తీరం.. కృష్ణమయం!

పీఎంపాలెం, సాగర్‌నగర్, న్యూస్‌టుడే: ఇస్కాన్ కేంద్రం(సాగర్‌నగర్)లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. నగరంతో పాటు శివారు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు హరేరామ.. హరేకృష్ణ నామస్మరణతో భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. సాయంత్రం ప్రారంభమైన ఉట్టి కొట్టే సంబరం కనులపండువగా జరిగింది. వేడుకలో పలువురు చిన్నారులు గోపాలుడి వేషధారణలో ఉట్టిని కొట్టేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. పైడా విద్యాసంస్థల అధినేత కృష్ణప్రసాద్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఇస్కాన్ అధ్యక్షుడు సాంబాదాస్, మాతాజి నితాయిసేవిని, కంకటాల సిల్క్స్ ఎండీ కె.మలికార్జునరావు దంపతులు, సింబయోసిస్ సీఈఓ ఒ.నరేష్కుమార్, హోటల్ మేఘాలయ ఎండీ సురేష్‌కుమార్ తదితరుల చేతులమీదుగా వ్యాసరచన, పాట్ పెయింటింగ్, వేషధారణల్లో ప్రతిభను ప్రదర్శించిన బాలబాలికలకు బహుమతులు అందజేశారు. ఇస్కాన్ నిర్వాహకులు భక్తులకు స్వామివారి దర్శనానికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సురభి కళాకారులు ప్రదర్శించిన నాటక దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రాఫిక్ ఏసీపీ ఎం.శ్రీనివాసరావు, సీఐ సీహెచ్.తిరుపతిరావు ఆధ్వర్యంలో పోలీసులు బీచ్‌రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా చర్యలు చేపట్టారు.