News

Realestate News

జిల్లాకు కొత్తగా 304 మంది కానిస్టేబుళ్లు

జిల్లాకు కొత్తగా 304 మంది కానిస్టేబుళ్లు
కౌన్సెలింగ్‌లో పోస్టింగుల కేటాయింపు
ప్రజలతో గౌరవంగా మెలగండి : ఎస్పీ
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: విశాఖ గ్రామీణ జిల్లాకు కొత్తగా 304 మంది సివిల్‌ కానిస్టేబుళ్లు వచ్చారు. విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ పోలీసు శిక్షణా కళాశాల్లో తొమ్మిది నెలల శిక్షణను పూర్తి చేసుకుని వచ్చిన వారిలో మహిళా కానిస్టేబుళ్లు 87 మంది ఉన్నారు. వీరికి శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించి వారు కోరుకున్న పోలీసు స్టేషన్లలో ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ పోస్టింగ్‌లిచ్చారు. జిల్లాకు త్వరలో మరో 145 మంది ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుళ్లు వచ్చే అవకాశం ఉంది. అందులోను 25 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. జిల్లాలో ప్రస్తుతం రెండు వేల మంది సివిల్‌, 500 మంది ఏఆర్‌ కానిస్టేబుళ్లు ఉన్నారు. కొత్తగా సివిల్‌ 304, ఏఆర్‌ 145 మంది వస్తున్నందున పోలీసు బలగాలు మరింత పెరగనున్నాయి. 2009, 2011 బ్యాచ్‌లకు చెందిన 124 మంది యువ సివిల్‌ కానిస్టేబుళ్లకు కూడా కౌన్సెలింగ్‌ ద్వారానే వారు కోరుకున్న స్టేషన్లకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొత్తగా పోలీసు విధుల్లో చేరుతున్న కానిస్టేబుళ్లు.. బదిలీపై ఇతర స్టేషన్లకు వెళుతున్న సిబ్బంది ప్రజలతో గౌరవ మర్యాదలతో వ్యవహరించి మంచి పోలీసులు అనిపించుకోవాలన్నారు. తద్వారా పోలీసు శాఖకు మంచిపేరు తేవాలని.. పని విధానంలో సాంకేతిక మెలకువలను మెరుగుపరచుకోవాలని సూచించారు.

నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలి
నేరాలు జరగడానికి గల కారణాలను తెలుసుకుని నేర నివారణలో తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. నెలవారీ నేర సమీక్ష సమావేశంలో పోలీసు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలను వివరించారు. పోలీసు స్టేషన్ల పరిధిలో జరుగుతున్న నేరాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళల, మైనర్‌ బాలికల మిస్సింగ్‌ కేసుల్లో సత్వరం పురోగతిని సాధించాలని సూచించారు. ముద్దాయి ఎస్కార్టుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఏమాత్రం ఉదాసీనత కనబరిచినా ముద్దాయిలు తప్పించుకున్న ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో  సమర్థంగా విధులను నిర్వహించేవారికే అప్పజెప్పాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (నేరాలు) ఎన్‌.జె.రాజ్‌కుమార్‌, పాడేరు ఏఎస్పీ అమిత్‌ బర్దార్‌, నర్సీపట్నం ఏఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌, చింతపల్లి డీఎస్పీ అనిల్‌ పులిపాటి, అనకాపల్లి డీఎస్పీ కె.వెంకటరమణ, డీఎస్‌బీ డీఎస్‌పీ వై.వీ.రమణ, ఎస్సీ ఎస్టీ సెల్‌ డీఎస్పీలు వివేకానంద, ఎల్‌ మోహనరావు, డీటీసీ డీఎస్పీ ఆర్‌.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.