News

Realestate News

తుని – కొత్తవలస మధ్య రైల్వేలైన్‌

vizag real estate news

తుని – కొత్తవలస మధ్య రైల్వేలైన్‌
17న సర్వే పనులకు శ్రీకారం
అనకాపల్లి, న్యూస్‌టుడే: తుని, కొత్తవలస మధ్య కొత్త రైల్వే లైను రాబోతుందని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక జాతీయ రహదారిలో ఎంపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రైల్వే లైనుకు సంబంధించి మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. తుని నుంచి కొత్తవలస వరకు ప్రత్యామ్నాయ రైల్వేలైను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందునిమిత్తం మొత్తం మూడు రూట్‌లు పరిశీలించామన్నారు. అన్నింటిలో తుని, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, సింగవరం, చోడవరం, వెంకటరాజుపురం, దేవరాపల్లి, ఆనందపురం మీదుగా కొత్తవలస వరకు లైను ఏర్పాటు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక సర్వే పనులు ఈనెల 17 నుంచి ప్రారంభిస్తారని తెలిపారు. సర్వేపనుల నిమిత్తం రూ.పది లక్షలు కేంద్రం మంజూరు చేసిందని, మొత్తం 143 కిలోమీటర్లు పొడవు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఒక్కలైను మాత్రమే వేస్తారని, భవిష్యత్‌లో రెండు లైన్లుగా మార్పు చేస్తారని వివరించారు. దీనివలన పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగల నియోజకవర్గాల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. తుని నుంచి విశాఖ వరకు కోస్తాతీరం అధికంగా ఉండటంతో తరచూ తుపానులు సంభవిస్తున్నాయని, దీనివలన ట్రాక్‌లు తరచూ దెబ్బతిని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. అందుకే తుని, కొత్తవలస లైను ప్రత్యామ్నాయంగా ఉంటుందన్నారు. అనకాపల్లి, ఆనందపురం రహదారిని ఆరులైన్లుగా విస్తరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం టెండర్ల దశలో ఉందని, వచ్చే జనవరిలో శంకుస్థాపన చేస్తామని అన్నారు. రహదారి నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుందని, రెండేళ్లలో పూర్తి చేస్తారని అన్నారు. మల్కన్‌గిరి నుంచి సీలేరు, చింతపల్లి, నర్సీపట్నం, వడ్డాది, చోడవరం, సబ్బవరం మీదుగా విశాఖ పోర్టు వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా మార్పు చేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీనేతలు బుద్ద నాగజగదీశ్వరరావు, గుత్తా ప్రభాకర్‌చౌదరి, తాడి రామకృష్ణ పాల్గొన్నారు.