మొదటి దశ పనులకు జులై 15న టెండర్లు అక్టోబరు నుంచి పనులు మొదలు తొలిదశలో ఆరు సబ్ స్టేషన్ల పరిధిలో … కలెక్టర్ యువరాజ్ ఆదేశం
వన్‌టౌన్, న్యూస్‌టుడే: ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సహాయంతో నగరంలో చేపట్టనున్న భూగర్భ కేబులు వ్యవస్థ పనుల కోసం రోడ్ల తవ్వకం, పునరుద్ధరణ పనుల పర్యవేక్షణను జీవీఎంసీ ఇంజినీర్లు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో భూగర్భ కేబులు వ్యవస్థ పనులు అమలుపై జీవీఎంసీ, ఈపీడీసీఎల్, ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. మొదటి దశ పనులకు జులై 15న టెండర్లు పిలుస్తామని, అక్టోబరులో పనులను ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. పనులు ప్రారంభించిన తర్వాత 18 నెలలకు పూర్తి చేయవల్సి ఉందన్నారు. భూగర్భ కేబులు వ్యవస్థ పనుల కోసం రోడ్ల తవ్వకాలు, పునరుద్ధరణకు అయ్యే ఖర్చులను టెండర్లలో పేర్కొనాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ విషయంలో నాణ్యతాపరమైన అన్ని చర్యలను తీసుకోవాలన్నారు. ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ ఎ.పి.డిజాస్టర్ రికవరీ ప్రాజక్టు కింద ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సహాయంతో భూగర్భ విద్యుత్తు నెట్వర్కు ప్రాజెక్టును నాలుగు దశల్లో చేపడతామని చెప్పారు. తొలిదశ పనులకు రూ.239 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. నగర పరిధిలోని ఎం.వి.పి.కాలనీ, పెదవాల్తేరు, కేజీహెచ్, ఆర్సీడీ ఆసుపత్రి, సిరిపురం, శివాజీపాలెం ఆరు విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలో పనులు జరుగుతాయని చెప్పారు. ఈ ఉప కేంద్రాల పరిధిలో 37కిలోమీటర్ల మేర 33కెవిలైన్లు, 83కిలో మీటర్ల మేర 11కె.వి.లైన్లు, 160 కిలోమీటర్ల మేర ఎల్టి లైన్లు వేయనున్నట్లు చెప్పారు. సమీక్షలో జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, పర్యవేక్షక ఇంజినీర్లు ఆనందరావు, చంద్రయ్య, ప్రపంచబ్యాంకు ప్రతినిధులు దీపక్‌సింగ్, దీపక్మాలిక్, రాజేంద్రప్రసాద్, నేహావ్యాస్ తదితరులు పాల్గొన్నారు.