News

Realestate News

జనంతోనే మనం

జనంతోనే మనం
వారి తర్వాతే ఎవరైనా : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఘనంగా మహానాడు ప్రారంభం

తెలుగుదేశం ప్రజల కోసం పెట్టిన పార్టీ. ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్‌ మాటలే మనకు వేదవాక్కు. పార్టీ నేతలంతా జనంతోనే ఉండాలి కార్యకర్తల సంబరం.. నాయకుల నవ్యోత్సాహం.. అధినాయకుడి దిశానిర్దేశం.. మహానాడు తొలిరోజు విశేషాలివి…

‘హుద్‌ హుద్‌ తీవ్ర పెను తుపాను సృష్టించిన బీభత్సం నుంచి కోలుకుని, కేవలం రెండున్నరేళ్లలోనే విశాఖ నగరం ఇంత సుందరంగా తయారైందంటే కారణం ఇక్కడి ప్రజల కృషి. ఇదే స్ఫూర్తితో గ్రామాలు, నగరాలను సుందరంగా తీర్చిదిద్దాలి. మనం తలచుకుంటే ఇది అసాధ్యం కాదు’.

‘విశాఖలో రెండుసార్లు భాగస్వామ్య సదస్సులు నిర్వహించాం. 1692 ఒప్పందాలు చేసుకున్నాం. రూ. 15,75,00 కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఎంఓయూలు జరిగాయి. ఇవి ఆచరణలోకి వస్తే 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి’.

– ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

నగరంలో శనివారం మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. అంచనాలకు మించి కార్యకర్తలు తరలివచ్చారు. దాదాపు 30 వేలమంది వస్తారని అంచనా వేయగా.. 45 వేలమందికిపైగానే వచ్చారని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. వేదిక వద్ద సుమారు 20 వేల కుర్చీలు వేయగా మొత్తం నిండిపోయాయి. మిగిలిన వేలాదిమంది ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ వైద్యసేవలు, ఎగ్జిబిషన్‌, రిజిస్ట్రేషన్‌ కౌంటర్లు తదితర చోట్ల కలియదిరిగారు. కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కాఫీ, టీ, మజ్జిగ, స్వీటు, హాటు తదితరాల ప్యాకెట్లు అందించారు. మండు వేసవి కావడంతో మజ్జిగను నిరంతరాయంగా సరఫరా చేశారు. ముఖ్యమంత్రి, ప్రముఖుల భద్రత దృష్ట్యా వేదిక పరిసరాల్లో జామర్లు ఏర్పాటు చేయడంతో సెల్‌ఫోన్లు పనిచేయలేదు. మంత్రి నారా లోకేశ్‌ వేదికపైకి కూడా రాకుండానే..

సభా ప్రాంగణం మొత్తం కలియదిరుగుతూ కమిటీల ఇన్‌ఛార్జిలతోనూ, వలంటీర్లతోనూ మాట్లాడుతూ.. సూచనలు ఇస్తూ సందడి చేశారు. విశాఖ నగరంలో 15 ఏళ్ల విరామం తరువాత మహానాడు నిర్వహించడంతో ఉత్తరాంధ్ర జిల్లాల శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపించింది. కార్యక్రమానికి హజరైన వారిలో యువకులు అధికంగా ఉండడం మరో విశేషం. మొదటి రోజు వచ్చిన స్పందనతో ఆది, సోమవారాల్లో జరిగే మహానాడు రెండు, మూడో రోజు కార్యక్రమాలకు మరింత భారీగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కార్యక్రమానికి హాజరైన వారిలో సుమారు 30శాతం మంది వరకు మహిళలు కూడా ఉండడం మరో విశేషం. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పలువురు మహిళలు హాజరయ్యారు. సుమారు 12వేల మంది వరకు మహిళలు హాజరైనట్లు అంచనా వేస్తున్నారు.

జోనల్‌స్థాయి వైద్యారోగ్య సిబ్బంది బదిలీలు
విశాఖపట్నం: వైద్యారోగ్య శాఖలో జోనల్‌స్థాయి సిబ్బంది బదిలీలకు ఎట్టకేలకు అవకాశం లభించింది. సాధారణ బదిలీలతో పాటే ఈనెల 24లోగా వీరికి బదిలీ జరగాల్సి ఉన్నా ఆ సమయంలో వెబ్‌సైట్‌ పనిచేయలేదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పనిచేసే జోనల్‌ స్థాయి ఉద్యోగుల కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈనెల 27 నుంచి 29 వరకు వెబ్‌సైట్‌లో అర్హులు వివరాలను నమోదుచేసుకోవడానికి వీలు కల్పించారు. దీంతో మూడు జిల్లాల్లోని స్టాఫ్‌ నర్స్‌లు, ఎమ్‌పీఎస్‌, హెల్త్‌ విజిటర్‌ (హెచ్‌వీ), హెల్త్‌ సూపర్‌వైజర్‌ (హెచ్‌ఎస్‌), ప్రైమరీ హెల్త్‌ నర్స్‌ (పీహెచ్‌ఎన్‌), సీనియర్‌ సహాయకులు, కార్యాలయ పర్యవేక్షకులు వంటి ఉద్యోగులకు బదిలీ అవకాశం లభించింది. వెబ్‌సైట్‌ ఈ మూడు రోజులే తెరిచి ఉంటుందని, జూన్‌ 5లోపు బదిలీల ప్రక్రియను ముగించేలా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.