News

Realestate News

చట్టసభల్లో చర్చలతోనే ప్రజా సమస్యల పరిష్కారం

చట్టసభల్లో చర్చలతోనే ప్రజా సమస్యల పరిష్కారం
శాసనమండలి ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్‌ సుబ్రహ్మణ్యం
విశాఖపట్నం, న్యూస్‌టుడే : సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సమస్యలుంటాయని, వాటిపై చట్టసభల్లో విస్తృత చర్చ జరిగితేనే పరిష్కారమవుతాయని శాసనమండలి ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. బుధవారం కమిటీ సభ్యులు అప్పన్న స్వామిని దర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. చట్టసభల్లో సమస్యలు ఎక్కువ చర్చించే సమయం తక్కువగా ఉంటుంది. కొన్ని రాజకీయ కారణాల వల్ల సమస్యలు చర్చకు రాకపోవడం, విలువైన సమయం వృథా కావడం జరుగుతోందన్నారు. దీని వల్ల ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయన్నారు. అటువంటి వాటిపై చర్చించి పరిష్కరించడం కోసమే ఫిర్యాదుల కమిటీ ఏర్పడిందన్నారు. తమ కమిటీ తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, విశాఖపట్నంలో 6 ఫిర్యాదులను స్వీకరించి వాటిపై విస్తృతంగా చర్చించామన్నారు. వీటిలో ఒకటి సింహాచలం దేవస్థానంలో పనిచేస్తున్న ఎన్నెమ్మార్లకు సంబంధించిందన్నారు. ఎన్నో ఏళ్లుగా శాశ్వత ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న ఎన్నెమ్మార్లకు శాశ్వత ఉద్యోగుల మాదిరిగా అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ ద్వారా వచ్చిన ఫిర్యాదును స్వీకరించి ఈవో రామచంద్రమోహన్‌తో చర్చించామన్నారు. ఛైర్మన్‌తో పాటు సభ్యులు గంగుల ప్రతాపరెడ్డి, మంతెన సత్యనారాయణ, అర్జున్‌ పాల్గొన్నారు. వీరు ముందుగా స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈవో రామచంద్రమోహన్‌ స్వామి చిత్రపటం అందజేశారు.