దూర విద్యావిధానమే భవిష్యత్తు ఆశాకిరణం
దూర విద్యావిధానమే భవిష్యత్తు ఆశాకిరణం
ఇగ్నో వ్యవస్థాపక దినోత్సవంలో ఆచార్య సింహాద్రి
రాబోయే కాలంలో సాధారణ విశ్వవిద్యాలయాల్లో కంటే దూర విద్యావిధానం ద్వారానే ఎక్కువ మంది నాణ్యమైన విద్యను అభ్యసిస్తారని ఏయూ,
నాగార్జున, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల విశ్రాంత ఉపకులపతి ఆచార్య వై.సి. సింహాద్రి అన్నారు.
ఇగ్నో ప్రాంతీయ కేంద్రంలో వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఇగ్నోతో పాటు ఇతర దూర విద్యా సంస్థలే ఇక ముందు ఉన్నత విద్యను అందించటంలో ముఖ్యభూమిక పోషిస్తాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్య స్థితిగతులు, భారతదేశంలో వివిధ విశ్వవిద్యాలయాల పరిస్థితులను ఆయన వివరించారు.
ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎస్.రాజారావు ఇగ్నో ద్వారా అందిస్తున్న కోర్సులు, ఇతరత్రా సమాచారాన్ని తెలియజేశారు.
ముందుగా మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఇగ్నో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు ధ్రువపత్రాలు, బహుమతులు అందజేశారు.
ఇగ్నోలో బీకాం చదువుకుని, సీఏ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో 13వ ర్యాంకు సాధించిన వెంకట ప్రణీత్‌ను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో ఇగ్నో సహాయ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ధర్మారావు,
సహాయ రిజిస్ట్రార్ ఎ.ఎల్.పి.రావు, ఇగ్నో సహాయ సమన్వయకర్తలు సురేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.