News

Realestate News

చెత్త.. పంచాయతీల

Panchayats worst

చెత్త.. పంచాయతీల
కొత్త సంపద
గుర్రమ్మపాలెంలో ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రం
సేంద్రియ ఎరువుల తయారీకి శ్రీకారం
గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రభుత్వ కార్యాచరణ
పెందుర్తి, న్యూస్‌టుడే
ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం… వీధుల్లో బహిరంగ మలవిసర్జన… అశాస్త్రీయంగా చెత్తను తగలబెట్టడం… గోతిలో పాతిపెట్టడం… చెల్లాచెదురుగా ఎగురుతున్న చిత్తుకాగితాలు, పాలిథిన్‌ సంచులు… కుళ్లిన దశలో ఉన్న జంతువుల, పక్షుల కళేబరాలు… గ్రామ శివారుల్లో చెత్తను పారవేసే ప్రాంతం వైపు వెళ్లాలంటేనే తీవ్ర దుర్వాసనతో అసహ్యించుకునే పరిస్థితి… ఈ దుస్థితికి చరమగీతం పాడి డంపింగు యార్డులను సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా పనికిరాని చెత్త నుంచి సంపదను సృష్టించి గ్రామాభివృద్ధికి తోడ్పడేలా చేయాలన్న లక్ష్యంతో… స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మండలానికి ఒక్కటి చొప్పున 39గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల పెందుర్తి మండలంలోని గుర్రమ్మపాలెం గ్రామంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్థాయీ సంఘం సభ్యులు ఈ కేంద్రాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసింది.

250 కుటుంబాలకు ఒక హరిత రాయబారి
ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన చెత్తతో సంపద తయారీ కేంద్రాల నిర్వహణలో భాగంగా ప్రతి గ్రామంలో 250 కుటుంబాలకు ఒక స్వచ్ఛ రాయబారిని నియమిస్తారు. వారు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తారు. దాన్ని సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ పొడి చెత్తను వేరు చేసి నిల్వ ఉంచుతారు. కుళ్లిపోయేందుకు అనువైన తడి చెత్తను ప్రత్యేకమైన బెడ్‌పై వేసి దిమిసెతో తొక్కుతారు. ఈ వ్యర్థాలను తొట్టెల్లో ఉన్న పేడ, వానపాముల మిశ్రమంలో వేస్తారు. ఆపై తడిపిన గోనె సంచులను కప్పివేస్తారు. మిశ్రమంలో వానపాములు పెరిగి సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఈ ఎరువులను వ్యవసాయానికి వినియోగించుకోవచ్చు. ఈ ఎరువును కిలో రూ. 8 నుంచి రూ. 10 చొప్పున విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. పొడి చెత్త అంటే… కాగితాలు, గాజు, ప్లాస్టిక్‌ వంటి వ్యర్థాలను అమ్మకం చేస్తారు.

ఆధునిక పద్ధతుల్లో పునర్వినియోగం
హరిత రాయబారులు సేకరించిన చెత్తను ఆధునిక పద్ధతుల్లో పునర్వినియోగించేందుకు అనువుగా యార్డులను రూపొందించారు. గుర్రమ్మపాలెంలో సుమారు 4 సెంట్ల స్థలంలో సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని నిర్మించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీ 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ. 4.50 లక్షలు ఇందుకోసం ఖర్చు చేశారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో షెడ్డు నిర్మాణంతో పాటు ఎరువుల తయారీ, పొడి చెత్త సేకరణకు సిమెంటు తొట్టెలు నిర్మించారు. స్టోర్‌ గది, విద్యుత్తు, నీటి సరఫరా ఏర్పాట్లు చేశారు. గాజు, ప్లాస్టిక్‌ వస్తువులను శిథిలం చేసేందుకు ఒక యంత్రం, వస్త్ర సంబంధిత వ్యర్థాలను నిర్వీర్యం చేసే యంత్రం, చెత్త సేకరణకు నాలుగు రిక్షాలు, చేతికి గ్లౌజులు, తలకు హెల్మెట్‌, ఇతర పరికరాలను సమకూర్చారు. చెత్త నిర్వహణ కేంద్రంతో పాటు దగ్గరలోనే పశుపక్ష్యాదుల కళేబరాల సంస్కారాలకు, భవన నిర్మాణ వ్యర్థాల వంటివి నిర్వహించేందుకు ప్రత్యేక స్థలాలను గుర్తించారు. కేంద్రం చుట్టూ ప్రహారీ నిర్మించారు. పరిసరాల్లో మొక్కలు నాటి హరిత శోభను తీసుకొచ్చారు. దుర్వాసనకు దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారు.

కేంద్రం నిర్వహణ ఇలా…
గ్రామంలోని జనాభా ఆధారంగా సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం ఎంత విస్తీర్ణంలో నిర్మించాలన్నది ఆధారపడి ఉంటుంది. గుర్రమ్మపాలెం గ్రామాన్ని తీసుకుంటే… ఇక్కడ 12 వార్డుల పరిధిలో 3727 మంది జనాభా ఉండగా, 1087 నివాసాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 5వ వార్డులో ఈ తడి, పొడి చెత్తసేకరణ ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి 300 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు తడిచెత్త ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈ లెక్కన రోజుకు 300 నుంచి 400 కేజీల వరకు తడిచెత్త ఉత్పత్తి అవుతుంది. ప్రతి హరిత రాయబారి 10కేజీల సేంద్రియ ఎరువును తయారు చేయాలనేది లక్ష్యం. ఇందుకు గాను హరిత రాయబారికి గ్రామ పంచాయతీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సంయుక్తంగా రూ. 6వేలు వేతనంగా ఇస్తారు. ప్రతి హరిత రాయబారి 10కిలోల సేంద్రియ ఎరువుకు అవసరమైన తడిచెత్తను సేకరించాల్సి ఉంటుంది.

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వార్డు కమిటీలు
పంచాయతీ వార్డు సభ్యులకు ప్రస్తుతం బాధ్యతలు తక్కువే. ఈ నేపథ్యంలో వారిని కీలకంగా చేస్తూ ప్రతి వార్డు సభ్యుడికి ఒక అంగన్‌వాడీ కార్యకర్త లేదా ఆరోగ్య కార్యకర్తను తోడ్పాటుగా ఇచ్చి స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత అప్పగించారు. ఈ వార్డు కమిటీ ఆయా వార్డుల్లో చెత్తను వేర్వేరుగా ఎలా సేకరించాలనే విషయంపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తారు.

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం
గుర్రమ్మపాలెం గ్రామస్థులంతా స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చి ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. చెత్తను చెత్తలా కాకుండా సంపదలా చూడాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాం. గ్రామంలో పరిశుభ్రత పాటించాలని ప్రచారం చేస్తున్నాం. ఈ విషయంలో ప్రజలు సహకరిస్తున్నారు. త్వరలోనే గ్రామంలోని అన్ని వార్డుల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టి జిల్లాకే ఆదర్శంగా నిలుస్తాం.

– అక్కిరెడ్డి అర్జునమ్మ, సర్పంచి, గురమ్మపాలెం.