News

Realestate News

జిల్లాకు రెండు కొత్త డివిజన్లు!

జిల్లాకు రెండు కొత్త డివిజన్లు!
చోడవరం,చింతపల్లి డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదన

విశాఖపట్నం, ఈనాడు : పాలనా సౌలభ్యం.. ప్రభుత్వ పథకాల అమలు విస్తృతం చేసే క్రమంలో రెవెన్యూ డివిజన్లను పెంచాలనే ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో రెండు కొత్త డివిజన్ల ఏర్పాటుకు కసరత్తు సాగుతోంది. చోడవరం, చింతపల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుచెయ్యాలనే ప్రతిపాదనలను భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) అనిల్‌చంద్ర పునేఠా ప్రభుత్వం ముందుంచారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఈ ప్రతిపాదన దాదాపుగా ఖరారయ్యే అవకాశాలున్నాయి.

జిల్లాలో ప్రస్తుతం నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 43 మండలాలున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డివిజన్ల పరిధిలో రెవెన్యూ పాలన సాగుతోంది. నాలుగేళ్ల క్రితమే అనకాపల్లి డివిజన్‌ ఆవిర్భవించింది. జిల్లా విస్తీర్ణం ఎక్కువ కావడం.. శివారు ప్రాంతాలకు సేవలు సమర్థంగా అందకపోవడంతో పునర్విభజన అంశం తెరమీదికి వచ్చింది. ఈ క్రమంలో తొలుత చోడవరం, చింతపల్లి, పెందుర్తి డివిజన్లు ఏర్పాటవుతాయనేది తెరమీదికి వచ్చినా.. తుది నివేదికలో రెండు డివిజన్లకే చోటు దక్కడం గమనార్హం. చోడవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి చోడవరంతోపాటు రావికమతం, బుచ్చయ్యపేట, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాలు రానున్నాయి. చింతపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో భౌగోళికంగా అధిక విస్తీర్ణంలో ఉన్న చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు మండలాలతోపాటు పాడేరు డివిజన్‌లో జి.మాడుగుల మరికొన్ని మండలాలను కలిపే అవకాశాలున్నాయి.