News

Realestate News

చరిత్రలో నిలిచిపోయేలా…

The history of the stand

చరిత్రలో నిలిచిపోయేలా…
భారీస్థాయిలో ఏయూ పూర్వవిద్యార్థుల సమ్మేళనం
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో ప్రత్యేక పాట చిత్రీకరణ
లోగో, అంతర్జాల చిరునామాలు సిద్ధం
28 వేల మందికి సమాచారం

ఈనాడు – విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి వర్సిటీ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికెదిగిన వేలాదిమందిని ఒకేతాటిపైకి తేవాలన్న బృహత్తర యజ్ఞాన్ని వర్సిటీ చేపట్టింది. వీరందరినీ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సూచనల మేరకు వర్సిటీలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 1926లో ఏర్పడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కళాశాలల నుంచి లక్షలాదిమంది విద్యార్థులు వివిధ కోర్సులు చేశారు. ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. అందుబాటులో ఉన్న దస్త్రాల ఆధారంగా 28 వేల మంది పూర్వవిద్యార్థులు, పలువురు ప్రముఖులను వర్సిటీ ఉన్నతాధికారులు గుర్తించారు. వీరందరినీ ఈ నెల 17న జరగబోతున్న పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆహ్వానించారు. ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. వర్సిటీ చరిత్ర, ప్రస్థానం కళ్లకు కట్టేలా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో ఆరు నిమిషాల నిడివి ఉన్న పాటను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చిత్రీకరించారు. ఇందుకోసం డ్రోన్‌ కెమెరాలను ఉపయోగించారు. పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన గ్రంధి మల్లికార్జునరావు వర్సిటీ పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తున్నారు. వీరందరినీ ఒకతాటిపైకి తెచ్చేలా ఒక అంతర్జాల చిరునామాను, యాప్‌ను కూడా రూపొందిస్తున్నారు. వీటిని, ప్రత్యేక పాటను, పూర్వవిద్యార్థుల సంఘ లోగోను, ఒక లేపుల్‌ను ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరిస్తారు. వర్సిటీలోని అన్ని విభాగాలు విద్యుద్దీపాలతో కాంతులీనేలా రాయ్‌పూర్‌ నుంచి ప్రత్యేకంగా అలంకరణ దండలను రప్పించారు. 17వ తేదీ కార్యక్రమం విజయవంతం కావటానికి 14 కమిటీలను వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వర్సిటీ మొదటి ఉపకులపతి సర్‌ సి.ఆర్‌.రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన పూర్వవిద్యార్థుల వారోత్సవాల పేరుతో కార్యక్రమాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. వారంపాటు పిల్లలకు క్విజ్‌లు, ఆటపాటల పోటీలు తదితర కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.

పూర్వ విద్యార్థులందరూ ఆహ్వానితులే…
ఆంధ్రవిశ్వవిద్యాలయ ప్రాంగణ కళాశాలల్లో యు.జి., పీజీ, పీహెచ్‌డీ, పీడీ డిప్లొమో తదితర కోర్సులన్నీ కలిపి మొత్తం రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు చదివినట్లు అంచనా. దస్త్రాల్లో ఉన్న సమాచారం మేరకు 28 వేల మందికి సమాచారం పంపాం. సుమారు వందమంది ప్రముఖుల్ని ఆహ్వానించాం. 17వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విభాగాల్లో సమావేశాలుంటాయి. రాత్రి ఏడుగంటల నుంచి తొమ్మిది గంటల వరకు వర్సిటీ స్నాతకోత్సవ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్వవిద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. రానున్న రోజుల్లో వర్సిటీ అనుబంధ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థుల్ని కూడా భాగస్వాముల్ని చేస్తాం. పూర్వవిద్యార్థుల అంతర్జాల చిరునామా, యాప్‌ అందుబాటులోకొచ్చాక.. ఎవరికి వారు తమ విద్యాసంవత్సరాల వారీగా వివరాలు నమోదు చేసుకుంటే సమాచార సేకరణ సులభమవుతుంది. పూర్వవిద్యార్థులు సంఘ ఈమెయిల్‌ చిరునామాaaa2016au1@gmail.com నుతమతమ వివరాలు పంపి పేర్లు రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

– ఆచార్య బి.మోహన్‌వెంకటరామ్‌, పూర్వవిద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి