News

Realestate News

దశ తిప్పనున్న సువర్ణావకాశం

దశ తిప్పనున్న సువర్ణావకాశం
గ్రామీణ పేద విద్యార్థులకు దక్కిన వరం
ట్రిపుల్‌ ఐటీలకు ఎంపిక
ఉచిత విద్య.. ఉన్నత ప్రమాణాలు
సీట్లు దక్కించుకోవటంలో రాష్ట్రంలో జిల్లాకు రెండో స్థానం
ఎచ్చెర్ల, న్యూస్‌టుడే

నిరుపేద కూలీ కుటుంబం నుంచి: పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన వమర హర్షవర్ధన్‌ అనే విద్యార్థిది నిరుపేద కుటుంబం. తండ్రి చిన్నతనంలోనే మృతి చెందారు. తల్లి నిత్యం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో సంతవురిటి వసతిగృహంలో ఉంటూ స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి పది వరకూ చదువుకున్నాడు. ఈ ఏడాది పది ఫలితాల్లో 9.7 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించాడు. వెనుకబడిన సూచీ పాయింట్లు 0.4 జతవటంతో 10.1 పాయింట్లతో శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీకి ఎంపికయ్యాడు. ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని తల్లి పడిన కష్టాలన్నీ తీరుస్తానని…జీవితంలో ఉన్నతంగా స్ధిరపడటమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.

అంపోలు ప్రసన్న చదువులో చూపిన ప్రతిభకు చక్కటి ఫలి

తం దక్కింది. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన ఈమెది అతి నిరుపేద కుటుంబం. ఆర్ధిక పరిస్థితి బాగోక ఆరో తరగతి నుంచి పది వరకూ కుప్పిలి ఆదర్శ పాఠశాలలో చదివింది. ఈమె సోదరి కూడా అదే పాఠశాలలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. తండ్రి సూర్యనారాయణ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. తల్లి హేమలత కూలి పని చేస్తే కాని కుటుంబం ముందుకు సాగని పరిస్థితి. ఇన్ని ఇబ్బందులున్నా ప్రసన్న పట్టుదలతో చదివి ఇటీవల పదో తరగతి ఫలితాల్లో 9.7 జీపీఏ పాయింట్లు దక్కించుకుంది. వెనుకబడిన సూచిలో 0.4 పాయింట్లు కలపటంతో 10.1 పాయింట్లతో బీసీ-ఏ విభాగంలో శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో సీటు దక్కించుకొంది. తనకు దక్కిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని జీవితంలో ఉన్నతంగా స్ధిరపడతానని ఈ విద్యార్థిని చెబుతోంది. తన కుటుంబాన్ని మంచి స్థితికి తీసుకురావటమే లక్ష్యమని చెప్పింది.

– ఇలాంటి ఎందరో ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఉన్నతమైన సాంకేతిక విద్యను చదివే అవకాశం ట్రిపుల్‌ ఐటీ అందిస్తోంది. ఇన్నాళ్లు వీరు శ్రద్ధగా చదవటం వల్లే ఈ మంచి అవకాశం దక్కింది.

పదో తరగతి మార్కుల ప్రాతిపదికన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం ‘రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం’ అనుబంధంగా నాలుగు ట్రిపుల్‌ ఐటీలను రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికి వెనుకబాటు సూచీ కింద 0.4 పాయింట్లు కలిపి సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంది. ఇక్కడ దాదాపు పూర్తి ఉచితంగా విద్యనందిస్తారు. అయితే కోర్సు పూర్తయ్యే సరికి ప్రతి విద్యార్థి రూ. 40 వేల నుంచి రూ.60 వేల వరకూ చెల్లించాల్సి వస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్లే నిరుపేద విద్యార్థులు కాస్త ఇబ్బందికర అంశమే. ఎవరైనా దాతలు ఆదుకుంటే వారి ఉన్నతికి చేయూత ఇచ్చినట్లే.

