News

Realestate News

త్వరలోనే బైపాస్‌ రహదారి నిర్మాణం : ఎమ్మెల్యే గణబాబు

త్వరలోనే బైపాస్‌ రహదారి నిర్మాణం : ఎమ్మెల్యే గణబాబు
అవగాహన చర్చకు హాజరైన మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్‌
ఎన్‌ఏడీకూడలి, న్యూస్‌టుడే
ఎన్‌ఏడీకూడలి- గోపాలపట్నం పెట్రోల్‌బంకు వరకు నిర్మించ తలపెట్టిన బైపాస్‌ రహదారికి అడ్డంకిగా ఉన్న ఎన్‌ఎస్‌టీఎల్‌ ప్రహరీ తొలగింపు అంశంపై నెల రోజుల నుంచి తెదేపా, వైకాపా నాయకులు మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి గురువారం ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్‌ తెర దించారు.

నెల రోజుల కిందట బుచ్చిరాజుపాలెం గ్రామస్తులు బైపాస్‌ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని వారం రోజుల పాటు నిరసన తెలియజేశారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్‌ శిబిరం వద్దకు చేరి గ్రామస్తులకు మద్దతు తెలిపి.. అధికార పక్షంపై పలు విమర్శలు చేశారు. దీంతో కిందిస్థాయి నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. గురువారం ఎన్‌ఏడీ కొత్తరోడ్డు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అనుసంధాన రహదారిపై అవగాహన చర్చ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్‌ హాజరయ్యారు. తన హాయాంలోనే అప్పటి విశాఖ ఎంపీ పురంధరేశ్వరి డిఫెన్స్‌ అధికారులతో మాట్లాడారని, ఐఎన్‌ఎస్‌ కళింగ వద్ద రెవెన్యూ స్థలాన్ని ఎన్‌ఎస్‌టీఎల్‌కు ఇవ్వడానికి చర్చలు జరిగాయని విజయప్రసాద్‌ తెలిపారు. ఆ తర్వాత సమైఖ్యాంద్ర ఉద్యమం, ఎంపీటీసీÏ, జెడ్పీటీసీ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయిందన్నారు. గ్రామస్తుల నిరసన కార్యక్రమానికి వారు పిలిస్తేనే వెళ్లానని, అప్పుడు కూడా అధికారుల పనితీరుపైనే మాట్లాడానని, రాజకీయ నాయకుల ప్రస్తావన తేలేదని వివరణ ఇచ్చారు.

అనంతరం ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ప్రతిపక్షాలు, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షం ఉంటుందన్నారు. ఈ రహదారి ప్రభుత్వం తరఫున చేస్తున్న కృషిని వివరించడానికే అవగాహన పేరిట చర్చ అని కార్యక్రమం ఏర్పాటు చేశామే గాని, ప్రతిపక్ష నాయకుడిని అవహేళన చేయడానికి కాదన్నారు. 2013లో అప్పటి రక్షణ మంత్రి ఏకే.ఆంటోని నుంచి ఎంపీకి వచ్చిన లేఖలో ఇక్కడి స్థలానికి సమాన విలువ చేసే స్థలం ఉండాలని, నగర పరిధిలోనే ఉండాలని, డిఫెన్స్‌ అధికారులు అంగీకరించేలా ఉండాలనే నిబంధనలు ఉన్నాయన్నారు. ఐఎన్‌ఎస్‌ కళింగ దగ్గర, ముడసర్లోవ దగ్గర స్థలాలు గుర్తించి 2014లోనే జీవీఎంసీ కమిషనర్‌ డిఫెన్స్‌ అధికారులకు లేఖ రాశారన్నారు. దానికి బదులుగా ఎన్‌ఎస్‌టీఎల్‌ అధికారులు ఐఎన్‌ఎస్‌ కళింగ వద్ద స్థలం తమకు సరిపడదని, మరో స్థలం చూపించాలని జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ రాశారన్నారు. ఇదంతా గత ప్రభుత్వం హయాంలో జరిగిందని, తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్‌ఎస్‌టీఎల్‌కు ఆనుకుని ఉన్న దేవస్థానం స్థలాన్ని ఎన్‌ఎస్‌టీఎల్‌కు ఇవ్వడానికి, దేవస్థానానికి మరో చోట జీవీఎంసీ స్థలం ఇవ్వడానికి ప్రతిపాదించామన్నారు. అదే సమయంలో దేవస్థానం, ఎన్‌ఎస్‌టీఎల్‌కు మధ్య భూ సమస్య ఉండటంతో దానిపై సర్వే చేయించామన్నారు. ఏది ఏమైనా… స్థలం కేటాయించి, పనులు ప్రారంభిస్తామన్నారు. ఎన్‌ఏడీ కూడలిలోనూ పైవంతెన నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. అయితే ఎప్పటిలోగా బైపాస్‌ రహదారి పనులు ప్రారంభిస్తారని విజయప్రసాద్‌ అడగ్గా… ఎప్పటిలోగా అనేది చెప్పలేనని, వీలైనంత త్వరలోనే రహదారిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే గణబాబు సమాధానమిచ్చారు.