ఛార్జింగ్ స్టేషన్లు
విద్యుత్తు వాహనాల కోసం త్వరలో ఏర్పాటు

విశాఖ నగరం సహా అమరావతి, తిరుపతి, తిరుమలలో మొత్తం 50 విద్యుత్తు ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖకు 18 స్టేషన్లు మంజూరయ్యాయి. వీటిని ప్రైవేటు సంస్థల ద్వారా ఈపీడీసీఎల్ నిర్వహిస్తుంది. ఇప్పటికే నగరంలో కలెక్టర్ సహా మరికొందరు అధికారులకు విద్యుత్తు వాహనాలను ప్రభుత్వం ఇచ్చింది. మరికొన్నిటిని విడతలవారీగా ఇవ్వనుంది. విద్యుత్తు వాహనాల వినియోగంపై ప్రజలకు అవగాహన వస్తున్నందున ఛార్జింగ్ స్టేషన్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ స్టేషన్లు అందుబాటులో ఉంటేనే విద్యుత్తు వాహనాల వినియోగం పెరుగుతుందని, తద్వారా పర్యావరణానికి మేలు కలుగుతుందని భావిస్తున్నారు. ఇటీవల భాగస్వామ్య సదస్సులో ఈఈఎస్ఎల్ సంస్థ రూ. 3,730 కోట్లతో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది వివిధ శాఖల కోసం 10 వేల విద్యుత్తు వాహనాలు, 4 వేల ఛార్జర్లను సిద్ధం చేయాల్సి ఉంది. ఇందులో భాగంగానే విశాఖకూ వాహనాలు రానున్నాయి.
భారత్ డీసీ001 ఛార్జర్స్
నగరాల్లో విద్యుత్తు ఛార్జింగ్ స్టేషన్లు ఎలా ఉండాలో కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం విశాఖలో ‘భారత్ డీసీ001’ విద్యుత్తు ఛార్జర్లను తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. 15కిలోవాట్ సామర్థ్యంతో ఛార్జింగ్ అయ్యేవాటిని ఇందులో ఉంచుతారు. ఆయా స్టేషన్లకు సరఫరా అయ్యే విద్యుత్తును అత్యవసర పరిస్థితుల్లో వాడుకునేందుకు గంటసేపు బ్యాకప్ ఉంచే సౌకర్యం ఉంటుంది.
చెల్లింపు విధానమిదీ..: అవసరమైన విద్యుత్తు వినియోగించిన తరువాత నగదుతో పాటు మొబైల్ యాప్ ద్వారా, భీమ్ యాప్ ద్వారా, క్యూ.ఆర్.కోడ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
ఎంత తేడా..: విద్యుత్తు ద్విచక్రవాహనాలకు, పెట్రోలు ద్విచక్రవాహనాలకు ఎలాంటి తేడాలున్నాయో వివరించింది దిల్లీలోని విద్యుత్తు వాహనాల తయారీదారుల సంఘం (ఎస్ఎంఈవీ).
నిబంధనలు నడలిస్తేనే..
విద్యుత్తు వాహనాల వినియోగం బాగా పెరగడానికి నిబంధనల్ని సడలించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందం సూచించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ నివేదికల్ని పంపింది. వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రం నుంచి అనుమతులు రాగానే వాటిని అమలు పరిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్తు వాహనాలకు బాగా డిమాండ్ ఉందని అంచనా. బ్యాటరీతో నడిచే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను కూడా అమల్లోకి తేవాలనేది మరో ఆలోచన. వీటి ద్వారా పర్యావరణ పరిరక్షణపరంగా మెరుగైన మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.
ఎక్కడెక్కడంటే..: ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం నగరంలో 18 ఛార్జింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడంటే…ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం దగ్గర 2, విద్యుత్తుశాఖ ఎస్ఈ కార్యాలయం, ట్రాన్స్‌కో జోనల్ కార్యాలయం, స్టీల్‌ప్లాంట్, కలెక్టరేట్, జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమీపంలో ఒక్కోటి. మిగిలినవి మరో 10 ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు స్థలాల్ని గుర్తిస్తున్నారు.
యూనిట్‌కు రూ. 6.96: ఛార్జింగ్ స్టేషన్లలో వాహనాల కోసం విద్యుత్తును కొనుగోలు చేయాలంటే ఒక్కో యూనిట్ ధర రూ. 6.95. ఈపీడీసీఎల్ ఈ ధరను ప్రతిపాదిస్తూ ఏపీఈఆర్సీకి పంపించింది. దీన్ని పరిశీలిస్తున్న రెగ్యులేటరీ కమిషన్.. తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. ఈ నెలాఖరులోపు ప్రకటించే అవకాశం ఉంది.