ఇదీ జిల్లా సత్తా
గతంతో పోలిస్తే ఈ ఏడాది అన్ని జిల్లాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవల పదో తరగతి ఫలితాలలో రాష్ట్రంలో రెండో స్థానం సాధించిన జిల్లా…ట్రిపుట్‌ ఐటీ సీట్ల కేటాయింపులోనూ మరో ఘనత దక్కించుకుంది. రాష్ట్రంలో రెండోస్థానం పొందింది. నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో మొత్తం నాలుగు వేలు సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో తూర్పు గోదావరి సింహభాగంగా 726 సీట్లు పొందింది. శ్రీకాకుళం జిల్లా 360 సీట్లు దక్కించుకుంది. వీరిలో బాలికలు 195 మంది, బాలురు 165 మంది.

కేటాయింపులో కటాఫ్‌ మార్కులు
విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న ప్రాధాన్యత క్రమంలో… వారు సాధించిన మార్కుల ఆధారంగా ఏ ప్రాంతానికి స్థానికత వర్తిసుందో ఆ మేరకు సీట్ల కేటాయింపు జరిగిందని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు వెనుబడిన సూచి పాయింట్లు కలిపి వివిధ కేటగిరిలకు కటాప్‌ మార్కుల వివరాలు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరం
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగి ఆర్ధిక స్థోమత లేక నాణ్యమైన సాంకేతిక విద్య అందుకోలేని వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. విద్యార్థికి దుస్తులు పుస్తకాలు, ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు, వసతి, భోజనంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన భోజన నిధులు సరిపోని నేపథ్యంలో… ఇతరత్రా కొన్ని వ్యయాలు కలిపి కోర్సు పూర్తయిన తరువాత విదార్థులు రూ. 40 వేల నుంచి రూ. 60వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఆరేళ్ల సమీకృత బీటెక్‌ విద్యలో భాగంగా తొలి రెండేళ్లు ఇంటర్మీడియట్‌ విద్య (పీయూసీ), మిగిలిన నాలుగేళ్లు ఇంజినీరింగ్‌ కోర్సుల తరగతులు నిర్వహిస్తారు. పీయూసీ పూర్తయిన తరువాత వారి ఉత్తీర్ణత శాతం ఆధారంగా నాలుగేళ్ల బీటెక్‌ విద్యలో ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్‌, కెమికల్‌, సివిల్‌, ఎంఎంఈ వంటి బ్రాంచ్‌ల్లో విద్యార్థులకు కేటాయిస్తారు. విద్యార్థి భాగస్వామ్యంతో ప్రయోగ పూర్వకంగా బోధన సాగుతుంది.

పూర్తిగా ఉచితంగా అందిస్తే వూరట
ఎచ్చెర్ల మండలం నుంచి 12 మంది ఎంపిక కాగ వీరిలో ఒక్క అల్లినగరం జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు. ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు పొందుతున్న విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నా… పలువురి ఆర్ధిక స్థోమత చాలా కష్టంగా ఉంటోంది. చివరలో చెల్లించాల్సిన ఫీజులో కూడా ఇటువంటి వారికి రాయితీ ఇస్తే ఎంతో వూరట లభిస్తుందని పలువురు విన్నవిస్తున్నారు.

రణస్థలం మండలం కొండములగా గ్రామానికి చెందిన దన్నాన జోత్స్నది నిరుపేద కటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు.జోత్స్న ఆరవ తరగతి నుంచి పది వరకూ రణస్థలం ఆదర్శ పాఠశాలలో చదివింది. 9.7 జీపీఏ పాయింట్లుతో ఉత్తీర్ణత సాధించింది. వెనుకబడిన సూచిపాయింట్లతో 10.1 పాయింట్లు దక్కించుకొని శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీకి ఎంపికయింది. మంచి ఇంజినీర్‌ కావటమే తన లక్ష్యమని చెబుతోంది.