News

Realestate News

దశ తిరిగిందే!

దశ తిరిగిందే!
ఆయకట్టు చివరి వరకు సాగునీరు
‘ఐస్‌బిగ్‌’తో జలాశయాల ఆధునికీకరణ
రైవాడ, కోనాంలపై అధ్యయనం
విశాఖపట్నం, న్యూస్‌టుడే, దేవరాపల్లి
జిల్లాలో చిన్న, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని శివారు ఆయకట్టుకు సాగునీరందడం ఏటా ప్రశ్నార్ధకంగానే ఉంటోంది. ప్రధాన కాలువలతో పాటు పిల్ల కాలువలు నిర్వహణకు నోచుకోకపోవడమే దీనికి కారణం. ఏటా పంటల కాలంలో రైతులు గగ్గోలు పెట్టడం, అధికారులు అరకొర పనులతో సరిపెట్టడం పరిపాటిగా మారుతోంది. ప్రధాన ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడం, చేసిన పనులు ముఖ్య కాలువలకే పరిమితం కావడంతో పూర్తిస్థాయిలో ఆయకట్టు భూములకు నీరందించలేకపోతున్నారు. ఇటీవల ప్రభుత్వం నిధుల సమస్యతో నీరుగారుతున్న ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి సారించింది. జల వనరుల అభివృద్ధితోపాటు అదనపు ఆయకట్టుకు నీరందించేలా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐస్‌బిగ్‌ (ఇన్సెంటివ్‌ ఫర్‌ బ్రిడ్జ్‌ ఇరిగేషన్‌ గేప్‌) పథకంలో సాయాన్ని కోరింది. జిల్లాలో రైవాడ, కోనాం ప్రాజెక్టులను ఈ పథకంలో అభివృద్ధి చేయడానికి కేంద్రం సంసిద్ధత తెలపడంతో ఈ జలాశయాల పరిధిలో అన్నదాతలకు మంచిరోజులు రానున్నాయి.ఇదీ రైవాడ ప్రాజెక్టు స్వరూపం
* పేరు: వారాడ నారాయణమూర్తి రైవాడ జలాశయం
* ఎక్కడ: దేవరాపల్లి మండలం రైవాడ వద్ద శారదా నదిపై
* నీటినిల్వ సామర్థ్యం: 3,270 ఎంసీఎఫ్‌టీ
* ఆయకట్టు విస్తీర్ణం: 15,344 ఎకరాలు
* లబ్ధిపొందే ప్రాంతాలు: దేవరాపల్లి, చోడవరం, కె.కోటపాడు
* ఆధునికీకరణకు వెచ్చించిన నిధులు: రూ. 5.5 కోట్లు
* ప్రస్తుత స్థితి: అసంపూర్తి పనులతో శివారు ఆయకట్టుకు నీరందని పరిస్థితికోనాం ప్రాజెక్టు స్వరూపం..
* పేరు: వేచలం పాలవెల్లి కోనాం జలాశయం
* ఎక్కడ: చీడికాడ మండలం కోనాం వద్ద బొడ్డేరు నదిపై
* నీటినిల్వ సామర్థ్యం: 808 ఎంసీఎఫ్‌టీ
* ఆయకట్టు విస్తీర్ణం: 12,638 ఎకరాలు
* లబ్ధి పొందే ప్రాంతాలు: చీడికాడ, దేవరాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం
* ఆధునికీకరణకు వెచ్చించిన నిధులు: రూ. 7.18 కోట్లు
* ప్రస్తుత స్థితి: 83 శాతం పనులు జరిగాయి. శివారు ఆయకట్టుకు నీరు అనుమానమే.

రైవాడ రైతుకు మంచి రోజులు
రైవాడ జలాశయం పరిధిలో 15443 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నా ఏటా 13 వేల నుంచి 14 వేల ఎకరాల వరకే నీటి అందించగలగుతున్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో శివారు భూములకు సాగునీరు అందడంలేదు. 2006లో రూ. 19 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టినా రూ. 5.5 కోట్ల విలువైన పనులే జరిగాయి. ఆ పనులు అధ్వానంగా చేయడంతో గుత్తేదారుని తొలగించారు. ఆ తరువాత నిధుల సమస్య వచ్చిపడింది. జపాన్‌ బ్యాంకు (జైకా) నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించి ప్రతిపాదనలు పంపించినా వాటికి ఇప్పటి వరకు ఆమోదం రాలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐస్‌బిగ్‌ పథకంలో ఈ ప్రాజెక్టును చేర్చడంతో రైవాడ రైతుకు మంచి రోజులు వచ్చినట్లయింది. ఈ ఖరీఫ్‌నకు కాకపోయినా వచ్చే ఏడాదికైనా ఈ పథకంలో పూర్తిస్థాయిలో సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

కోనాం కొత్తకళ
ఐస్‌బిగ్‌లో రెండో ప్రాధాన్య ప్రాజెక్టుగా కోనాంను ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో రూ. 8.72 కోట్ల ఆధునికీకరణ పనులు చేపట్టినా అందులో రూ. 7.18 కోట్ల విలువైన 83 శాతం పనులే చేశారు. చీడికాడ మండలంలోని కోనాం ఎడమ కాలువ పరిధిలో ఉన్న అర్జునగిరి, చెట్టుపల్లి, చుక్కపల్లి గ్రామాలకు చుక్క నీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చోడవరం మండలంలోనూ శివారు గ్రామాలకు నీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. ఐస్‌బిగ్‌ పథకంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తే ఈ సమస్య తీరిపోనుంది.

సూక్ష్మస్థాయి ప్రణాళికలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐస్‌బిగ్‌ పథకంలో సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో చివరి ఆయకట్టుకు నీరందించడంతో పాటు అదనపు ఆయకట్టును సృష్టించేలా సూక్ష్మ ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రధాన కాలువలు మొదలుకొని పిల్లకాలువలను ఏ రీతిలో అభివృద్ధి చేయాలో అధికారులు, రైతులతో చర్చించి సమగ్ర నివేదికలు తయారుచేస్తారు. జిల్లాలో రైవాడ, కోనాం జలాశయాల అభివృద్ధికి సంబంధించి సవివర పథక నివేదిక (డీపీఆర్‌) తయారుచేసే బాధ్యతను కాంటాక్‌ అనే గుత్తేదారు సంస్థకు అప్పజెప్పారు. ఇప్పటికే ఈ సంస్థ సభ్యులు రైవాడ పరిధిలో సర్వే చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోని 18 నీటి సంఘాలున్నాయి. వీటిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తారు. నీటి వినియోగం, పొదుపు చర్యలపై అవగాహన కల్పిస్తారు. సాగునీటి కాలువల నిర్వహణ తీరును రైతులకు తెలియజేస్తారు. అవసరమైన మేర సౌర విద్యుత్తు వైపు రైతులను మళ్లించేలా సూచిస్తారు. బిందు, తుంపర సేద్యం ప్రాధాన్యం తెలిపి వాటిని పాటించేలా రైతులను ప్రోత్సహిస్తారు. అదనపు ఆయకట్టుకు నీరందించడానికి గల అవకాశాలను అధికారులకు వివరిస్తారు. వీటన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి సూక్ష్మస్థాయి ప్రణాళికలను తయారు చేస్తారు. ఇందుకోసం ఎంత మొత్తం నిధులు అవసరం అవుతాయో డీపీఆర్‌ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తారు. వీటి ఆధారంగానే కేంద్రం తదుపరి నిధులు అందించనుంది.

పూర్తిస్థాయిలో నీరందడానికి అవకాశం
ప్రాజెక్టుల పరిధిలో శివారు ఆయకట్టుకు నీరందించడమే ఐస్‌బిగ్‌ పథకం లక్ష్యం. ఆ పథకంలో రైవాడ కోనాం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. కేంద్ర ప్రభుతం వీటి అభివృద్ధికి సంబంధించి డీపీఆర్‌లను తయారు చేయాలని కాంటాక్‌ అనే సంస్థకు అప్పజెప్పారు. వారు ఓసారి వచ్చి పరిశీలించి వెళ్లారు. మరలా ప్రాజెక్టు పరిధిలో పూర్తిస్థాయిలో సర్వేచేసి ప్రతి సెంటు భూమికి నీరందించేలా ప్రణాళికలను రూపొందిస్తారు. ఎక్కువగా నీటి పొదుపు చర్యలవైపు రైతులను మళ్లించేలా ప్రోత్సహిస్తాం.

– నాగేశ్వరరావు, ఎస్‌ఈ, జలవనరుల శాఖ