జేఎన్టీయూకేలో ఆకట్టుకున్న ఇన్నోవేషన్ ఫెయిర్
భానుగుడిసెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: సాంకేతిక అభివృద్ధితోనే సమాజం ముందడుగు వేస్తుందని జేఎన్టీయూకే(కాకినాడ) రెక్టార్ పూర్ణానందం అన్నారు. జేఎన్టీయూకే డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ఫెయిర్-17 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి వర్సిటీ అనుబంధ కళాశాలలకు చెందిన పలు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు తమ సృజనాత్మకతను జోడించి ప్రాజెక్టులను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రెక్టార్ మాట్లాడుతూ వైద్యం, బహుళార్థక ప్రాజెక్టులు, నూతన ఆవిష్కరణలు ఇలా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులకు సాంకేతిక అవసరం చాలా ఉందన్నారు. సాంకేతికను ఉపయోగించి ప్రపంచ దేశాలు ముందుకు దూసుకుపోతున్నాయని, యువత అటువంటి ఆలోచనలతో భారతదేశ కీర్తిప్రతిష్ఠను దశదిశలా వ్యాప్తిచేయాలన్నారు. ప్రిన్సిపల్ జీవీఆర్ ప్రసాదరాజు మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరిగి నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తారన్నారు.
దేశానికి ఉపయోగపడే ప్రాజెక్టులు చేపట్టి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనాలన్నారు. సోలార్ సిస్టమ్‌తో నడిచే వాహనాలు, రిమోటü సహాయంతో నడిచే యుద్ధ ట్యాంకులు, జియోట్యాగింగ్తోపాటు రిమోటü సాయంతో స్మార్ట్‌సిటీ నిర్వహణ వంటి అంశాలను విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు. కార్యక్రమంలో కన్వీనర్ గోపాలకృష్ణ, ఓఎస్డీ కేవీ రమణ, మెకానికల్ విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శనలో మొత్తం 150 వరకూ ప్రాజెక్టులను రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రదర్శించారు. ఉత్తమమైన మూడు ప్రాజెక్టులను ఎంపికచేసి వాటికి నగదు బహుమతులను అందజేశారు. ప్రదర్శనలో విశాఖకు చెందిన విజ్ఞాన్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ఎల్పీజీ రక్షణ ప్రాజెక్టుకు మొదటి బహుమతి లభించింది. రెండో బహుమతి రాజమహేంద్రవరం గైట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన మహిళా రక్షణ యాప్‌కు లభించింది. మూడో బహుమతి విశాఖ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన ఎయిర్ కండీషన్డ్ హెల్మెట్‌కు లభించింది. ప్రదర్శన ముగింపు సమావేశంలో ఫ్రొపెసర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు దేశ ప్రగతికి ఎంతో అవసరమన్నారు. కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ నూతన ఆవిష్కరణల ప్రోత్సాహం కోసం పదికోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు.