దసరా నుంచి హెలీ పర్యాటకం

అక్టోబరులో అరకు ఉత్సవాలు
మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం, ఈనాడు: దసరా నుంచి నగరంలో హెలీ పర్యాటకం అందుబాటులోకి వస్తున్నట్లు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. హెలీ పర్యాటకంపై స్కై చాపర్స్, లాజిస్టిక్స్ ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్, వుడా కార్యదర్శి శ్రీనివాస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వుడాలో దాదాపు 2 ఎకరాల స్థలంలో హెలీప్యాడ్, ఇతర గదుల నిర్మాణాన్ని వుడా చేపడుతుంది. ఇందుకోసం నెలకు రూ. 50 వేల చొప్పున అద్దె చెల్లించేందుకు స్కై చాపర్స్ నిర్వాహకులు ముందుకొచ్చారు. మంత్రి గంటా మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి మహా నగరానికి తరలివస్తున్న పర్యాటకుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. వీటిలో హెలీ పర్యాటకం ఒకటని వివరించారు. హెలికాప్టర్ ప్రయాణికుల నుంచి ఛార్జీలు ఎంత వసూలు చేయాలో త్వరలో అధికారులు ప్రకటిస్తారన్నారు. అక్టోబరు 7 నుంచి 9 వరకు అరకు ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు కేటాయించిందని చెప్పారు. పర్యాటకంగా తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, మన్యంలోనూ పర్యాటక ప్రాంతాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మరో రూ. 100 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని వివరించారు. విశాఖ – అరకు మధ్య అద్దాల రైలు త్వరలో పట్టాలెక్కనుందన్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెంట్రల్ పార్కును ప్రారంభిస్తారని, ఇది దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైనదిగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇందులో మ్యూజిక్ ఫౌంటెన్ ప్రత్యేకంగా నిలుస్తుందని వివరించారు. సమావేశంలో అనకాపల్లి లోక్సభ సభ్యుడు ఎం.శ్రీనివాసరావు, వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్ వి.బాబూరావునాయుడు, అదనపు ఉపాధ్యక్షుడు రమేశ్, కార్యదర్శి శ్రీనివాస్, పర్యాటక శాఖ కార్యనిర్వాహక సంచాలకుడు ఆర్.శ్రీరాములనాయుడు తదితరులు పాల్గొన్నారు.
విశేషాలు
హెలిపాడ్, ఇతర వసతుల కోసం వుడా పార్కులో దాదాపు 2 ఎకరాల కేటాయింపు
స్కైచాపర్స్ వుడాకు నెలకు చెల్లించే అద్దె రూ. 50 వేలు
వుడా పార్కు నుంచి బయలుదేరే హెలికాప్టర్ కైలాసగిరి, ఎర్రమట్టి దిబ్బలు, భీమునిపట్నం వరకు వెళ్లి.. అదే మార్గంలో వెనక్కి వస్తుంది.
ఇక్కడి నుంచి అరకు, లంబసింగికీ నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు.