జలాశయాలు కళకళ

జలాశయాలు కళకళ
కార్పొరేషన్, న్యూస్‌టుడే: వారం రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో నగరానికి తాగునీరు అందించే పలు జలాశయాల్లో నీరు నెమ్మదిగా
చేరుతోంది. దీంతో ఓవైపు ఆశలు రేకెత్తుతున్నా… మరోవైపు విశాఖ నగరానికి తాగునీటిని అందించే ప్రధాన జలాశయం ఏలేరులో మాత్రం జల సందడి
కనిపించడంలేదు. దీంతో అధికారుల్లో ఒకింత ఆందోళన కూడా నెలకొంది. రానున్న వేసవిలో నగరానికి నీటి ఎద్దడి తప్పేలాలేదని ఇంజినీరింగ్
అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరానికి నీటిని సరఫరా చేస్తున్న వనరుల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నా, పూర్తిస్థాయిలో
రిజర్వాయర్లకు జలకళ లేదు. గత నెల రోజుల నుంచి ఏలేరు రిజర్వాయర్ నుంచి పంపింగ్ ప్రక్రియ నిలిపివేసిన అధికారులు గ్రావిటీ ద్వారానే నీటిని
కాలువ ద్వారా మళ్లిస్తున్నారు. ఇతర వనరుల్లో కాస్త ఆశాజనకంగానే నీటి మట్టం ఉంది.
ప్రస్తుతానికి ఫర్వాలేదు… : విశాఖ నగర తాగునీటి అవసరాలతోపాటు, పరిశ్రమలకు కావాల్సిన నీటిని జీవీఎంసీ, విశాఖపట్నం పరిశ్రమల నీటి సరఫరా
సంస్థ(విస్కో) వివిధ వనరుల నుంచి సమకూరుస్తోంది. వీటిలో ప్రధానమైన ఏలేరు రిజర్వాయర్ నుంచి రోజూ 300 క్యూసెక్కుల నీటిని నగరానికి
తరలిస్తుంటారు. ఏలేరు రిజర్వాయర్ ఎండిపోవడం.. డెడ్‌స్టోరేజ్‌కి చేరుకోవడంతో 2015 సెప్టెంబర్ నుంచి నీటిని పంపులతో తోడాల్సి వస్తోంది. ప్రస్తుతం
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 76 మీటర్లకు నీటి మట్టం చేరుకోవడంతో పంపింగ్‌ను నిలిపివేసి, గ్రావిటీ ద్వారా నీటిని తరలిస్తున్నారు. 2015 సెప్టెంబర్
నుంచి గోదావరి నది నుంచి 150 క్యూసెక్కులు, ఏలేరు రిజర్వాయర్ నుంచి మరో 150 క్యూసెక్కుల నీటిని పంపింగ్ ద్వారా తరలించేవారు. ప్రస్తుతం
విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా… ఏలేరు జలాశయం పైభాగంలో పెద్దగా లేకపోవడంతో ఈ ఏడాది ఏలేరు రిజర్వాయర్‌లో నీరు
చేరలేదు. ప్రస్తుతం ఉన్న 76 మీటర్ల నీటి మట్టం 71 మీటర్లకు పడిపోతే మళ్లీ పంపింగ్ ప్రారంభించాల్సి ఉంటుంది. దీంతో అధికారుల్లో కాస్త ఆందోళన
నెలకొంది.