త్వరలోనే విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్

ఉత్తరాంధ్రుల చిరకాల వాంఛ అయిన విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ తొందరలోనే రానుందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
6, 8వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌లపై ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లతో పాటు 8వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటుచేసిన వీఐపీ లాంజ్‌ను ఎంపీ హరిబాబు, మంత్రి గంటా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోన్ ప్రకటన కోసం పలువురు కేంద్ర మంత్రులతో ఇప్పటికే మాట్లాడామన్నారు. మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లు నడపడానికి రైల్వే చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అరకుకు అద్దాల రైలు కోసం రైల్వే ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపామన్నారు. డీఆర్ఎం చంద్రలేఖమఖర్జీ స్టేషన్లో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సీనియర్ డీసీఎం యల్వేందర్ యాదవ్, భద్రతా విభాగం సీనియర్ కమిషనర్ ఇబ్రహీం షరీఫ్, స్టేషన్ మేనేజర్లు డి.పండా, సాయిబాబా, రామకృష్ణలతో పాటు తమ్మినేని నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు