News

Realestate News

టీయూ చెంతనే సీ హారియర్స్‌

టీయూ చెంతనే సీ హారియర్స్‌
వుడా వీసీ బసంత్‌కుమార్‌
ఈనాడు, విశాఖపట్నం: భారత నౌకాదళ సేవల నుంచి నిష్క్రమించిన సీ హారియర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ను విశాఖ తీరంలోని టీయూ-142 యుద్ధ విమాన ప్రదర్శనశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని వుడా వీసీ పట్నాల బసంత్‌కుమార్‌ తెలిపారు. సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ముడసర్లోవ పార్కు, ఐటీ టవర్లు, ఎన్‌ఏడీ రోటరీ సపరేట్‌ పైవంతెన, తదితర ప్రాజెక్టు ప్రగతిని వివరించారు. విరాట్‌ కేంద్రంగా పనిచేసిన ఈ యుద్ధ విమానాన్ని ఓ పిల్లర్‌పై ఆధారపడేలా ఏర్పాటు చేస్తామని దీనికి అనుబంధంగా సిమ్యులేటర్‌ గేమ్స్‌, ప్రత్యేక ప్రదర్శనశాల ఏర్పాటు విషయం పరిశీలనలో ఉన్నాయన్నారు. టీయూ, సీ హారియర్స్‌ ఒకే ప్రాంగణంలో ఉండడంతో ఒకే టిక్కెటుపై రెండూ చూసే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం గోవాలో ఉన్న సీ హారియర్‌ను పరిశీలించేందుకు ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్ట్‌ బృందం ఈనెలాఖరులో వెళ్లనున్నట్లు చెప్పారు. రెండు భారీ కంటైనర్ల ద్వారా ఈ యుద్ధవిమాన విడి భాగాలను విశాఖ రప్పిస్తామని మొత్తం మీద ఏప్రిల్‌ మాసాంతానికి ప్రదర్శనశాల పూర్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. దాకమర్రి లేఅవుట్‌ వేలం తేదీ త్వరలో ఖరారు కానున్నట్లు చెప్పారు. మూడు తేదీల్లో ఏదో ఒకటి ఖరారుచేసి ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఎన్‌ఏడీ రోటరీ సపరేట్‌ పైవంతెన నిర్మాణం ప్రణాళిక ఖరారు చేసే క్రమంలో నిట్‌ నిపుణులు త్వరలో విశాఖ రానున్నట్లు చెప్పారు. మధురవాడలో ఐటీ టవర్ల ప్రాథమిక నమూనాలు సిద్ధమయ్యాయని వివరించారు. దాకమర్రి లేఅవుట్‌ త్రీడీ దృశ్య చిత్రాన్ని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. లే అవుట్‌ ఆన్‌లైన్‌ అనుమతులు, వుడా ఆధునీకరించిన వెబ్‌సైట్‌ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు బసంత్‌కుమార్‌ తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ను బుధవారం నుంచి నిర్వహిస్తామన్నారు. బీపీఎస్‌లో తిరస్కరించిన వినతులు పునఃపరిశీలించి అవకాశం ఉన్నవాటిని మార్చి 31లోగా పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో కార్యదర్శి శ్రీనివాస్‌, చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ వి.భవానీశంకర్‌, ఎస్‌ఈ రవి పాల్గొన్నారు.