News

Realestate News

దృశ్య.. గాన.. మనోహర గిరి

సింహాచలంలో సౌండ్‌ అండ్‌ లైట్‌ షోకు అడుగులు
వచ్చే ఏడాది నుంచే అమల్లోకి
చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా చిత్రీకరణ

లక్ష్మీ నృసింహస్వామి గిరి… సింహగిరిని అటు ఆధ్యాత్మికంగానే కాదు… పర్యాటకంగానూ జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దృశ్య, గాన, శబ్ద, కాంతి కిరణాల సమాహారంతో ప్రదర్శన వేదికను ఏర్పాటు చేయబోతోంది.లక్ష్మీనృసింహస్వామి చరిత్ర, యుగయుగాలుగా వస్తున్న సంప్రదాయాలు, ప్రజలకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను ఏర్చి కూర్చి ఒక వినూత్న పద్ధతిలో ప్రదర్శనకు ఉంచాలన్నది దేవాదాయ శాఖ నిర్ణయం. ఇందుకోసం సుమారు రూ. 5 కోట్ల వరకు ప్రభుత్వం కేటాయిస్తోంది. రాష్ట్రంలో సింహాచలంతోపాటు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి, విజయవాడ శ్రీ దుర్గ మల్లేశ్వరస్వామి, ద్వారక తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి, శ్రీకాళహస్తీశ్వర దేవాలయం, అన్నవరం శ్రీ వీరవెంకటసత్యనారాయణస్వామి దేవాలయాల్లో సౌండ్‌ అండ్‌ లైట్‌షో ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేక బృందంతో పరిశోధన..
ఈ ప్రదర్శన వేదిక ఎలా ఉండాలన్నదానిపై దేవాదాయశాఖ కమిషనర్‌ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో సింహాచల వైభవం ఉట్టిపడేలా చేయాలన్నది వారి ఆలోచన. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాన్ని దేవాదాయశాఖ ఏర్పాటు చేస్తోంది. సింహాచల ఆలయానికి సంబంధించినవారినీ భాగస్వాముల్ని చేస్తోంది. వీరంతా ఆలయచరిత్ర, సంప్రదాయాలు, భక్తుల ఒరవడి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సమస్త సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. నటీనటులతో కొన్ని సన్నివేశాల్నీ చిత్రీకరించాల్సి ఉంటుంది. దేవాలయ చరిత్రకు సంబంధించిన సన్నివేశాల్నీ చిత్రీకరిస్తారు. ఈ కార్యానికి దేశంలో నిష్ణాతులైన ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను ఎంపికచేసే పనిలో దేవాదాయశాఖ అధికారులున్నారు. సంగీతాన్ని ఎవరితో ఇప్పించాలి, గానం ఎవరితో చేయించాలన్నదానిపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవహారాలన్నీ చూసుకునేందుకు ఒక ఏజెన్సీని నియమిస్తున్నారు. ఈ షోను అచ్చ తెలుగుతోపాటు ఆంగ్ల భాషలో కూడా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏజెన్సీ ఎంపిక డిసెంబరులో పూర్తయ్యే అవకాశం ఉంది. వేదిక ఏర్పాటు ప్రాంగణమంతా కళాత్మకంగా ఉండాలని, అందరినీ ఆకట్టుకునేలా చేయాలన్నది అధికారుల ఆలోచన.

ఆలయ ప్రాంగణంలోనేనా..!
స్థల పరిశీలన ప్రక్రియ జనవరిలోనే మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో చారిత్రక ఆనవాళ్లుగా నిలిచిన ఆలయాన్ని కూడా సహజంగా చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఆలయ ప్రాంగణంలోనే దీన్ని ఏర్పాటు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. వేదికకు అత్యంత సమీపంలోనే పార్కింగ్‌ స్థలం, మరుగుదొడ్లు కచ్చితంగా ఉండేలా చూడాలని అధికారులు చెబుతున్నారు. ఈ ఏర్పాట్ల గురించి దేవాదాయశాఖ ఎస్‌ఈ సుబ్బారావుతో మాట్లాడినప్పుడు.. డిసెంబరులోగా ఏజెన్సీ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. దాని ఆధ్వర్యంలో షో ఎలా ఉండాలనే పరిశోధన జరుగుతుందని, ప్రభుత్వం ఆమోదించాక భక్తుల ముందుకొస్తామని వివరించారు. మరోపక్క సింహాచలం భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతూ ఉంది. వేడుకలు కూడా పెరుగుతున్నాయి. ఈ స్థాయికి తగ్గట్లే షో ప్రత్యేకంగా ఉండాలని అధికారులు ఆశిస్తున్నారు.