస్తున్న ఏపీఈపీడీసీఎల్‌ సొంతం చేసుకుంది. ప్రత్యేకించి టెక్నాలజీని అందిపుచ్చుకుని కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఈ రకమైన ప్రయత్నాలు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ను ఆకట్టుకున్నాయి. ఇక్కడ చేపట్టే వినూత్న కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలకు విస్తరించేందుకు ఈపీడీసీఎల్‌ సహకారం కోరారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించడంతో ఇప్పుడు సీఎండీ ముత్యాలరాజు అదేపనిలో నిమగ్నమయ్యారు.

ఈనాడు – విశాఖపట్నం
కేంద్ర మంత్రి సూచనల మేరకు ప్రస్తుతం ఈపీడీసీఎల్‌ సీఎండీ ఒక ప్రత్యేక నివేదిక తయారుచేసే పనిలో ఉన్నారు. సాంకేతికపరంగానే కాకుండా, నష్టాల్ని బాగా తగ్గించడంలో ఇక్కడ జరుగుతున్న ప్రయత్నాలు తదితర అంశాలపై కూడా కేంద్రమంత్రి నివేదిక కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చైనానుంచి రాగానే ఇతర రాష్ట్రాలకు మనం ఎలాంటి విషయాలు తీసుకెళ్లాలనే విషయమై చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రతీ మూడు నెలలకోసారి సీఎండీ ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లి అక్కడి డిస్కంలకు మెలకువలు నేర్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. కేంద్రాన్ని ఆకర్షించిన పలు ప్రాజెక్టుల వివరాలు ఇవీ..

వాహనాలకు జీపీఎస్‌..
గత ఏడాది డిసెంబరు నుంచి డిస్కం పరిధిలో ఉన్న సుమారు 160 వాహనాల్ని జీపీఎస్‌ కిందికి తీసుకొచ్చారు. ఇటు పట్టణ, అటు గ్రామీణ ప్రాంతాల్లో వెనువెంటనే ట్రాన్స్‌ఫార్మర్లను మార్చేందుకోసం ఈ పద్ధతిని తీసుకొచ్చారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. ఎవరైనా రైతు ఫిర్యాదుచేస్తే, అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని, ఆ ట్రాన్స్‌ఫార్మరును వాహనంలో ఎక్కిస్తున్నట్లు ఫొటోలు తీసి, అదే ప్రాంతం నుంచి అప్‌డేట్‌ చేయాలి. సరిగ్గా ఈ సమయం నుంచి పట్టణాల్లో అయితే 12గంటలలోపు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 24 గంటలలోపు అక్కడ ప్రత్యామ్నాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చాలి. ఈ ప్రక్రియ సకాలంలో నడుస్తుందా లేదా అనేందుకు ఈ జీపీఎస్‌ను వినియోగిస్తున్నారు. దీంతో పనితీరు మెరుగుపడటమే కాకుండా, డిస్కం వాహనాలు ఎప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయనేది సీఎండీ స్థాయినుంచి ఇతర ఉన్నతాధికారులంతా చూసేందుకు వీలు ఏర్పడింది. దీంతో నెలకు సుమారు 200 కి.మీల నుంచి, 500కి.మీల ఇంధనం ఆదా అవుతూ వస్తోంది.

కరెంటు వెంటనే వచ్చేలా..
ఏయే ప్రాంతాల్లో కరెంటు పోతోంది, ఎన్ని గంటలు పోతోంది, దానికి కారణాలు.. ఇవన్నీ కార్యాలయంలోనే ఉండి చూసుకునేందుకు వీలుగా ఈపీడీసీఎల్‌ ‘ఔటేజ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’ను రూపొందించింది. డిస్కం పరిధిలో ఉన్న 660 సబ్‌స్టేషన్లను, వాటి పరిధిలో ఉండే ఫీడర్లను జీపీఎస్‌కు అనుసంధానించారు. దీంతో ఎక్కడ కరెంటుపోయింది, ఎంతసేపు పోయింది అనేదీ తెలుసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కరెంటు త్వరగా వచ్చేలా చేసే మార్పునకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది అక్టోబరు 2న మొదలుపెట్టిన ఈ ప్రక్రియ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

