News

Realestate News

తలమానికంగా వైశాఖీ కళాతరంగిణి ఆడిటోరియం

Real Estate News Vizag

తలమానికంగా వైశాఖీ కళాతరంగిణి ఆడిటోరియం
అయ్యన్న, గంటాల చేతుల మీదుగా ఘనంగా శంకుస్థాపన
ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: వుడా ఆధ్వర్యంలో ఎంవీపీకాలనీలో నిర్మిస్తున్న వైశాఖీ కళాతరంగిణి ఆడిటోరియం నిర్మాణం దేశంలోనే తలమానికంగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఎంవీపీకాలనీ సెక్టారు-7లో జరిగిన శంకుస్థాపన మహోత్సవంలో రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మెగా కల్చరల్‌ ఈవెంట్‌ü్స నిర్వహించేందుకు వీలుగా ఈ ఆడిటోరియం ఎంతోగానే ఉపయుక్తంగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి తరహాలో ఈ నిర్మాణం ఉంటుందన్నారు. ఇందుకు రూ.32కోట్లను కేటాయించామన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు. రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గత కాంగ్రెస్‌ హయాంలో ఈ స్థలంలో రైతుబజారును తరలించేందుకు ప్రయత్నించి, స్థలాన్ని ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నించారని, అయితే తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నిరసన తెలియజేయటంతో స్థలాన్ని కాపాడుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈఆడిటోరియం నిర్మాణానికి సంబంధించి డిజైన్‌ విషయంలో మరోసారి తప్పులు దొర్లకుండా ఉండేలా జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన అధికారులు చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. వుడా వీసీ బాబూరావు నాయుడు మాట్లాడుతూ 1.49 ఎకరాల స్థలంలో రూ.32.25 కోట్ల వ్యయంతో ఆడిటోరియం, కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నామని, ఒక ఆడిటోరియం, మూడు సమావేశ మందిరాలు ఉంటాయన్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ నగరానికి ఈ ఆడిటోరియం అవసరం ఎంతో ఉందని, అందువల్ల నాణ్యతను పాటిస్తూ 15 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్‌, పంచకర్ల రమేష్‌బాబు, విష్ణుకుమార్‌రాజు, జెడ్పీ చైర్మన్‌ లాలం భవానీ, జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌, వుడా ఏవీసీ రమేష్‌, కార్యదర్శి శ్రీనివాస్‌, ఎస్‌.ఇ.అప్పన్న తదితరులు పాల్గొన్నారు.