జిల్లాలో వయోవృద్ధుల వసతి గృహం ఏర్పాటు

తామరం (మాకవరపాలెం), న్యూస్టుడే : వయోవృద్ధులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయక సంచాలకులు బి.వెంకటేశ్వరరావు తెలిపారు. వయోవృద్ధుల వసతి గృహం ఏర్పాటుకు సంబంధించి భవనాన్ని పరిశీలించేందుకు మంగళవారం ఆయన తామరం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున వయోవృద్ధుల ప్రత్యేక వసతి గృహం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందు కోసం రూ.45 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చూపించే భవనాలు, వసతులు పరిశీలించి నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. వసతి గృహం ప్య్రవేక్షణకు ఒక పర్యవేక్షకుడు, వాచ్మెన్, వంట చేసేందుకు అవసరమైన పనివార్లను ప్రయివేట్ యాజమాన్య సంస్థలకు అప్పగించనున్నట్లు ఆయన వివరించారు. వసతి గృహం ఏర్పాటు కోసం జిల్లాలో కశింకోట, నర్సీపట్నం, మాకవరపాలెం మండలాల్లో భవనాలు పరిశీలించామన్నారు. డి.సి.టి.ఓ. అల్లు సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ జి.వి.బి.జగదీష్, ఆర్.వై.డి.ఓ. సంస్థ ప్రతినిధి ఆడారి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
రూ.లక్షకు పెరిగిన పోత్సాహకం
దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వం ఇస్తున్న పోత్సాహకాన్ని రూ.లక్షకు పెంచినట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు రూ.50 వేలు ఇస్తున్నామని, కొత్తగా వచ్చిన జీవో ప్రకారం ఇకపై రూ.లక్ష ఇస్తామని చెప్పారు. సంవత్సరానికి 300 జంటలకు ప్రోత్సాహకం ఇవ్వాల్సిన లక్ష్యం కాగా ఇప్పటి వరకు 71 జంటలకు రూ.50 వేలు చొప్పున అందించామని చెప్పారు.