News

Realestate News

జై….మట్టి వినాయక

జై….మట్టి వినాయక
జనంలో కనిపిస్తున్న మార్పు
చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు
న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ

ప్రకృతి దేవుడిచ్చిన వరం. దానిని కాపాడుకోవటం మానవ ధర్మం. దేవుడి పేరు చెప్పి పర్యావరణాన్ని కలుషితం చేయటంలో మాత్రం మనం ముందు ఉంటున్నాం.. వినాయక చవితి వస్తోంది. అపుడే విగ్రహాల తయారీలో కళాకారులు నిమగ్నమయ్యారు. ఈసారి ముందుగానే పర్యావరణవేత్తలు మేల్కొన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీవోపీ)తో విగ్రహాలను చేయొద్దని, మట్టి విగ్రహాలే మేలని ప్రచారం చేస్తున్నారు. పిల్లల్లోనూ అవగాహన కలిగిస్తున్నారు. ఈ ప్రచారం ఫలితాన్నిస్తోంది. ఈసారి మాత్రం నూరుశాతం మట్టి విగ్రహాలనే వాడాలన్న ప్రచారం హోరెత్తుతోంది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌ (పీవోపీ)తో పర్యావరణానికి హాని కలుగుతుందని, వాటికి స్వస్తి చెప్పాలంటూ ఇటు ప్రభుత్వం, అటు స్వచ్ఛంద సంస్థలు ప్రజలను చైతన్యవంతులను చేస్తుండటంతో జనంలోనూ మార్పు కనిపిస్తోంది. గత రెండేళ్ల నుంచి క్రమేణా మట్టి విగ్రహాల వైపే మొగ్గు చూపుతున్నారు. అయినా కొన్ని చోట్ల పీవోపీ విగ్రహాలు కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో స్వచ్ఛంద సంస్థలు నెల రోజుల క్రితమే ప్రణాళిక అమలును మొదలుపెట్టేశాయి. మట్టి విగ్రహాలను తయారు చేసే కార్యక్రమాలను ఇటు పాఠశాలల్లోను, కళాశాలల్లో నిర్వహించి, వాటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు సైతం మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసే ప్రయత్నంలో ఉన్నాయి.

శ్రమే గాని..
మట్టి విగ్రహాల తయారీ అంత సులువైన విషయం కాదు. కళాకారులు ఎంతో శ్రమిస్తేగానీ విగ్రహం సిద్ధం కాదు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌ అంటే కేవలం అచ్చు (మోల్డింగ్‌)తో విగ్రహాన్ని తయారు చేస్తారు. మట్టి విగ్రహం అంటే మట్టి, గడ్డి, బంకమన్ను, కర్రలు ఉపయోగిస్తారు. ఒక్కో విగ్రహం తయారీకి సుమారు 15 రోజుల సమయం పడుతుంది. అందుకే మట్టి విగ్రహాలను తయారు చేసేవారు మూడు నెలల ముందుగానే పనులను ప్రారంభిస్తారు. వీరు కోల్‌కతా నుంచి నగరానికి మూడు నెలల ముందు వస్తారు. సాధారణంగా వినాయక చవితి సెప్టెంబరులో వస్తుంటుంది. ఈ ఏడాది ఆగస్టులోనే రావటంతో మే నెలలోనే కళాకారులు నగరానికి చేరుకున్నారు. లాసన్స్‌బేకాలనీ(ఎంవీపీ), డైమండ్‌ పార్కు, అల్లిపురం, కంచరపాలెం, అక్కయ్యపాలెం (80 అడుగుల రోడ్డు), ఎన్‌.ఎ.డి. తదితర ప్రాంతాల్లో నగర అవసరాలకు అనుగుణంగా 1200 నుంచి 1400 వరకు మట్టి విగ్రహాలను తయారు చేస్తుంటారు.

కోల్‌కతా మట్టే కీలకం..
మట్టితో విగ్రహాలు తయారు చేయాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ముడిసరుకుల ధరలు కూడా పెరిగిపోవటంతో విగ్రహాల ధరలు గతంలో కంటే 20 శాతం పెరిగాయి. మట్టిని ఎండాడ, ఎస్‌.కోట, తగరపువలస ప్రాంతాల్లోని చెరువుల నుంచి తెస్తున్నారు. గడ్డి, సరుగుడు కర్రలు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచే తెచ్చుకుంటారు. విగ్రహాల తయారీలో అత్యంత ప్రాధాన్యమైనది కోల్‌కతా మట్టి. సిమెంటులా ఎంతో మృదువుగా ఉండే కోల్‌కతా మట్టిని ఉపయోగించిన తర్వాతనే విగ్రహం చూసేందుకు ఎంతో బాగుంటుందని తయారీదారులు చెబుతున్నారు.

ఇలా తయారీ…
ముందుగా కర్రలను, గడ్డిని ఉపయోగించి విగ్రహం ఆకారం తయారు చేస్తారు. ఆ ఆకారంలో బంకమట్టిని కూరుస్తారు. దానిపైనే ఫినిషింగ్‌ మట్టిని ఉపయోగించి కొన్ని రోజులు ఉంచుతారు. ఆఖర్లో కోల్‌కతా మట్టిని విగ్రహం అంతా పూస్తారు. విగ్రహం నున్నగా తయారవుతుంది. తర్వాత విగ్రహానికి సున్నం వేసి, రసాయనాలు లేని రంగులద్దుతారు. విగ్రహానికి అవసరమైన కిరీటం, ఆభరణాలు కూడా మట్టి అచ్చు ద్వారానే తయారు చేస్తారు. విగ్రహం మరింత ఆకర్షణీయంగా కనిపించటానికి కోల్‌కతా నుంచి తెచ్చిన అలంకరణ సామగ్రి ఉపయోగిస్తారు. ప్రస్తుతం నగరంలో 3 అడుగుల నుంచి 15 అడుగుల వరకు విగ్రహాలు రూ. 3 నుంచి రూ. 50 వేల వరకు వివిధ మోడళ్లలో, ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

పర్యావరణ పరిరక్షణకు ప్రచారం…
చవితి ఉత్సవాలను పర్యావరణ హితంగా చేసుకోవాలంటూ ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. పర్యావరణ మార్గదర్శి వైశాఖీ అనే స్వచ్ఛంద సంస్థ పండగకు 45 రోజుల ముందు నుంచే మట్టి విగ్రహాల తయారీపై శిక్షణ ఇస్తోంది. గత ఏడాది వరకు మట్టి విగ్రహాలను ఉపయోగించటం ద్వారా కలిగే మేలు గురించి వివరిస్తూ, విద్యార్థులతోనే వీటిని తయారు చేయించి వారికే ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి చవితి పండగకు ఉపయోగించే 21 రకాల పత్రులు, వాటి ఔషధ విలువలను వివరిస్తున్నారు. పత్రిని ఇంటి ఆవరణలోనే పెంచుకోవచ్చని అందరిలో చైతన్యం తీసుకువస్తున్నారు. మట్టి విగ్రహాలను తయారు చేయించి, వాటిలో ఒక్కో రకం పత్రి విత్తనాలు ఉంచి, పూజ అనంతరం విగ్రహంతో పాటు ఇంటి పెరిటిలోనే విగ్రహాన్ని ఉంచి, ప్రతీ రోజూ నీరు పోయటం ద్వారా విగ్రహం కరిగి మట్టితో పాటు విత్తనం భూమిలో కలుస్తుందని, తద్వారా కొన్ని రోజుల తర్వాత విత్తనం ద్వారా ఔషధ గుణాలతో కూడిన మొక్కలు మొలకెత్తుతాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఎంతో విలువైన 21 రకాల మొక్కలు దాదాపుగా అంతరించిపోతున్నాయని, వాటిని తప్పనిసరిగా కాపాడుకోవాలంటూ ప్రచారం జరుపుతున్నారు. సినీనటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కూడా పాల్గొని ప్రచారం చేయటం విశేషం. కాలుష్య నియంత్రణ మండలి, లయన్స్‌క్లబ్‌, వాసవిక్లబ్‌ ఇలా పలు సంస్థలు కూడా గత ఏడాది ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశాయి.