News

Realestate News

దద్దరిల్లిన ధర్మపోరాటం

దద్దరిల్లిన ధర్మపోరాటం
సంఘీభావ దీక్షలకు సకల జనుల మద్దతు
ర్యాలీలు.. నినాదాలతో హోరెత్తిన శిబిరాలు
ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని నిర్ణయం
పదవులంటే మంచి దుస్తులు, ఖరీదైన వాచీ, కళ్లజోడు పెట్టుకోవడం కాదు.. ప్రధాని మోదీ పరిపాలన అంటే ఏంటో తెలుసుకుని పదిమందికి మేలు చేయాలి. నేను ఇటీవల రైల్లో ప్రయాణిస్తూ ఓ మహిళతో మాట్లాడినప్పుడు చీరలు, జాకెట్‌లు, లంగాలపైనా జి.ఎస్‌.టి. వేశారని, దీంతో దుస్తుల ధరలు కూడా పెరిగిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. దీన్నిబట్టి తన పరిపాలన ఎలా ఉందో మోదీ తెలుసుకోవాలి. ఆంధ్రాకు న్యాయం చేయాలని తెలుగువారంతా పోరాడితే ప్రధాని దిగిరాక తప్పదు.

– నర్సీపట్నం ధర్మపోరాట దీక్షలో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు సకల జనుల మద్దతు లభించింది. పుట్టిన రోజు నాడే పోరాట దీక్షబూనిన ఆయనకు సంఘీభావంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిరాహార దీక్షలను నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా శిబిరాల వద్ద నేతలు, కార్యకర్తల సందడి కనపడింది. ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అంటూ సైకిళ్లు.. మోటార్‌ సైకిళ్లతో ర్యాలీలు నిర్వహించారు. దీక్షా స్థలానికి చేరుకుని నినాదాలతో ధర్మపోరాటం దద్దరిల్లేలా చేశారు. వివిధ మతాల గురువులు, ఉద్యోగ, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు, న్యాయవాదులు, వైద్యులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన వారు సంఘీభావ దీక్షలకు మద్దతు తెలిపారు. కేంద్రం దిగివచ్చి.. ప్రత్యేక హోదా ప్రకటించే ఉద్యమ పోరుబాటను ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు కోరారు.రాజకీయాలకు అతీతంగా..
తెలుగు ప్రజల అభీష్టానికి అనుగుణంగా అన్ని పార్టీలు, సంఘాలు రాజకీయాలకు అతీతంగా హోదా ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. నర్సీపట్నంలో జరిగిన సంఘీభావ దీక్షలో ఆయన మాట్లాడుతూ ఎవరి స్వార్థం వారు చూసుకోకుండా ఎన్నికల వరకైనా కలిసికట్టుగా ఉద్యమాన్ని కొనసాగిద్దామని పిలుపిచ్చారు. ప్రజా పోరాటానికి ఎంతటి..నాయకుడైనా దిగిరాక తప్పదని హెచ్చరించారు. అనకాపల్లిలో జరిగిన దీక్షా శిబిరానికి హాజరైన మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దీక్షలతో దిల్లీలో ప్రకంపనలు వస్తున్నాయన్నారు. అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడం సంతోషంగా ఉందన్నారు.

జిల్లాలో మిగతా చోట్ల..
* నర్సీపట్నంలో విద్యార్థులు ప్రధాని మోదీ.. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుని వేషధారణలతో మోదీ బాగున్నావయ్యా అనే నాటికను ప్రదర్శించి అందరి మెప్పు పొందారు. నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల నుంచి వేలాది మంది ఈ దీక్షా శిబిరానికి తరలివచ్చారు. అన్ని వర్గాల వారు తమ మద్దతు తెలుపుతూ మాట్లాడారు.
* అనకాపల్లి నెహ్రుచౌక్‌ కూడలిలో నిర్వహించిన దీక్షకు పెద్దఎత్తున జనాలు తరలివచ్చారు. వివిధ సంఘాల నాయకులు, రైతులు, మహిళలు, విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యన్నారాయణ మాట్లాడి స్థానికులను చైతన్యపరిచారు.
* అరకులోయలో ప్రభుత్వ విఫ్‌ కిడారి సర్వేశ్వరరావు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలను అలంకరించి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసిల్దారు కార్యాలయానికి సమీపంలో దీక్షలో పాల్గొన్నారు.
* చోడవరం నియోజకవర్గంలో వెంకన్నపాలెం నుంచి అయిదు కిలోమీటర్ల మేర మోటార్‌ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించి అనంతరం సంఘీభావ దీక్షలను చేపట్టారు. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, డీసీసీబీ ఛైర్మన్‌ సుకుమారవర్మ ఇతర నాయకులు మాట్లాడుతూ దీక్ష ఉద్దేశాన్ని అందరికీ వివరించారు.
* పాయకరావుపేటలో నాలుగు మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, ఇతర సంఘాల నేతలతో ముందుగా ర్యాలీ నిర్వహించారు. రహదారి పక్కనున్న పంచాయతీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆధ్వర్యంలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.  బీ పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధ్యక్షతన అంబేడ్కర్‌ కూడలిలో దీక్ష జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు దీక్షల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడినా దీక్షను సాయంత్రం వరకు కొనసాగించి ఉద్యమ స్ఫూర్తిని చాటారు.
* చీడికాడలో మాడుగుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. పలువురు నేతలు గైర్హాజరైనా కార్యకర్తలు, ఇతరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఉప్పెనలా తరలివచ్చిన జనం
ఎలమంచిలి, న్యూస్‌టుడే: పట్టణంలో తెదేపా ధర్మపోరాట దీక్ష విజయవంతం అయ్యింది. ఐదువేల మందితో దీక్ష నిర్వహించారు. జిల్లా తెదేపా అధ్యక్షులు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ లాలం భవానీ, తెదేపా పట్టణ అధ్యక్షుడు ఆడారి ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం ఏడు గంటలకు ఎన్టీఆర్‌ విగ్రహానికి పంచకర్ల రమేష్‌బాబు పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. నాలుగు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో సభాప్రాగణం కిక్కిరిసింది. పాతజాతీయ రహదారికి రెండువైపులా షామియానాలు వేసి రోడ్డు పొడవునా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి లాలం భాస్కరరావు, నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo