News

Realestate News

డిజిటల్‌ గ్రామంగా రాంపురం ఎంపిక

డిజిటల్‌ గ్రామంగా రాంపురం ఎంపిక
పెందుర్తి, న్యూస్‌టుడే: రాంపురం గ్రామాన్ని భారతీయ స్టేట్‌ బ్యాంకు దత్తత తీసుకుని సంపూర్ణ డిజిటల్‌ గ్రామంగా తీర్చిదిద్దనుందని ఎంపీపీ రెడ్డి వరలక్ష్మీ నారాయణరావు తెలిపారు. స్టేట్‌బ్యాంకు దేశంలో వంద గ్రామాలను డిజిటల్‌ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అయిదు గ్రామాలను ఎంపిక చేయగా… విశాఖ జిల్లా నుంచి రాంపురం గ్రామాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి వచ్చిన బ్యాంకు జీఎం ఎం.ఎస్‌.మూర్తి గ్రామంలోని పరిస్థితులపై సర్వే నిర్వహించారన్నారు. ప్రాజెక్టులో భాగంగా గ్రామంలో ప్రతి ఒక్కరు డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించుకునేలా చర్యలు చేపడతారన్నారు. గ్రామస్థులందరికీ రూపే కార్డులు, వ్యాపారులకు పీవోఎస్‌ యంత్రాలు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు జారీ చేస్తారన్నారు. బ్యాంకు సీఎస్‌ఆర్‌ పథకంలో భాగంగా గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో డిజిటల్‌ తరగతి గది, వైఫై ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాంపురం సర్పంచి రెడ్డి నారాయణరావు, ఎంపీడీవో బి.శ్రీనివాసరావు, బ్యాంకు మేనేజర్‌ ఎన్‌.లోకేశ్‌, పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.