కొంగొత్తగా స్మార్ట్‌మీటర్లు..
కరెంటు బిల్లు తీసేందుకు ఎవరూ మీటరు దగ్గరకు వెళ్లకుండానే అనుకున్న తేదీలో బిల్లు తీసే టెక్నాలజీకి ఈపీడీసీఎల్‌ శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ట్రయల్‌రన్‌ను కూడా విజయవంతంగా పూర్తిచేస్తున్నారు. ఈ ప్రక్రియపై ముఖ్యమంత్రి కూడా అభినందించారు. పెదవాల్తేరులోని 3 ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో ఉన్న 190 ఇళ్లకు పూర్తిస్థాయిలో స్మార్ట్‌మీటర్లని అమర్చి ఈ ప్రయోగం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీటరు ధర రూ.8 వేలుగా ఉంది. ప్రత్యేక నిధులతో బల్క్‌గా కొంటే ధరను తగ్గించి కొనేందుకు వీలవుతుంది. దీనిమీద కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

విద్యుత్తు ప్రవాహ్‌ యాప్‌..
కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌కు బాగా నచ్చిన టెక్నాలజీ.. ఏపీ విద్యుత్‌ప్రవాహ్‌ యాప్‌. దీని ద్వారా సామాన్యుడు కూడా విద్యుత్తు స్థితిగతులు తెలుసుకునేందుకు వీలుగా ఉండటం.. అలాగే రాష్ట్రంలోని ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏపట్టణాన్ని తీసుకున్నా అక్కడ కరెంటు ఎన్నిగంటలు ఉంటోందనే గణాంకాలు కూడా కళ్లముందు కనిపించేలా ఉండటం ఆయనకు నచ్చడానికి ఉన్న మరో కారణం. ఈ యాప్‌కు ఉపయోగించిన టెక్నాలజీని ఇతర రాష్ట్రాలకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. త్వరలో అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే టెక్నాలజీతో వారివారి డిస్కంలకు యాప్‌లు తయారవబోతున్నాయి.

నష్టాలకు చెక్‌..
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వమైనా కోరుకునేది విద్యుత్తు నష్టాల్ని తగ్గించడానికే. కానీ ఈపీడీసీఎల్‌ అడుగుముందుకేసి నష్టాల్ని బాగా తగ్గించేసింది. 2014-15లో 6.32శాతంగా ఉన్న నష్టాల్ని 2015-16లో 5.48 శాతానికి తెచ్చింది. ఒక శాతం నష్టం తగ్గించినా సుమారు రూ. 300 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతోంది. దీన్ని ఇంకా తగ్గించాలనే తలంపుతో వారు ముందుకు వెళ్తున్నారు. ఇదెలా సాధ్యమవుతోందని తెలుసుకునేందుకు ఈమధ్యే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన సాంకేతిక బృందం ఇక్కడికొచ్చి ప్రత్యేక సమీక్షలు కూడా చేసింది. అలాగే 100 శాతం రెవెన్యూ సాధించడమనేది మరో మంచి విషయం. ఇలా ప్రస్తుతం ఉన్న రూ.9వేల కోట్ల టర్నోవరును రూ.10 వేల కోట్లకు చేయాలనే లక్ష్యంగా ఈపీడీసీఎల్‌ ముందుకు వెళ్తొంది. భవిష్యత్తులో నెలలో ఒకే తేదీన ఐదు జిల్లాల వ్యాప్తంగా బిల్లింగ్‌ తీసే విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. దీనిద్వారా నెలవారీ రెవెన్యూను పెంచుకునే దిశగా డిస్కం కదులుతోంది.

మరిన్ని ఆకర్షణలు..
బిల్లుల చెల్లింపుల్లో ఎక్కడా క్యూలనేవే లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా, మొబైల్‌ యాప్‌ ద్వారా బిల్లులు చెల్లించే సంస్కృతిని ప్రజలు బాగా అలవాటుపడ్డారు. దీనికి తోడు బిల్లు కట్టగానే మొబైల్‌కు ఎస్సెమ్మెస్‌ రావడం జరుగుతోంది. ఈ ఏడాదినుంచే అన్ని వీధుల్లో వాలెట్‌ కేంద్రాల్ని తెరవడం ద్వారా ఎవరికివారు వారి వీధుల్లోనే బిల్లులు చెల్లించుకునే విధానాన్నీ తీసుకురాబోతున్నారు. ఇలాంటివన్నీ ఒక ప్రత్యేక నివేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రమంత్రికి పంపనున్నారు.